ఆరుగురు గంజాయి విక్రేతల అరెస్టు
నిందితుల్లో ఒకరు మైనర్
తెనాలిరూరల్: గంజాయి విక్రయిస్తున్న మైనర్ సహా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో గురువారం సాయంత్రం డీఎస్పీ బి.జనార్దనరావు వన్‌టౌన్ సీఐ మల్లికార్జునరావుతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన ఆరుమళ్ల సాహిత్ రెడ్డి, రెడ్డిబత్తుల హర్షవర్ధరెడ్డి, పాముల రిషిబాబు, తెనాలి రామలింగేశ్వరపేటకు చెందిన యర్రమోతు పవన్ ప్రశాంత్, నాజరుపేటకు చెందిన పసుపులేటి వెంకటేశ్వరరావు, గంగానమ్మపేటకు చెందిన మరో మైనర్ కలిసి వైకుంఠపురం రైల్వే అండర్ పాస్ వద్ద గంజాయి విక్రయిస్తుండగా అందిన సమాచారంతో గురువారం అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువచ్చి తెనాలిలో అమ్ముతున్నట్టు గుర్తించామని వెల్లడించారు. వీరి వద్ద నాలుగు కిలోల 50 గ్రాముల గంజాయితోపాటు రూ. 4,500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులను అరెస్ట్ చేసిన సీఐ మల్లికార్జునరావు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment