ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెరగాలి
బాపట్ల: ప్రభుత్వ సేవల్లో నాణ్యత, ప్రజల సంతృప్తి స్థాయి పెరగాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. ప్రభుత్వ సేవల్లో ప్రజాభిప్రాయంపై వివిధ శాఖల జిల్లా అధికారులతో శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సేవలన్నింటిలో బాపట్ల జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వ సేవలపై ప్రజాభిప్రాయ సేకరణను ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. పారదర్శక పాలన అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఐవీఆర్‌ఎస్, వాట్సాప్, క్యూఆర్ కోడ్ విధానంలో ఆర్‌టీజీఎస్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల సంతృప్తి స్థాయి నమోదు ఆధారంగా జిల్లాకు, శాఖలకు గ్రేడ్‌లు ప్రకటిస్తుందని పేర్కొన్నారు. క్రమశిక్షణ, వినయంతో సేవలను ప్రజలకు అందించాలని ఆయన సూచించారు. వైద్య సేవలు, అన్న క్యాంటీన్‌లో బాపట్ల జిల్లా 13వ ర్యాంకు, దీపం–2 లో మూడో ర్యాంక్, చెత్త సంపద కేంద్రాల నిర్వహణలో 15లో ఉందని వెల్లడించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని, అధికారులు శ్రద్ధతో పనిచేయాలని మార్గదర్శనం చేశారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్ గౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రైతుల శ్రేయస్సే లక్ష్యం
బాపట్ల: రైతుల శ్రేయస్సే లక్ష్యంగా అధికారులు పని చేయాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. రైతుల రిజిస్ట్రేషన్, యూరియా అమ్మకాలు, ఈ– పంట, ఈకేవైసీ, లోన్ల మంజూరుపై కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వ్యవసాయ శాఖ అధికారులతో వీక్షణ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతుల రిజిస్ట్రేషన్ గురించి మండలాల వారీగా ఆరా తీశారు. పీఎం కిసాన్‌లో ఉన్న డేటా, వెబ్‌ల్యాండ్‌లో వచ్చిన డేటా కచ్చితంగా ఉందా.. లేదా ? అని సరి చూసుకొని తర్వాతే ఆమోదం తెలపాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి, అదనపు ధరలతో అక్రమ విక్రయాలు చేస్తున్న షాపు యజమానులపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పారు. మార్కెట్లో వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఫిర్యాదులపై తక్షణమే క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని ఆదేశించారు. 40 కేజీల యూరియా బస్తా ధర రూ.256.50గా ప్రభుత్వం నిర్ణయించిందని, దానికి మించి అమ్మే వ్యాపారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని సూచించారు. అన్ని మండలాలలో యుద్ధప్రాతిపదికన తనిఖీలు చేసి నివేదిక తయారు చేయాలని రెవెన్యూ డివిజన్ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ– పంట రిజిస్ట్రేషన్ విషయంపై ఆరా తీశారు. తక్కువ రిజిస్ట్రేషన్ జరిగిన మండలాల అగ్రికల్చర్ అధికారులను కారణాలు అడిగి తెలుసుకున్నారు. సీసీఆర్సీ కార్డుల మంజూరులో ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులకు రుణాల మంజూరులో శ్రద్ధ వహించాలని సూచించారు. రైతులను గ్రూపులుగా ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. రుణాల వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు వాటిని తిరిగి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులకు రుణాల మంజూరులో బ్యాంకర్లకు భరోసా కల్పించాలని మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా వ్యవసాయ అధికారి రామకృష్ణ పాల్గొన్నారు.
కలెక్టర్ జె.వెంకట మురళి
Comments
Please login to add a commentAdd a comment