‘ఏక్ పేడ్ మాకే నామ్’తో పర్యావరణ పరిరక్షణ
మార్టూరు: తల్లి తన బిడ్డను ఎలా సంరక్షిస్తుందో మొక్క కూడా తల్లిలాగే పర్యావరణాన్ని పరిరక్షిస్తుందని, అందుకే మనమంతా తల్లి పేరుతో మొక్కలు నాటాలని ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవి చౌదరి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా మార్టూరు మండలం బొబ్బేపల్లిలోని కొండ సమీపంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బొబ్బేపల్లి కొండ ప్రాంతంలోని రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుదామని పిలుపునిచ్చారు. ఫారెస్ట్ భూమిలో మొక్కలు నాటడం కోసం గ్రామంలో అటవీ శాఖకు సంబంధించిన నర్సరీని ఏర్పాటు చేసేందుకు గ్రామస్తుల కోరికపై పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రీజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ఐకేవీ రాజు మాట్లాడుతూ బొబ్బేపల్లి కొండ చుట్టుపక్కల మొక్కల పెంచడం ద్వారా దిగువ ప్రాంతంలో నీటి లభ్యత పెరిగి పంటలు, పర్యావరణం అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. అనంతరం అధికారులు మొక్కలు నాటి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్ అధికారి ఎల్. భీమన్న, కూకట్లపల్లి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమేష్, బొబ్బేపల్లి సర్పంచ్ తాళ్లూరి లావణ్య, కోటేశ్వరరావు, మాజీ సర్పంచ్ దండా వీరాంజనేయులు, శరత్ పాల్గొన్నారు.
చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవి చౌదరి
Comments
Please login to add a commentAdd a comment