
ఫ్యాప్టో నూతన కార్యవర్గం ఎన్నిక
బాపట్ల టౌన్: జిల్లా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) నూతన కార్యవర్గ ఎన్నిక బుధవారం బాపట్లలో ప్రస్తుతం చైర్మన్ బడుగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. చైర్మన్‌గా ఏ. శేఖర్‌బాబు, కో–చైర్మన్లుగా బత్తుల వెంకటేశ్వర్లు, షేక్ ఘన్ సయ్యద్, డెప్యూటీ సెక్రటరీ జనరల్స్‌గా ఒ.వినయ్ కుమార్, గుడివాడ అమర్నాథ్, ఈ.నారాయణ, ట్రెజరర్‌గా దేవరకొండ ప్రసాదరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గం సభ్యులకు ధన్యవాదాలు తెలిపింది. ఎన్నికల పరిశీలకులుగా రాష్ట ఫ్యాప్టో కోశాధికారి చింతల సుబ్బారావు హాజరయ్యారు.
హత్యాయత్నం కేసులో ఏడేళ్ల జైలు శిక్ష
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో 2022 సెప్టెంబర్ 3న నమోదైన భార్య హత్యాయత్నం కేసులో భర్తకు ఏడేళ్ల జైలుశిక్ష విధిస్తూ మంగళగిరి సివిల్ జడ్జి ఎం.అంజనీప్రియదర్శిని బుధవారం తీర్పునిచ్చారు. భర్త తగరపు నాగరాజు వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనపై కత్తితో దాడిచేశాడని 2002 సెప్టెంబర్ 3న తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో పగడాల సంధ్యారాణి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మంగళగిరి సివిల్ జడ్జి ఎం.అంజనీ ప్రియదర్శిని వాద ప్రతివాదనలు విన్నారు. ఈ నేపథ్యంలో నాగరాజుకు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.
నేడు జీడీసీసీ బ్యాంకు
మహా జనసభ
కొరిటెపాడు(గుంటూరు వెస్ట్): గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మహాజన సభ గురువారం బ్యాంకు పర్సన్ ఇన్‌చార్జి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ అధ్యక్షతన బ్రాడీపేటలోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరగనుందని బ్యాంకు సీఈఓ కృష్ణవేణి బుధవారం తెలిపారు. సంఘ సభ్యులందరూ సమావేశానికి విధిగా హాజరు కావాలని ఆమె విజ్ఞప్తి చేశారు.