
మొరాయిస్తున్న సాగర్ కుడికాలువ గేట్లు
విజయపురిసౌత్: సుమారుగా 10.50లక్షల ఎకరాలకు సాగునీరందించే కుడి కాలువ గేట్లు మూడేళ్లకే మరమ్మతులకు లోనయ్యాయి. 8వ గేటు కిందికి దిగకపోవడంతో గురువారం ఎమర్జెన్సీ గేటు ద్వారా దానిని మూసివేసి 2వ గేటు ద్వారా కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్‌కు మూడు గేట్లు ఉండగా, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌కు 9 గేట్లు ఉన్నాయి. మూడేళ్ల క్రితం కుడి కాల్వ 9వ గేటు కిందికి, పైకి జరుగకపోవడంతో బలవంతగా కిందికి దింపేందుకు ప్రయత్నం చేయగా ఊడిపోయి కాలువలోకి కొట్టుకు పోయింది. ఆ గేటును అమర్చకపోవటంతో చాలా రోజులు వరకు నీటి విడుదల కొనసాగింది. ఆ సమయంలోనే కుడి, ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్దగల తూములకు కొత్తగేట్లకు టెండర్లు పిలిచారు. 9వ గేటు మరమ్మతులు చేశాక అదే కంపెనీకి పనులు అప్పగించారు. కుడి హెడ్ రెగ్యులేటర్ గేట్లకు తొమ్మిదింటికిగాను రూ.3.30కోట్లు, ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ మూడు గేట్లకు రూ.2.50కోట్లు, సూట్ గేటుకు రూ.1.50కోట్లకు 2022లో టెండర్లు పిలిచి పనులు చేయించారు. అవికాస్త అప్పుడే మరమ్మతులకు గురైనట్లు సమాచారం. విద్యుదుత్పాదన కేంఽద్రం ద్వారా కుడి కాలువకు నీటిని విడుదల చేయడంతో హెడ్‌రెగ్యులేటర్ గేట్లు అంతగా వినియోగించ లేదు. నీటి అవసరాల మేరకు ఎక్కువగా 2,9వ గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ఇటీవలే ఈ రెండు గేట్లు మూసివేసి 8వగేటు ద్వారా నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం దానిని మూసేందుకు ప్రయత్నించగా కిందికి దిగలేదు. దీంతో ఇంజినీర్లంత శ్రమించి ఎట్టకేలకు మూసివేశారు. ప్రస్తుతం 2వ గేటు ద్వారా 3,031 క్యూసెక్కులు కుడి కాలువకు విడుదల చేస్తున్నారు. బుధవారం వరకు 4050 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.