
భారీ దొంగతనం
ఇంకొల్లులో
ఇంకొల్లు (చినగంజాం): బాపట్ల జిల్లా ఇంకొల్లులో భారీ దొంగతనం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోకి చొరబడి బీరువాలో దాచి ఉంచిన రూ.55.50 లక్షల నగదు, రూ.20 లక్షల విలువైన బంగారు నగలు అపహరించుకుని తీసుకెళ్లారు. ఎస్‌ఐ జీ సురేష్ అందించిన సమాచారం ప్రకారం... ఇంకొల్లు గ్రామంలో ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న ఇంటిలో జాగర్లమూడి శివప్రసాద్ నివాసం ఉంటున్నారు. ఆయన రెండో అంతస్తులో నిద్రిస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మూడో అంతస్తులోకి ప్రవేశించి గది తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న రూ.55.50 లక్షల నగదు, 24 సవర్ల బంగారు వస్తువులను అపహరించి తీసుకెళ్లారు. ఉదయం నిద్ర లేచిన ఆయన దొంగతనం జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఇంకొల్లు సీఐ వైవీ రమణయ్య, ఎస్‌ఐ జీ సురేష్‌లు క్లూస్ టీంను పిలిపించి వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. తాను డైరెక్టర్‌గా ఉన్న ఎంఆర్‌ఆర్ ప్రకాశం హైస్కూల్ విద్యార్థుల ఫీజులు రూ.20 లక్షలు, పంట అమ్మిన డబ్బు రూ.30 లక్షలు, వ్యాపారం ద్వారా తన సోదరులు సంపాదించిన రూ.5.50 లక్షల నగదుతోపాటు రూ.20 లక్షల విలువైన బంగారు నగలు అపహరణకు గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
● రూ.55 లక్షల నగదు,
24 సవర్ల బంగారం దోపిడీ
● రంగంలోకి దిగిన క్లూస్ టీం
● కేసు నమోదు చేసి దర్యాప్తు
చేపట్టిన పోలీసులు