చీరాలలో ఇసుక తోడేళ్లు! | - | Sakshi

చీరాలలో ఇసుక తోడేళ్లు!

Apr 11 2025 1:34 AM | Updated on Apr 11 2025 1:34 AM

చీరాల

చీరాలలో ఇసుక తోడేళ్లు!

● ఇష్టారాజ్యంగా ఇసుక దోపీడీ ● నియోజకవర్గ ముఖ్యనేతకు నెలకు రూ. 30 లక్షలు కప్పం! ● అసైన్డ్‌ భూముల్లో భారీగా తవ్వకాలు ● రోజుకు 100 ట్రాక్టర్లు, 50 టిప్పర్లతో పగలు, రాత్రి రవాణా ● మామూళ్ల మత్తులో రెవెన్యూ, మైనింగ్‌, పోలీసు అధికారులు

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: అధికార పార్టీ నాయకుడు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నాడు. చీరాల నియోజవర్గంలో ఇసుక అక్రమ తరలింపు కోసం కర్లపాలెం మండలం యాజిలికి చెందిన ఓ పచ్చ నాయకుడు రూ. 30 లక్షలకు పాట పాడుకున్నాడు. ప్రతి నెల చీరాల నియోజకవర్గం నుంచి అక్రమంగా ఇసుక తరలించు కోవడానికి టీడీపీ నియోజకవర్గ ముఖ్య నేతకు ఈ కప్పం కడుతున్నాడు. ఉచితం మాటున యంత్రాలతో తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్లతో అక్రమంగా తరలిస్తున్నాడు. ఈ అక్రమ తరలింపు వ్యవహారం తెలిసినా డ్రైనేజీ, రెవెన్యూ, పోలీసు, మైనింగ్‌ అధికారులకు నెలనెలా మామూళ్లు తీసుకొని చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి.

నిత్యం వందల సంఖ్యలో తరలింపు..

చీరాల నియోజవర్గం పరిధిలో ప్రధానంగా వేటపాలెం మండల పరిధిలోని పందిళ్లపల్లి, రామన్నపేట, సముద్రతీర గ్రామాల పరిధిలో అసైన్డ్‌ భూముల నుంచి పొక్లెయిన్‌లతో ఇసుక తవ్వి ట్రాక్టర్లు, లారీ టిప్పర్లతో నూతనంగా నిర్మిసున్న వాడరేవు – పర్చూరు జాతీయ రహదారి మీదుగా నూతనంగా వేసే లేఅవుట్‌లకు నిత్యం వంద సంఖ్యలో ఇసుక లోడులు తరలిస్తున్నారు. ప్రతిరోజూ 100 నుంచి 150 లోడ్లు వరకు డంప్‌ అవుతున్నాయి. ట్రాక్టర్‌ ఇసుక రూ.4వేల నుంచి రూ.5 వేలకు విక్రయిస్తున్నారు. టిప్పర్‌ ఇసుక క్వాలిటీని బట్టి రూ. 25వేల నుంచి రూ. 40 వేల వరకు విక్రయిస్తున్నారు.

వీళ్లే కీలకం...

పందిళ్లపల్లికి చెందిన టీడీపీ చెందిన మరో ముగ్గురు ఇసుక మాఫియా సిబ్బందిని యాజిలికి చెందిన పచ్చనాయకుడు ఏర్పాటు చేసుకున్నాడు. వీరు ముగ్గురు ఈ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు ఇసుక తరలించి డబ్బులు వసూలు చేసి ఆ నేతకు చెల్లిస్తుంటారు. చీరాల ప్రాంతంలో తాను మినహా వేరెవరూ ఇసుకను విక్రయించేందుకు వీలులేదని సదరు పచ్చనేత హుకుం జారీ చేయడంతో చీరాల ప్రాంతంలో ఇతని ఇసుక వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. మిగిలిన వారికి ఇసుక దిబ్బలు ఉన్నా అమ్ముకోవడానికి వీలులేదు. కాదూ కూడదని తరలించే ప్రయత్నం చేస్తే వెంటనే తహసీల్దార్‌, పోలీసులు ట్రాక్టర్లను సీజ్‌ చేయిస్తారు. ఇసుక మాఫియా నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.

జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసినా..

పందిళ్లపల్లి శివారు నుంచి అక్రమంగా ఇసుక తలిస్తున్నారని యానాది కాలనీకి చెందిన ఎస్టీ వర్గీయులు జాతీయ ఎస్టీ కమిషన్‌కి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్టీ కమిషనర్‌ కోర్టులో విచారణ జరుగుతుంది. అయినప్పుటికీ పట్టించుకోని ఇసుక మాఫియా భారీస్థాయిలో గుంటలు తవ్వి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు.

మాఫియాకి కొమ్ముకాస్తున్న ఖాకీలు!

గత నెలలో పందిళ్లపల్లికి చెందిన ఒక ప్రైవేట్‌ వ్యక్తి తన సొంత పొలం నుంచి తన ట్రాక్టర్‌ లో ఇసుక తరలించుకుంటుండగా గమనించిన ఇసుక మాఫియా నాయకులు బైపాస్‌ రోడ్డులో ట్రాక్టర్‌ని అడ్డుకున్నారు. దీని పై ట్రాక్టర్‌ యజమాని మీరెవరు నా ట్రాక్టర్‌ని ఆపడానికి ప్రభుత్వ ఉద్యోగులా లేకా పోలీసులా అని నిలదీయడంతో చేసేది లేక మాఫియా నాయకులు వేటపాలెం ఎస్‌ఐకి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు హుటాహుటిన ఆ ట్రాక్టర్‌ను పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. ఈ విషయానికి సంబంధించి ట్రాక్టర్‌ యజమాని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఎస్పీ ట్రాక్టర్‌ని పోలీస్‌స్టేషన్‌కు తరలించిన కానిస్టేబుల్‌ కోటేశ్వరరావుని విధుల నుంచి తప్పించి వీఆర్‌కి పంపించారు. ఈ విషయంలో ఎస్‌ఐ చాకచక్యంగా తప్పుకోవడం గమనార్హం.

చీరాలలో ఇసుక తోడేళ్లు! 1
1/1

చీరాలలో ఇసుక తోడేళ్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement