
రసవత్తరంగా కొండవీడు నాటికల పోటీలు
యడ్లపాడు: కొండవీటి కళాపరిషత్ 26వ జాతీయస్థాయి నాటికల పోటీలు లింగారావుపాలెంలో ఆదివారం కొనసాగాయి. బోయపాలెం శ్రీఅనంతలక్ష్మి నూలుమిల్లు చైర్మన్ సామినేని కోటేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేయగా, ఎంపీటీసీ సభ్యుడు తోకల వీరరాఘవయ్య నటరాజపూజతో రెండోరోజు పోటీలను ప్రారంభమయ్యాయి. పోసాని సుబ్బారావు చౌదరి స్మారక వేదికపై మహాకవి కాళిదాసు కళా ప్రాంగణాన మూడు చైతన్య కళారూపాల్ని ప్రదర్శించారు.
సామాన్య మహిళ అసామాన్య పోరాటం
‘జనరల్ బోగీలు’
ఖర్చు తక్కువగా ఉండే రైలు ప్రయాణంలో ప్రభుత్వం జనరల్ బోగీల సంఖ్యను తగ్గించడంతో కూర్చేనే ఖాళీలేక కిటికీలపై, టాయిలెట్‌లోనూ కూర్చుని ప్రయాణించే సామాన్యుల అవస్థలకు ప్రతిరూపమే ‘జనరల్ బోగీలు’ నాటిక. ఒకవేళ రైలు ప్రమాదం జరిగినా, జనరల్ బోగీల్లో ప్రయాణించే వారి వివరాలు రైల్వేశాఖ వద్ద ఉండవు. దీంతో టిక్కెట్ ఉన్నా గుర్తింపులేని ప్రయాణికుల్లా వారి చరిత్రలు, కుటుంబాల బాధలు గాలిలో కలిసిపోతాయి. ఇలా రైలు ప్రమాదంలో తన కొడుకును కోల్పోయిన సావిత్రమ్మ రైల్వేశాఖ నిర్లక్ష్యంపై ఉత్త రాల పోరాట ఉద్యమానికి శ్రీకారం చుట్టి జనరల్ బోగీల ప్రయాణికుల జనగొంతుక అవుతుంది. శ్రీ సాయి ఆర్ట్స్(కొలకలూరు) వారు ప్రదర్శించిన ఈ నాటికకు పీటీ మాధవ్ రచించగా, గోపరాజు విజయ్ దర్శకత్వం వహించారు.
హృదయ వేదికపై నిత్యం కొలువుండే
‘అ..సత్యం’ నాటిక
మనిషి హృదయం దైవత్వానికీ, రాక్షసత్వానికీ వేదిక. అందులోని స్వార్థం, భయం ప్రతి సత్యానికీ–అసత్యానికీ మూలంగా మారుతాయని సందేశాన్ని అందించే కథనమే ‘ అ..సత్యం’ నాటిక. కనబడేదంతా సత్యం కాదని..కనబడనిదంతా అసత్యం కాదు. ఏ యథార్థమైనా చెడుకు దోహదపడితే అది అసత్యంగా, అబద్ధమైనా మంచికి మార్గం అయితే అది సత్యంగా సందర్భానుసారంగా స్వీకరించాల్సి వస్తుంది. అన్నింటికీ మూలం మనసు.. అందులోని స్వార్థమని సంఘటన ద్వారా చూపిన కథనం ఇది. చెతన్య కళాస్రవంతి (ఉక్కునగరం–విశాఖ) వారు సమర్పించిన ఈ నాటికను పిన్నమనేని మృత్యుంజయరావు రచించగా, పి.బాలాజీ నాయక్ దర్శకత్వం వహించారు.
కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షుడు కట్టా శ్రీహరిరావు, ఉపాధ్యక్షులు తోకల సాంబశివరావు, నంబూరు వీరాంజనేయులు, కార్యదర్శి మండెపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
రెండోరోజు మూడు ప్రదర్శనలు
న్యాయవాద వృత్తికి అద్దంపట్టే ‘27వ మైలురాయి’ నాటిక
న్యాయమంటే కోర్టు తీర్పు కాదని.. అది నైతికత, సమాజం పట్ల బాధ్యత అంటూ న్యాయవాద వృత్తికి అద్దం పట్టే కళారూపమే ‘27వ మైలురాయి’ నాటిక. న్యాయవాదులు న్యాయం కోసం అన్న విషయాన్ని విస్మరించి క్లయింటు వాదులుగా మారొద్దని, ‘న్యాయాన్ని వాదించడం’ కన్నా ‘న్యాయంగా ఉండడం’ మిన్న అంటూ 1993లో జరిగిన కొన్ని యధార్థ సంఘటనలతో సందేశాన్ని ఇచ్చే నాటిక. యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్(విజయవాడ) వారు సమర్పించిన ఈ నాటికకు టి.మాధవ్ రచన, ఆర్.వాసుదేవరావు దర్శకత్వం వహించారు.

రసవత్తరంగా కొండవీడు నాటికల పోటీలు