
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: నిఘా నిద్ర పోతుంటే దగా దండుకుంటోంది అన్నట్టుగా మారింది జిల్లాలో మద్యం అమ్మకాల పరిస్థితి. ముఖ్యంగా పాల్వంచ కేంద్రంగా మద్యం సిండికేట్ పేరుతో యథేచ్ఛగా మద్యాన్ని కల్తీ చేస్తూ మందుబాబుల జేబులకు చిల్లులు పెట్టడంతో పాటు ఆరోగ్యానికీ హాని కలిగిస్తున్నారు.
కల్తీకి తెరలేపారు..
బెల్ట్‌షాపుల్లో మద్యం అమ్మడం ఎక్సైజ్ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఒకసారి బెల్ట్‌షాపులకు మద్యం తరలిందంటే దాని క్వాలిటీ, ధర గురించి అడిగేవారే ఉండరు. అందినకాడికి దోచుకోవడమే ‘బెల్ట్’ నిర్వాహకుల లక్ష్యం. దీంతో మద్యం సిండికేట్ తమ గల్లాపెట్టెను మరింత వేగంగా నింపుకునేందుకు అధిక ధరలకు తోడుగా మద్యం కల్తీకి పాల్పడుతోంది. బెల్ట్‌షాపులకు తరలించే మద్యం బాటిళ్లలో నాసిరకం స్పిరిట్‌ను కలపడం, ఎక్కువ ధర కలిగిన లిక్కర్ బ్రాండ్ సీసాలో తక్కువ ధరకు లభించే మద్యాన్ని కొంత మేర కలిపేస్తూ ప్రత్యేక కౌంటర్లు, ఆటోల ద్వారా బెల్ట్‌షాపులకు ఎలాంటి బెరుకు లేకుండా తరలించేస్తున్నారు. ఈ దందాకు అడ్డుకట్ట వేయాల్సిన ఎక్సైజ్ అధికారులు మామూళ్లతో సరిపెట్టుకుంటుండటంతో ఇక్కడి సిండికేట్ మాఫియా పక్క రాష్ట్రాలకు సైతం కల్తీ మద్యాన్ని తరలించేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తనిఖీలు ఏవి..
ఎకై ్సజ్ శాఖ పనితీరులో పారదర్శకతపై నలువైపులా విమర్శలు, ఆరోపణలు వస్తున్నా, పనితీరులో మార్పు రావడం లేదు. తమ ఫోకస్‌ను పూర్తిగా గంజాయి అక్రమ రవాణాపై పెట్టి.. బెల్ట్‌షాపుల దందాను చూసీ చూడనట్టుగా వదిలేస్తున్నారు. దీనికి ప్రతిఫలం సైతం మద్యం సిండికేట్ నుంచి భారీగా అందుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక వైన్స్, బార్లలో అమ్మే మద్యం నాణ్యతను తరచుగా ఎక్సైజ్ అధికారులు పరీక్షించాల్సి ఉంటంది. వైన్స్, బార్ల నుంచి శాంపిళ్లు సేకరించి ల్యాబుల్లో పరీక్ష చేయించాల్సి ఉంటుంది. పట్టపగలే ఆటోల్లో అక్రమంగా బెల్ట్ దుకాణాలకు మద్యం తరలిపోతుంటే పట్టించుకోని అధికారులు ఇక క్వాలిటీ, కల్తీ గురించి పట్టించుకునేది ఎప్పుడనే విమర్శలు వస్తున్నాయి.
టాస్క్‌ఫోర్స్ రావాలి..
గతంలో పాల్వంచ కేంద్రంగా కల్తీ మద్యం రాకెట్ వెలుగు చూసింది. ఆ తర్వాత ఇక్కడ బెల్ట్‌షాపుల్లో అధిక ధరలతో తమ జేబులకు చిల్లులు పెట్టడంపై మద్యం ప్రియుల నుంచి విమర్శలు వచ్చాయి. ఆఖరికి స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగి హైదరాబాద్ స్థాయిలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో గతేడాది స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఇక్కడ ప్రత్యేకంగా దాడులు నిర్వహించి కొందరు ఎక్సైజ్ అధికారులపై వేటు వేసింది. ఫలితంగా కొంతకాలం పాటు సిండికేట్ ఆగడాలకు అడ్డుకట్ట పడింది. కానీ టాస్క్‌ఫోర్స్ దాడులు తగ్గిపోవడంతో మరోసారి లిక్కర్ సిండికేట్ పడగ విప్పడం ప్రారంభించింది. దీంతో సిండికేట్ ఆట కట్టించాలంటే మరోసారి స్టేట్ టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.
సర్వం..బెల్ట్ మయం
పాల్వంచ పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా 5 బార్లు, 8 వైన్స్ షాపులు ఉన్నాయి. ఇటీవల మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ఇష్టారీతిన మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. గరిష్ట అమ్మకం ధరపై వచ్చే లాభం సరిపోవడం లేదంటూ దొడ్డి దారిన భారీ ఎత్తున మద్యాన్ని బెల్ట్‌షాపులకు తరలిస్తున్నారు. అక్కడ క్వార్టర్ బాటిల్‌పై అదనంగా రూ.20, బీరు బాటిల్‌పై రూ.30 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. పట్టణంలోని గల్లీలతో పాటు మండల పరిధిలోని 36 గ్రామ పంచాయతీల్లో బెల్ట్‌షాప్ నెట్‌వర్క్ ఏర్పాటు చేశారు. ప్రతీరోజు వైన్‌షాపుల్లోని ప్రత్యేక కౌంటర్ల ద్వారా మద్యాన్ని బెల్ట్ షాపులకు యఽథేచ్ఛగా తరలిస్తున్నారు. పట్టణంలోని వైన్ షాపుల నుంచి కిన్నెరసాని వైపు ఉన్న గ్రామాల సిండికేట్ షాపులకు మద్యం సరఫరా అవుతోంది. పెద్దమ్మగుడి వద్ద గల షాపుల నుంచి జగన్నాధపురం, కేశావాపురం, సోములగూడెం, సంగెం, దంతెలబోర, రంగాపురం, తోగ్గూడెం తదితర ప్రాంతాల్లోని షాపులకు తరలిస్తున్నారు.
ఫిర్యాదు చేస్తే చర్య తీసుకుంటాం
నేను జిల్లాలో కొత్తగా బాధ్యతలు స్వీకరించాను. గతేడాది పాల్వంచ మండలం నుంచి కల్తీ మద్యంపై ఒక ఫిర్యాదు రాగా శాంపిళ్లు సేకరించాం. అందులో కల్తీ ఏమీ తేలలేదు. కల్తీ మద్యంపై ఫిర్యాదులు వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
– జానయ్య, ఎక్సైజ్ సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment