
దివ్యాంగురాలికి ట్రైసైకిల్ అందజేస్తున్న కలెక్టర్, ఎమ్మెల్యే వనమా తదితరులు
కొత్తగూడెంటౌన్: దివ్యాంగులు స్వశక్తితో ఎదగాలని కలెక్టర్ అనుదీప్, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు అన్నారు. ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సీఎస్సార్ నిధులతో దివ్యాంగుల కోసం కొనుగోలు చేసిన సహాయ ఉపకరణాలను కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మనిషి ఎదుగుదలకు వైకల్యం అడ్డుకాదని, అంగవైకల్యాన్ని అధిగమించి అందరితో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. దివ్యాంగులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తోందని చెప్పారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణిలో సహాయ పరికరాలు కావాలని దివ్యాంగులు వినతులు ఇస్తున్నారని, వాటి ప్రకారం లబ్ధిదారుల ఎంపికకు ఆరు నెలలుగా కసరత్తు చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో 405 మందికి వివిధ రకాల పరికరాలను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈసీఐఎల్ కంపెనీ దివ్యాంగులకు అవసరమైన పరికరాలను ఇచ్చేందుకు ముందుకురావడం హర్షణీయమని అన్నారు. రూ.40 లక్షల సీఎస్సార్ నిధులతో 741 సహాయ పరికరాలను అందజేసినట్లు వివరించారు. జిల్లాలో 30,173 మంది దివ్యాంగులు ఉండగా, వారిలో 18,051 మంది శారీరక దివ్యాంగులు, 3,715 మంది మూగ, చెవిటి వారు, 4,314 మంది మానసిక దివ్యాంగులు, 4,093 మంది అంధులు ఉన్నారని తెలిపారు. వారిలో 407 మందిని ప్రస్తుతానికి ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, జెడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి స్వర్ణలత లెనీనా, ఈసీఐఎల్ అడిషనల్ జనరల్ మేనేజర్ మునికృష్ణ, ఈసీఐఎల్ సీనియర్ వైద్యాధికారి విఽశ్వనాథరెడ్డి, పర్సనల్ అథికారి సునీల్‌కుమార్, సీనియర్ మేనేజర్లు రాజేష్, కె.శ్రీనివాసరావు, యూనిట్ మేనేజర్ బాలకృష్ణ, స్థానిక కౌన్సిలర్ లక్ష్మణ్, దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుండపనేని సతీష్ పాల్గొన్నారు.
ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేస్తాం
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాన్ని మార్చి 15 వరకు పూర్తి చేస్తామని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఫ్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టాలు లేకుండా నిర్మించిన ఇళ్ల సమాచారం సేకరణ, కంటి వెలుగు, రెండు పడక గదుల ఇళ్లు, ఆయిల్‌పామ్ సాగు తదితర అంశాలపై కలెక్టర్లతో చర్చించారు. ఈ సందర్భంగా అనుదీప్ మాట్లాడుతూ.. జిల్లాలో 16,860 ఎకరాల్లో పామాయిల్ సాగు చేయాలని లక్ష్యం కాగా, ఇప్పటికి 13,575 ఎకరాల్లో పూర్తి చేశామని, మిగిలిన 3,285 ఎకరాల్లో వచ్చే నెల 15 నాటికి పూర్తి చేస్తామని వివరించారు. మొక్కలు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. కంటి వెలుగు పరీక్షల నిర్వహణలో రీడింగ్ అద్దాలను తక్షణమే పంపిణీ చేస్తున్నామని, ప్రిస్కిప్షన్ కంటి అద్దాలు పంపిణీ చేసిన వివరాలను పోర్టల్‌లో నమోదు చేస్తామని చెప్పారు. లబ్ధిదారులకు మార్చిలో క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. చెప్పారు. పోడు పట్టాల జారీకి జిల్లా స్థాయిలో కమిటీ వేసి, పట్టాల ముద్రణ ప్రక్రియ చేపట్టామని చెప్పారు. జిల్లాలో పోడు పట్టాల జారీ ప్రక్రియ, కంటి వెలుగు కార్యక్రమాల నిర్వహణ తీరును సీఎస్ అభినందించారు. సమావేశంలో డీఎఫ్‌ఓ రంజిత్ నాయక్, అదనపు కలెక్టర్ కె. వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ శిరీష, ఉద్యాన అధికారి మరియన్న, వ్యవసాయాధికారి అభిమన్యుడు, డీఆర్‌ఓ అశోకచక్రవర్తి, కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీఓలు స్వర్ణలత, రత్నకళ్యాణి, ఆర్‌ఔఫ్‌ఆర్ డీటీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment