
అమ్మవారికి పంచామృతాభిషేకం చేస్తున్న అర్చకులు
పాల్వంచరూరల్: మండల పరిధిలో వేంచేసి ఉన్న శ్రీ పెద్దమ్మతల్లి(కనకదుర్గమ్మ) అమ్మవారికి శుక్రవారం పంచామృతాభిషేకం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా మేళతాళాలతో అమ్మవారి జన్మస్థలం వద్ద పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం మూలవిరాట్ అమ్మవారికి అభిషేకం గావించిన అర్చకులు నివేదన, పంచహారతులు, నీరాజన మంత్రపుష్పార్చన నిర్వహించారు. కార్యక్రమంలో వేద పండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్‌శర్మ, దుర్గాప్రసాద్ శర్మ పాల్గొన్నారు.
స్వర్ణకవచధారుడైన భద్రాద్రి రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు శుక్రవారంస్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. కాగా, శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు, సాయంత్రం దర్బారు సేవ నిర్వహించారు.
28న కొత్తగూడెం క్లబ్‌లో జాబ్‌మేళా
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం క్లబ్‌లో ఈనెల 28న మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి వేల్పుల విజేత తెలిపారు. విప్రో, అపోలో ఫార్మసీ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ముత్తూట్ గ్రూప్, గూగుల్ పే, ఎయిర్‌టెల్, వరుణ్ మోటార్స్, కియో మోటార్స్, ఎల్‌ఐసీ, ప్లిఫ్‌కార్డ్ తదితర సంస్థల్లో సుమారు 3 వేలకు పైగా ఖాళీల భర్తీకి ఈ జాబ్‌మేళా ఏర్పాటుచేసినట్లు వివరించారు. ఆసక్తి గల నిరుద్యోగులు అన్ని సర్టిఫికెట్లు, బయోడేటాతో హాజరుకావాలని సూచించారు.

నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
Comments
Please login to add a commentAdd a comment