
సోంపెల్లి వద్ద బోల్తా పడిన జామాయిల్ ట్రాక్టర్ (ఫైల్)
ఈ నెల 8న బూర్గంపాడు మండలం పినపాక పట్టీనగర్ వద్ద ఓవర్ లోడ్‌తో వెళ్తున్న ఓ ఇసుక లారీ ఢీకొట్టి పాల్వంచ మండలం బండ్రిగొండ గ్రామానికి చెందిన నెల్లెల రంజిత్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు.
ఈ నెల 20న ఒడిశాలో జామాయిల్ లోడింగ్‌కు వెళ్లిన ట్రాక్టర్ తిరగబడి సారపాకకు చెందిన సున్నం నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇదే నెలలో బూర్గంపాడు మండలం సోంపెల్లి గ్రామం వద్ద జామాయిల్ లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ తిరగబడి దమ్మపేట మండలానికి చెందిన చిక్కినేని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు.
పై ఘటనలను పరిశీలిస్తే వాహనాల యజమానుల అత్యాశ, రవాణా శాఖ, మైనింగ్ ఇతర ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం.. వెరసి నిరుపేద కూలీలు, డ్రైవర్ల ప్రాణాలను హరిస్తున్నాయి. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
భద్రాచలం: వాహనాల్లో జామాయిల్ కర్ర, ఇసుక తరలిస్తున్న యజమానులు ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోవడం లేదు. ఓవర్ లోడ్‌తో వెళ్తున్న వాహనాలు బోల్తా పడటం, రోడ్డు ప్రమాదాలకు కారణమవడంతో పలువురు మృత్యువాత పడుతున్నారు. రాత్రి వేళల్లో బైక్‌లను ఢీకొడుతుండటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు.
జామాయిల్ ఓవర్ లోడింగ్‌తో..
జిల్లాలో సారపాక వద్ద ఉన్న ఐటీసీ పీఎస్‌పీడీ పేపర్ మిల్లుకు ముడి సరుకుగా అవసరమైన జామాయిల్ పెంపకానికి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాలు అనువుగా ఉన్నాయి. దీంతో జామాయిల్ తోటల పెంపకం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. పెంపకం అనంతరం కొట్టిన జామాయిల్ కలపను ట్రాక్టర్ ద్వారా కాంట్రాక్టర్‌లు, రైతులు ఐటీసీకు తరలిస్తారు. రాజమండ్రి, ఇతర జిల్లాల నుంచి సుమారు రోజుకు 120 నుంచి 150 ట్రాక్టర్‌లు జామాయిల్‌ను తీసుకొస్తుంటాయి. ఈ తరలించే క్రమంలో నిర్దిష్ట ప్రమాణాల కంటే ఎక్కువ టన్నులు లోడింగ్ చేయటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాస్తవానికి ట్రాక్టర్ వెనుక భాగంలో కేవలం 10 టన్నులను మాత్రమే తరలించాల్సి ఉండగా 15 నుంచి 17 టన్నుల వరకు లోడింగ్ చేస్తున్నారు. దీంతో వాహనాలు అదుపుతప్పి బోల్తా పడటమో, ఇతర వాహనాలను ఢీకొట్టడమో జరుగుతోంది.
అధికారుల చేతివాటం..
వాహనాల రాకపోకలపై, ఓవర్‌లోడింగ్‌పై నిరంతర పర్యవేక్షణ చేయాల్సిన రవాణా శాఖ, మైనింగ్, ఇతర సంబంధిత శాఖ అధికారులు నిద్రావస్థలో ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ప్రమాదాలు జరిగాక, బాధితులు ప్రాణాలు కోల్పోయాక నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తూ, జరిమానాలు విధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల వరుస సంఘటనల్లో పలువురు మృత్యువాత పడ్డాక నెమ్మదిగా తేరుకున్న రవాణా శాఖ అధికారులు.. గత రెండు రోజుల నుంచి జామాయిల్ ఓవర్ లోడింగ్ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. జరిమానాలు విధిస్తున్నారు. అయితే భద్రాచలంలోని రవాణా శాఖ కార్యాలయం ముందు నుంచే నిరంతరం ఓవర్ లోడ్‌తో వెళ్తున్న జామాయిల్ ట్రాక్టర్లను పట్టుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక మామూళ్ల మత్తులో జోగే మైనింగ్ శాఖ అధికారులు ఓవర్ లోడ్‌తో వెళ్తున్న ఇసుక లారీలను పట్టుకున్న దాఖలాలు లేవు. హైదరాబాద్ నుంచి వచ్చే స్పెషల్ టాస్క్ అధికారులు పట్టుకోవడం తప్ప స్థానిక అధికారులు పట్టుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఇసుకాసురులకు కాసులు.. ప్రయాణికులకు యమపాశాలు..
ఇసుకాసురులు లారీల్లో ఇసుక ఓవర్ లోడ్‌తో తరలిస్తున్నారు. వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, మణుగూరులతో పాటు గోదావరి పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుక వాహనాలు నిత్యం హైదరాబాద్‌తో సహా ఇతర జిల్లాలకు వెళ్తుంటాయి. వీటిలో ఏ ఒక్క లారీ కూడా రవాణా, మైనింగ్ శాఖ నిబంధనలు పాటించవు. 10 టైర్లు ఉన్న లారీ 20 టన్నులతో వెళ్లాల్సి ఉండగా 25 నుంచి 26 టన్నులు, 12 టైర్ల లారీ 26 టన్నులతో వెళ్లాల్సి ఉండగా సుమారు 32 టన్నులకు పైగానే ఓవర్ లోడ్‌తో తిప్పుతున్నారు. ఇసుక ర్యాంప్, వాహన యజమానులు డబ్బులను పోగు చేసుకుంటుండగా ప్రమాదాలతో రోడ్లపై రాకపోకలు సాగిస్తున్నవారు మృత్యువాత పడుతున్నారు. ఓవర్ లోడింగ్‌తో వెళ్తున్న లారీ ఇటీవల ఓ వాహనాన్ని క్రాస్ చేస్తూ పినపాక వద్ద ఓ నిరుపేద కూలీ మృతికి కారణమయింది. జిల్లాలోని ప్రధాన రహదారులన్నీ చిధ్రం అవుతున్నాయి.

ప్రమాదంలో దెబ్బతిన్న ద్విచక్రవాహనం(ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment