
డీజిల్ పట్టుకుంటున్న స్థానికులు
దమ్మపేట : మండల పరిధిలోని ముష్టిబండ గ్రామశివారులో డీజిల్ ట్యాంకర్ బోల్తాపడిన సంఘటన శుక్రవారం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ట్యాంకర్ నుంచి డీజిల్ కారిపోతుండగా స్థానికులు, వాహనదారులు బిందెలు, బకెట్లలో నింపుకుని తీసుకెళ్లారు. ఈ క్రమంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మామకన్ను డీఆర్‌ఓ సస్పెన్షన్
గుండాల: కాచనపల్లి రేంజ్ పరిధిలోని మామకన్ను సెక్షన్‌లో వివిధ గ్రామాల నుంచి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో డీఆర్‌ఓ జాహెదా బేగంను జిల్లా అధికారులు శుక్రవారం సస్పెండ్ చేశారు. సంవత్సర కాలంగా మామకన్ను సెక్షన్ పరిధిలో టేకు కలపను అక్రమంగా తరలిస్తున్నట్లు, కార్పెంటర్ల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు స్థానికుల నుంచి అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో విచారణ చేపట్టిన అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు.
ఎద్దులు అపహరణ
దుమ్ముగూడెం: మండలంలోని వర్క్‌షాపు, కమలాపురం గ్రామాల్లో ఇద్దరు రైతులకు చెందిన మూడు ఎద్దులను దొంగలు అపహరించిన సంఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వర్క్‌షాపు గ్రామానికి చెందిన సునీల్ ఎద్దును బయటకట్టేసి ఉంచగా, అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. కమలాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన రెండు ఎద్దులను కూడా అపహరించినట్లు తెలిసింది. కాగా ఎద్దుల అపహరణపై బాధితులు పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు.
పురుగుల మందు తాగి వ్యక్తి మృతి
జూలూరుపాడు: పురుగుల మందు తాగి వ్యక్తి మృతి చెందిన సంఘటనపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. హెడ్‌కానిస్టేబుల్ కొమరం వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. మండలంలోని మాచినేనిపేటతండాకు చెందిన వాంకుడోత్ సేవియా(35) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. పలుమార్లు ఆస్పత్రికి తీసుకెళ్లినా నయంకాలేదు. భరించలేని కడుపునొప్పి వస్తుండటంతో చనిపోతానంటూ తరచూ కుటుంబ సభ్యులకు చెబుతుండేవాడు. దీంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తామంటూ కుటుంబ సభ్యులు మనోధైర్యం కల్పిస్తున్నారు. కాగా గురువారం కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికే సేవియా పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిఉన్నాడు. దీంతో కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి భార్య వాంకుడోత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
యువకుడి ఆత్మహత్యాయత్నం
పాల్వంచరూరల్: యువకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటనలో కేసు నమోదు చేసినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం... మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన ధర్మసోత్ విజయ్ గురువారం తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో కుటుంబసభ్యులు గమనించి పాల్వంచ ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం ఖమ్మం తరలించారు. కాగా విజయ్ తండ్రిని సేవాలాల్ ఆలయంలో పూజారిగా నియమిస్తానని అదే గ్రామానికి చెందిన బాబూరావు అనే వ్యక్తి డబ్బులు తీసుకున్నాడు. కానీ పూజారిగా మరో వ్యక్తిని నియమించారు. దీంతో విజయ్ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడుగగా బాబూరావు గొడవపడి తిట్టాడు. దీంతో మనస్తాపం చెందిన విజయ్ పురుగులమందు తాగాడు. బాధితుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో..
వైరా: అప్పు కోసం తాకట్టు పెట్టిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వైరా మున్సిపాలిటీ పరిధి సోమవరానికి చెందిన ఇండ్ల గోపాలరావు 1205 సర్వే నంబర్‌లోని 242 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి సాదా అగ్రిమెంట్ రాయించుకున్నాడు. గత మున్సిపాలిటీ ఎన్నికల్లో 11వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన గోపాలరావు నగదు అవసరాల కోసం ప్లాట్ కాగితాన్ని ఓ నాయకుడి వద్ద తాకట్టు పెట్టాడు. అయితే, ఎన్నికల్లో గోపాలరావు ఓడిపోగా, నగదు చెల్లించకపోవడంతో శుక్రవారం సదరు నాయకుడు ప్లాట్ అమ్మిన వ్యక్తి నుంచి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గోపాలరావు వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి పురుగుల మందు తాగాడు. దీంతో ఆయనను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతున్నాడు. కాగా, ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు రాలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment