
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ రెహమాన్, సీఐ సత్యనారాయణ
కొత్తగూడెంటౌన్: నకిలీ కరెన్సీ నోట్లు చెలామణీ చేసేందుకు వచ్చిన ఓ ముఠా కొత్తగూడెం బస్టాండ్ సెంటర్‌లో టీ తాగేందుకు వచ్చి పోలీసులకు పట్టుబడింది. ఈ సంఘటన గురువారం చోటుచేసుకుంది. శుక్రవారం వన్‌టౌన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహమాన్ వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. గురువారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్‌లో ఎస్‌ఐ టి.లచ్చయ్య తన సిబ్బందితో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో కారులో ఆ ప్రాంతానికి వచ్చిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా, పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారు జూలూరుపాడు మండలం కొమ్ముగూడేనికి చెందిన బానోతు భోజ్యానాయక్, ఖమ్మం జిల్లా వేంసూరు మండలానికి చెందిన తనమల్ల రాజశేఖర్, ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుమలంక గ్రామానికి చెందిన బీరెపల్లి రాంబాబు, కొత్తగూడెం బాబుక్యాంప్‌నకు చెందిన జలమని భాస్కర్‌గా తేలింది.
ఈ నలుగురు కారు ఓనర్ చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీకి చెందిన పున్నం ప్రసాద్‌తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఈజీగా డబ్బు సంపాదించేందుకు నకిలీ కరెన్సీ నోట్లు చెలామణీ చేయాలని పథకం వేసుకున్నారు. ఈ క్రమంలో కొత్తగూడెం మార్కెట్ ఏరియాలో నకిలీనోట్లు చెలామణీ చేసేందుకు బయల్దేరిన నలుగురు టీ తాగేందుకు బస్టాండ్ సెంటర్‌కు వచ్చారు. అనుమానాస్పదంగా వ్యవహరించి పోలీసులకు పట్టుబడ్డారు. కారులో తనిఖీ చేయగా రూ.3 లక్షల నగదు, దొంగనోట్లు తయారు చేయడానికి ఉపయోగించే యాసిడ్ బాటిళ్లు, నల్లపేపర్ బండిళ్ల కట్టలు 5, చిన్న పిల్లలు ఆడుకునేందుకు ఉపయోగించే 500 నకిలీ నోట్ల కట్టలు 33 లభ్యమయ్యాయి. కారుతోపాటు నగదు, నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. కాగా కారు ఓనరు పున్నం ప్రసాద్ పరారీలో ఉన్నాడని డీఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో వన్‌టౌన్ సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్సై టి.లచ్చయ్య, కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, ఘని, సురేష్, వీరన్న, కామేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment