
కొత్తగూడెంటౌన్: సింగరేణి కార్పొరేట్ ఏరియాలోని ఇంటిలిజెన్స్ విభాగంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కుక్కల నర్సింగరావుపై నాజర్ అనే వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకోగా వన్‌టౌన్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కార్పొరేట్ ఏరియాలో సెకండ్ షిఫ్ట్‌లో మెయిన్ హాస్పిటల్ ఏరియాలో విధులు ముగించుకుని రాత్రి 10.30 గంటలకు క్యాజువాలిటీలో కేసుల విషయమై డాక్టర్, స్టాఫ్ నర్సును ఆరాతీశారు. తిరిగి ఇంటి వెళ్దామని తన ద్విచక్రవాహనం వద్దకు వెళ్లగా అదే సమయంలో రామాంజేయ కాలనీకి చెందిన బలగం వివేక్ బండిపై కూర్చుని ఉన్నాడు. తాను ఇంటికి వెళ్లాలని.. బైక్ మీద నుంచి దిగాలని సూచించాడు. పక్కనే ఉన్న నాజర్ అనే వ్యక్తి 10 నిమిషాలు అగలేవా.. అంటూ బూతులు తిడుతూ చెంపపై కొట్టాడని, చంపుతానని బెదిరించాడని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
వివాదంపై ఇంటలిజెన్స్ ఆరా
కొత్తగూడెంఅర్బన్: వివాహితుడైన ఓ ఎస్‌ఐ ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడనే ఆరోపణలపై ఇంటలిజెన్స్ విభాగం శనివారం ఆరా తీయడం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కొత్తగూడెం పట్టణ పరిధిలోని ఓ ఎస్‌ఐ పాల్వంచకు చెందిన ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన విషయం ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే. ఈ తతంగంలో ఎస్‌ఐ తనకు వివాహం అయినా కూడా యువతిని ప్రేమ పేరుతో మోసం చేయడంపై సర్వత్రా విమర్శలు చెలరేగాయి. కాగా, ఇదే ఎస్‌ఐపై వ్యక్తిగత ఆరోపణలతో పాటుగా విధి నిర్వహణపై కూడా కొన్ని ఆరోపణలు తెరపైకి రావడం మరోకోణం.
ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి గుర్తింపు
కారేపల్లి: రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి వివరాలు వెల్లడయ్యాయి. కారేపల్లిలోని పేరుపల్లి రైల్వే గేట్ సమీపాన శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. కాగా, మృతుడు ఏన్కూర్ మండలం రేపల్లేవాడకు చెందిన మార్కపూడి నరసింహారావు(40)గా స్థానికులు గుర్తించారు. కారేపల్లికి చెందిన నాగవెల్లి ప్రభాకర్ బావమరిది అయిన నరసింహారావు కొంతకాలంగా కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతుండగా, కారేపల్లి వచ్చిన ఆయన రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, ఘటనపై శనివారం కేసు నమోదు చేసిన డోర్నకల్ రైల్వే పోలీసులు పంచనామా అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment