
ఆదాయం అదుర్స్
లక్ష్యాన్ని మించి వసూలు చేసిన మార్కెట్ కమిటీలు
● ఆరు ఏఎంసీల నుంచి రూ.22.66 కోట్ల రాబడి
బూర్గంపాడు: జిల్లాలోని ఆరు వ్యవసాయ మార్కెట్ కమిటీలు గతేడాది నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాయి. గతేడాది జిల్లావ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్‌ల నుంచి రూ.21.69 కోట్ల ఆదాయాన్ని సాధించాలని ప్రభుత్వం లక్ష్యం విధించింది. మార్చి 31 వరకు ఈ లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంది. అయితే జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలు నిర్దేశించిన లక్ష్యాలను మించి రాబడి సాధించాయి. జిల్లాలోని ఆరు వ్యవసాయ మార్కెట్‌లు వ్యవసాయ ఉత్పత్తులపై ప్రభుత్వం విధించే ఒక శాతం మార్కెట్ ఫీజును వసూలు చేయటంలో సఫలీకృతమయ్యాయి. జిల్లాలోని బూర్గంపాడు, ఇల్లెందు, కొత్తగూడెం, దమ్మపేట, భద్రాచలం, చర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీలు తమకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేశాయి. ఒక్క చర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాత్రం లక్ష్యానికి కొంత వెనుకబడి ఉంది. గతేడాది ప్రభుత్వం బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీకి రూ.5.86 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించింది. బూర్గంపాడు ఏఎంసీ మార్చి 29వ తేదీ నాటికి రూ.6.41 కోట్ల రాబడి సాధించింది. ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఇచ్చిన రూ.4.64 కోట్ల లక్ష్యాన్ని అధిగమించి రూ.5.71 కోట్ల ఆదాయం రాబట్టింది. కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీకి విధించిన రూ.3.30 కోట్ల లక్ష్యానికి గాను రూ.3.26 కోట్ల ఆదాయంతో లక్ష్యం దిశగా ఉంది. దమ్మపేట వ్యవసాయ మార్కెట్ కమిటీకి నిర్దేశించిన రూ.3.25 కోట్ల లక్ష్యాన్ని అధిగమించి రూ.3.87 కోట్ల ఆదాయం సాధించింది. భద్రాచలం వ్యవసాయ మార్కెట్ కమిటీకి పెట్టిన రూ.2 కోట్ల లక్ష్యాన్ని అధిగమించి రూ.2.06 కోట్ల ఆదాయాన్ని రాబట్టింది. చర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి విధించిన రూ.2.62 కోట్ల టార్గెట్‌కు రూ.1.95 కోట్ల ఆదాయం సాధించి లక్ష్యసాధనలో వెనుకబడింది. జిల్లాకు మొత్తంగా విధించిన రూ.21.69 కోట్ల టార్గెట్‌కు గాను రూ.22.66 కోట్ల ఆదాయంతో లక్ష్యాన్ని అధిగమించింది.
పత్తి, వరి, మిర్చిపైనే ఆదాయం
జిల్లాలో రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులపై వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఒక శాతం మార్కెట్ ఫీజును వసూలు చేస్తాయి. జిల్లాలో ఎక్కువగా పండే పత్తి, వరి, మిర్చి పంటలపై మార్కెట్ కమిటీలకు ఎక్కువ ఆదాయం వస్తుంది. బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీకి జామాయిల్, సుబాబుల్ కర్రతో అధిక ఆదాయం వస్తుంది. సారపాకలోని ఐటీసీ పీఎస్‌పీడీకి వచ్చే జామాయిల్, సుబాబుల్ కర్రపై విధించే మార్కెట్ ఫీజుతో బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీకి జిల్లాలోనే అధిక ఆదాయం వస్తుంది. ఈ ఏడాది మిర్చి కోతలు ఆలస్యమవటం, మిర్చికి ధర తక్కువగా ఉండటంతో రైతులు మిర్చి అమ్మకాలు జరపటం లేదు. ఈ పరిస్థితులు చర్ల మార్కెట్ కమిటీ లక్ష్యసాధనలో కొంత వెనుకబడినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల టార్గెట్‌ను రూ.25 కోట్లకు పెంచే అవకాశాలున్నాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో పంటల క్రయ విక్రయాలు జరిపితే ఆదాయం మరింత పెరిగే అవకాశాలున్నాయి. జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు వసతులు కల్పించాలని రైతులు కోరుతున్నారు. ట్రేడర్లను, వ్యాపారులను ఆ దిశగా ప్రభుత్వం ప్రోత్సహించాలని పలువురు కోరుతున్నారు.
సిబ్బంది సహకారంతోనే లక్ష్యసాధన
జిల్లాలోని ఆరు వ్యవసాయ మార్కెట్ కమిటీల అధికారులు, సిబ్బంది పనితీరుతో ప్రభుత్వ లక్ష్యాలను చేరుకున్నాం. జిల్లాలో మొత్తంగా లక్ష్యాన్ని మించి ఆదాయాన్ని సమకూర్చుకున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయం మరింతగా పెంచుకునేలా దృష్టి సారిస్తాం.
–నరేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి

ఆదాయం అదుర్స్