తొమ్మిదేళ్ల తర్వాత.. | - | Sakshi
Sakshi News home page

తొమ్మిదేళ్ల తర్వాత..

Apr 6 2025 12:40 AM | Updated on Apr 6 2025 12:40 AM

తొమ్మిదేళ్ల తర్వాత..

తొమ్మిదేళ్ల తర్వాత..

● సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి రాక ● సీఎం రేవంత్‌రెడ్డితోపాటు హాజరుకానున్న పలువురు మంత్రులు

భద్రాచలం: నేడు భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా భద్రాచలం సమీపంలోని టోబాకో బోర్డు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సారపాకలోని ఐటీసీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని పది నిమిషాలపాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకుని మిథిలా స్టేడియానికి చేరుకుని కల్యాణ వేడుకల్లో భాగం అవుతారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీతారాములకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. కాగా 2016లో సీఎం హోదాలో చివరిసారిగా కేసీఆర్‌ ఈ సంప్రదాయం పాటించారు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఆయన హాజరుకాలేదు. మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత సీఎం హోదాలో పట్టువస్త్రాలు సమర్పించేందుకు రేవంత్‌రెడ్డి ఆదివారం వస్తున్నారు.

వీఐపీల తాకిడి

గతేడాది నవమి వేడుకల సమయంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో సీఎంతో సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ప్రొటోకాల్‌ వర్తించలేదు. కొందరు ఎమ్మెల్యేలు సాధారణ భక్తుల్లాగే వేడుకలకు హాజరయ్యారు. కానీ, ఈసారి ఉత్సవాలకు వీఐపీల తాకిడి పెరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రానుండటంతో వీవీఐపీ, వీఐపీ గ్యాలరీలు కిక్కిరిసిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయ దాతల కోటా కింద జారీ చేసే టికెట్లను కూడా తగ్గించారు.

జిల్లాకు మూడోసారి సీఎం

రేవంత్‌రెడ్డి సీఎం హోదాలో గతేడాది ఏప్రిల్‌లో భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభానికి, ఆ తర్వాత కొత్తగూడెంలో పార్లమెంటు ఎన్నికల ప్రచార సభకు.. రెండుసార్లు వచ్చారు. దాదాపు ఏడాది తర్వాత జిల్లాకు మూడోసారి వస్తున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత రిజర్వ్‌ చేసిన 45 నిమిషాల వ్యవధిలో సీఎంను కలిసేందుకు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నిస్తున్నారు. కాగా భద్రాచలంలో మెరుగులు దిద్దిన ట్రైబల్‌ మ్యూజియంతోపాటు మాఢవీధుల విస్తరణ పనులను ప్రారంభిస్తారని ప్రచారం సాగినా సీఎం టూర్‌ షెడ్యూల్‌లో వీటి ప్రస్తావనలేదు. కాగా సారపాకలో ఓ గిరిజనుడి ఇంట్లో సీఎం మధ్యాహ్న భోజనం చేయనుండగా, సన్నబియ్యంతో వండిన అన్నం వడ్డించనున్నారు.

సీఎం పర్యటన షెడ్యూల్‌

ఉదయం 8:45 గంటలకు బేగం పేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి ఉదయం 10 గంటలకు భద్రాచలం హెలిప్యాడ్‌కు, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సారపాకలోని ఐటీసీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. 10:10 నుంచి 10:30 గంటల వరకు రిజర్వ్‌ టైం కాగా, 10:30 గంటలకు గెస్ట్‌హౌస్‌ నుంచి బయల్దేరి 10:45 గంటలకు ఆలయానికి వస్తారు. 10:45 గంటల నుంచి 11:00 గంటల వరకు దర్శనం చేసుకుని, అనంతరం మిథిలా స్టేడియం చేరుకుంటారు, 11:10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కల్యాణ వేడుకలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మిథిలా స్టేడియం నుంచి సారపాకకు బయల్దేరుతారు. 12:35 గంటల నుంచి మధ్యాహ్నం 1:10 గంటల వరకు సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేస్తారు. ఆ తర్వాత ఐటీసీ గెస్ట్‌హౌజ్‌ చేరుకోనుండగా, 1:15 నుంచి 2 గంటల వరకు రిజర్వ్‌ టైం. 2:15 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుని హైదరాబాద్‌ బయల్దేరతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement