
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
నేలకొండపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ముదిగొండ మండలంలోని పండ్రేగిపల్లి గ్రామానికి చెందిన షేక్ సోహెల్ (25) సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లిలో బంధువుల ఇంటికి బైక్‌పై వెళ్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున నేలకొండపల్లిలోని ప్రభుత్వ కాలేజీ సమీపంలోకి రాగానే జాతీయ రహదారిపై మరమ్మతుల కోసం ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టి.. అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ యాజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లైంగిక వేధింపులు తాళలేక
వివాహిత ఆత్మహత్య
బూర్గంపాడు: లైంగిక వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మిర్యాల మమత (28)కు తొమ్మిదేళ్ల కిందట మిర్యాల అశోక్‌తో వివాహం జరిగింది. వీరికి ఎనిమిదేళ్ల పాప ఉంది. కొన్ని నెలలుగా అదే గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ అనే యువకుడు మమతను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో గొడవలు కూడా జరిగాయి. దుర్గాప్రసాద్ వేధింపులు, బెదిరింపులు ఎక్కువ కావటంతో ఆమె రెండు రోజుల కిందట ఎలుకల మందు తాగింది. కుటుంబ సభ్యులు భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా ఆదివారం మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి