
మరణంలోనూ వీడని బంధం
నేలకొండపల్లి: పెళ్లినాటి బాసలను ఆయన యాది మరువలేదు. చివరి వరకు పట్టిన చేయి వీడనని ఇచ్చిన మాటను ఆచరించడమే కాక మరణంలోనూ ఆమె వెంటే నడిచాడో భర్త. నేలకొండపల్లి మండలంలోని రామచంద్రాపురానికి చెందిన బూధాటి హనుమరెడ్డి(81) – యశోద(76) దంపతులు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. యశోద ఆదివారం ఇంట్లో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడగా తలకు బలమైన గాయమైంది. దీంతో ఆమెను ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా సోమవారం మృతి చెందింది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటి నుంచి ఆందోళన చెందుతున్న హనుమరెడ్డి.. యశోద మృతి విషయం తెలియగానే గుండెపోటుకు గురయ్యాడు. దీంతో కుటుంబీకులను ఆస్పత్రికి తరలించగా గంట వ్యవధిలోనే మృతి చెందాడు. దంపతుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకోగా.. ఒకే ట్రాక్టర్‌పై మృతదేహాలను ఉంచి అంతిమయాత్ర నిర్వహించాక అంత్యక్రియలు పూర్తిచేశారు.
వరకట్న వేధింపులతో ఆత్మహత్య
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి బలవన్మరణానికి పాల్పడిన నవ్య మృతిపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ కథనం ప్రకారం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బ్రాహ్మణ బజార్‌కు చెందిన శ్రీపాద ఉత్తరాచారి పెద్ద కుమార్తె నవ్య(21)కు ఇల్లెందు మండలం ధర్మారం తండాకు చెందిన రవిచంద్రాచారితో గతేడాది డిసెంబర్ 26న వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో రూ.50 వేల కట్నం ఇచ్చారు. కాగా, రవిచంద్రాచారి, ఆయన తల్లిదండ్రులు తరచూ అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. పలుమార్లు పంచాయితీ నిర్వహించినా వారి తీరు మారలేదు. దీంతో నవ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ తెలిపారు.
భార్య చనిపోయిన గంట వ్యవధిలోనే భర్త మృతి