అన్యమత ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

అన్యమత ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు

Apr 16 2025 12:17 AM | Updated on Apr 16 2025 12:17 AM

అన్యమత ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు

అన్యమత ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు

ములకలపల్లి : ఏజెన్సీ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను అగౌరవపరుస్తూ ఓ వ్యక్తి అన్యమత ప్రచారానికి పాల్పడుతున్నాడని రాజీవ్‌నగర్‌ గ్రామస్తులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మత మార్పిడికి యత్నిస్తున్న అతడిపై చర్య తీసుకోవాలని కోరారు.

చికిత్స పొందుతున్న మహిళ మృతి

పాల్వంచరూరల్‌: భర్తతో గొడవపడి పురుగులమందు తాగిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. మండలంలోని నాగారంకాలనీకి చెందిన, నవభారత్‌ కంపెనీలో క్యాజువల్‌ లేబర్‌గా పనిచేస్తున్న తేజావత్‌ లాల్‌బాబు భార్య కల్యాణి (26) తన భర్త పనికి రావడం లేదని ఈ నెల 8వ తేదీన పురుగులమందు తాగింది. కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి.. అక్కడి నుంచి కొత్తగూడెం ఏరియాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. మృతురాలి తండ్రి భీముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేశ్‌ తెలిపారు.

గ్రామపంచాయతీ ఈఓపై దాడికి యత్నం

ముగ్గురిపై కేసు నమోదు

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలం గ్రామ పంచాయతీ ఈఓ శ్రీనివాస్‌పై మంగళవారం ఓ మాంసం వ్యాపారి దాడికి యత్నిచాడు. చర్ల రోడ్డులో గల హోండా బైక్‌ షోరూం ఎదుట ఉన్న ఓ మాంసం దుకాణం కింద ఉన్న డ్రెయినేజీలో పూడికతీత కోసం సిబ్బంది ప్రయత్నించగా సదరు దుకాణం వ్యాపారి అడ్డుకున్నాడు. ఇదే విషయంపై ఈఓ శ్రీనివాస్‌ సదరు దుకాణం నిర్వాహకుడిని అడిగేందుకు వెళ్లగా ఒక్కసారిగా కుర్చితో దాడికి యత్నించాడు. మరో వ్యక్తి అక్కడే ఉన్న కర్ర మొద్దులను ఈఓపైకి విసిరేశాడు. పూడికతీతకు వచ్చిన పొక్లెయిన్‌పై దాడికి చేయగా, అద్దం పగిలింది. దీంతో ఈఓ శ్రీనివాస్‌ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ముగ్గురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

గ్రావెల్‌ తరలింపును అడ్డుకున్న గ్రామస్తులు

మణుగూరురూరల్‌: మండలంలోని సాంబాయిగూడెం గ్రామంలో కొందరు ఎలాంటి అనుమతులు లేకుండానే గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టి లారీలు, ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తున్నారు. మంగళవారం గ్రావెల్‌ను తరలిస్తున్న లారీలను గ్రామస్తులు నిలిపి వేసి ఆందోళన చేపట్టారు. లారీలు, ట్రాక్టర్లతో తోలకాలు చేపడుతుండడంతో రోడ్లు పాడైపోయి దుమ్ము, ధూళి ఎగిసిపడి ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. అంతేకాకుండా పర్యావరణానికి నష్టం కూడా వాటిల్లుతోందన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్రమ గ్రావెల్‌ తవ్వకాలు, తోలకాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు డిమాండ్‌ చేశారు.

కలప పట్టివేత

దుమ్ముగూడెం: మండలంలోని జిన్నెలగూడెం – చింతగుప్ప గ్రామాల మధ్య నిల్వ చేసిన 15 టేకు దిమ్మెలను రేంజర్‌ కమల ఆధ్వర్యంలో మంగళవారం పట్టుకున్నారు. వాటిని రేంజ్‌ కార్యాలయానికి తరలించారు. పట్టుకున్న కలప విలువ సుమారు రూ.2 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.

రెండు మట్టి ట్రాక్టర్ల పట్టివేత

జూలూరుపాడు: అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను మంగళవారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. జూలూరుపాడు ప్రభుత్వ స్థలంలో తవ్విన మట్టిని రెండు ట్రాక్టర్లలో తరలిస్తుండగా స్థానిక షిర్డీ సాయిబాబా ఆలయ సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. వాటిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి, ఇద్దరు డ్రైవర్లు పాపకొల్లుకు చెందిన అశోక్‌, జూలూరుపాడుకు చెందిన ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్నామని ఎస్‌ఐ తెలిపారు. మట్టి ట్రాక్టర్లను తహసీల్దార్‌కు అప్పగించనున్నట్లు ఎస్‌ఐ రవి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement