ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌లో మెజారిటీ వాటాను తగ్గించుకోవాలని యోచిస్తోంది. సదరు వాటాను విక్రయించేందుకు అదానీ గ్రూప్, టొరెంట్ గ్రూప్‌లతో చర్చలు జరుపుతున్నట్లు కొన్ని మీడియా నివేదికల ద్వారా తెలిసింది.
సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ 2021లో గుజరాత్ టైటాన్స్ ప్రాంచైజీని రూ.5,625 కోట్లకు దక్కించుకుంది. అయితే ప్రస్తుతం తన వాటాను తగ్గించుకోవాలని యోచిస్తోంది. దాంతో అదానీ గ్రూప్, టొరెంట్ గ్రూప్‌లకు మేజర్ వాటాను విక్రయించడానికి చర్చలు సాగుతున్నట్లు సమాచారం. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) నిబంధనల ప్రకారం ఫిబ్రవరి 2025తో ఫ్రాంచైజీ వాటాలను విక్రయించడానికి లాక్-ఇన్ పీరియడ్ ముగుస్తుంది. ఆలోపే ఈ తంతు పూర్తి చేయాలని సీవీసీ క్యాపిటల్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.
గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ విలువ 1-1.5 బిలియన్ డాలర్ల(రూ.8,500 కోట్లు) మధ్య ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టొరెంట్ సంస్థ క్రికెట్ వ్యాపారంలోకి ఇంకా ప్రవేశించలేదు. కానీ, అదానీ గ్రూప్ ఇప్పటికే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్), ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో పెట్టుబడులను కలిగి ఉంది. డబ్ల్యూపీఎల్‌లో అహ్మదాబాద్ ఫ్రాంచైజీని అదానీ గ్రూప్ 2023లో రూ.1,289 కోట్ల బిడ్‌తో సొంతం చేసుకుంది. ఈ గ్రూప్ 2021లోనే గుజరాత్ టైటాన్స్‌ను చేజిక్కించుకునేందుకు ప్రయత్నించింది. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదురలేదు.
ఇదీ చదవండి: ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ ఎర్రర్ మెసేజ్..
ఇదిలాఉండగా, సీవీసీకి ఇప్పటికే లాలిగా, ప్రీమియర్‌షిప్ రగ్బీ, వాలీబాల్ వరల్డ్, ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్‌లో పెట్టుబడులు ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ తన తొలి సీజన్ ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment