బ్రసెల్స్: కాలుష్య ఉద్గారాలను తగ్గించే సాంకేతికతను అమలు చేయకుండా కుమ్మక్కయినందుకు గాను జర్మనీకి చెందిన నాలుగు దిగ్గజ కార్ల కంపెనీలపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) గట్టి చర్యలు తీసుకుంది. 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 7,470 కోట్లు) జరిమానా విధించింది. దైమ్లర్, బీఎండబ్ల్యూ, ఫోక్స్‌వ్యాగన్, ఆడి, పోర్షె కంపెనీలు పెట్రోల్, డీజిల్ ప్యాసింజర్ కార్ల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించే టెక్నాలజీ విషయంలో పోటీపడకుండా కుమ్మక్కై వ్యవహరించాయని ఆరోపణలు ఉన్నాయి. వీటిపై దర్యాప్తు చేసిన ఈయూ నాలుగు సంస్థలపై తాజా పెనాల్టీ ప్రకటించింది. ఈ వ్యవహారాన్ని వెల్లడించినందుకు గాను దైమ్లర్‌ను విడిచిపెట్టింది. ధరల విషయంలో కుమ్మక్కయినందుకు కాకుండా టెక్నాలజీలను అమలు చేయనందుకు గాను యూరోపియన్ యూనియన్ జరిమానా విధించడం ఇదే ప్రథమం.
‘ఈయూ ఉద్గారాల ప్రమాణాలకు తగిన టెక్నాలజీలు అందుబాటులో ఉన్నప్పటికీ తయారీ సంస్థలు వాటిని ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టాయి. ఇది చట్టవిరుద్ధమైన చర్య. దీనివల్ల తక్కువ ఉద్గారాలను విడుదల చేసే వాహనాలను కొనుగోలు చేసే అవకాశాన్ని కస్టమర్లు కోల్పోయారు‘ అని ఈయూ యాంటీట్రస్ట్ చీఫ్ మార్గరెత్ వెస్టాజెర్ వ్యాఖ్యానించారు. సాధారణంగా డీజిల్ ఇంజిన్ల నుంచి వెలువడే ఉద్గారాలను తగ్గించేందుకు కార్లలో యాడ్‌బ్లూ అనే యూరియా సొల్యూషన్‌ను ఉపయోగిస్తుంటారు. దీనికోసం వాహనాల్లో ప్రత్యేక ట్యాంకు ఉంటుంది. దీని పరిమాణం పెద్దగా ఉంటే ఉద్గారాల విడుదల మరింత తగ్గుతుంది. అయితే, వ్యయాలు తగ్గించుకునే ఉద్దేశ్యంతో సదరు వాహన తయారీ సంస్థలు తమ కార్లలో యాడ్‌బ్లూకి సంబంధించి చిన్న ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నాయనేది ఆరోపణ.
Comments
Please login to add a commentAdd a comment