న్యూఢిల్లీ: పండుగల సందర్భంగా బ్యాంక్‌లు రుణాలపై ప్రాసెసింగ్ చార్జీల రద్దు వంటి ఆఫర్లు ఇవ్వడం సాధారణంగా చూస్తుంటాం. కానీ, ఈ విడత బ్యాంక్‌లు డిపాజిట్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. మధ్య స్థాయి బ్యాంక్‌లు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు సేవింగ్స్ డిపాజిట్లపై ప్రత్యేక రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. మరిన్ని డిపాజిట్లను ఆకర్షించేందుకు అవి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టున్నాయి.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు అయితే డిపాజిట్లపై ఏకంగా 9.50 శాతం వరకు వడ్డీని ఇస్తున్నాయి. రిటైల్ డిపాజిట్లలో పెద్దగా వృద్ధి లేకపోవడంతో, తమ డిపాజిట్ బేస్‌ను పెంచుకునేందుకు ఇటీవలి కాలంలో బ్యాంక్‌లు ప్రధానంగా బల్క్ డిపాజిట్లపై ఎక్కువగా ఆధారపడుతున్న పరిస్థితి నెలకొంది. అందుకే, బల్క్ డిపాజిట్ల కంటే రిటైల్ డిపాజిట్లకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవలే నాలుగు రకాల సేవింగ్స్ ఖాతాలను ప్రకటించింది.
రూ.2 కోట్లలోపు రిటైల్ టర్మ్ డిపాజిట్లపై రేట్లను 0.50 శాతం వరకు పెంచింది. వివిధ కాలావధితో కూడిన బల్క్ డిపాజిట్లపై రేట్లను ఒక శాతం మేర పెంచింది. యస్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్ అయితే సేవింగ్స్ ఖాతా డిపాజిట్లపై ఏకంగా 7–8 శాతం రేటును ఆఫర్ చేస్తున్నాయి. సాధారణంగా ఏడాది టర్మ్ డిపాజిట్లపైనే ప్రస్తుతం ఈ రేటు లభిస్తుండడం గమనార్హం.
కొన్ని బ్యాంకుల్లో 1–3 ఏళ్ల టర్మ్ డిపాజిట్ రేట్లు ఇంతకంటే తక్కువే ఉండడాన్ని గమనించొచ్చు. పండుగల సీజన్‌లో కస్టమర్లను ఆకర్షించేందుకు అధిక రేట్లతో ప్రత్యేక పథకాలను కూడా బ్యాంక్‌లు ప్రకటిస్తున్నాయి. ‘‘టర్మ్ డిపాజిట్ల కంటే సేవింగ్స్ రేట్లు అధికంగా ఉన్నాయి. ఇది చాలా అసహజంగా కనిపిస్తోంది. ఇది కేవలం మార్కెటింగ్ ఎత్తుగడే’’అని మాక్వేర్ రీసెర్చ్ పేర్కొంది.
కాసా వృద్ధి కోసం పాట్లు
బ్యాంకులకు కరెంట్ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లు (కాసా) చాలా కీలకం. సేవింగ్స్ ఖాతాల్లోని డిపాజిట్లపై సాధారణంగా 3–4 శాతం మించి బ్యాంక్‌లు రేట్లను ఆఫర్ చేయవు. కరెంట్ ఖాతాల్లోని డిపాజిట్లపై అసలు వడ్డీని ఆఫర్ చేయవు. దీంతో కాసా డిపాజిట్లపై బ్యాంకులకు అయ్యే వ్యయాలు చాలా తక్కువ. అందుకే బ్యాంక్‌లు కాసా డిపాజిట్ల వృద్ధిని ప్రాధాన్యంగా చూస్తుంటాయి.
ఇటీవలి కాలంలో కాసా డిపాజిట్లలో పెద్దగా వృద్ధి లేకపోవడంతో, రుణాల వృద్ధిని కాపాడుకునేందుకు అవి నిధుల కోసం అవి సేవింగ్స్ డిపాజిట్లపై అధిక రేట్లను ఆఫర్ చేస్తున్నట్టుందని మాక్వేర్ రీసెర్చ్ తెలిపింది. మొత్తం డిపాజిట్ల వృద్ధిలో సేవింగ్స్ డిపాజిట్ల వృద్ధి 6–7 శాతం తక్కువగా ఉండడాన్ని ప్రస్తావించింది.
దేశంలోని టాప్–6 బ్యాంక్‌లు మొత్తం సేవింగ్స్ డిపాజిట్లలో 55 శాతం వాటా కలిగి ఉన్నాయి. క్యూ1లో టర్మ్ డిపాజిట్లు ఇతర అన్ని విభాగాలతో పోలిస్తే అధికంగా 17.4 శాతం వద్ధి చెందినట్టు కేర్ రేటింగ్స్ నివేదిక తెలియజేస్తోంది. అదే సేవింగ్స్ డిపాజిట్లలో వృద్ధి కేవలం 4.9 శాతంగానే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment