బుల్‌ ట్రెండ్‌లో.. బంగారం-సరికొత్త రికార్డ్స్‌ | Gold and Silver hits new record highs | Sakshi
Sakshi News home page

బుల్‌ ట్రెండ్‌లో.. బంగారం

Published Mon, Jul 27 2020 11:11 AM | Last Updated on Mon, Jul 27 2020 11:29 AM

Gold and Silver hits new record highs - Sakshi

ఓవైపు అమెరికా, చైనా మధ్య చెలరేగిన వివాదాలు, మరోపక్క ప్రపంచ దేశాలను కుదిపివేస్తున్న కోవిడ్‌-19 నేపథ్యంలో బంగారానికి ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. వెరసి విదేశీ మార్కెట్లో ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. న్యూయార్క్‌ కామెక్స్‌లో ప్రస్తుతం  1.5 శాతం ఎగసి 1956 డాలర్లను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ఇంతక్రితం 2011 సెప్టెంబర్‌లో 1921 డాలర్ల వద్ద రికార్డ్‌ "హై' నమోదైంది. ఈ బాటలో తాజాగా వెండి (ఔన్స్‌) మరింత అధికంగా 6 శాతం దూసుకెళ్లి 24.5 డాలర్లకు చేరింది. దీంతో దేశీయంగానూ ఎంసీఎక్స్‌లో పసిడి ధరలు హైజంప్‌ చేశాయి.

వెండి దూకుడు
ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో బంగారం 10 గ్రాములు రూ. 711 ఎగసి రూ. 51,746 వద్ద ట్రేడవుతోంది. వెరసి ఈ ఆగస్ట్‌ డెలివరీ ఫ్యూచర్స్‌ తొలుత రూ. 51,833 వరకూ పెరిగింది. ఇక వెండి కేజీ సెప్టెంబర్‌ డెలివరీ రూ. 3349 దూసుకెళ్లి రూ. 64,572 వద్ద కదులుతోంది. తొలుత రూ. 64,849ను తాకింది. ఇవి సరికొత్త గరిష్టాలుకావడం విశేషం!

ప్యాకేజీల ఎఫెక్ట్
ఇటీవల హ్యూస్టన్‌, చెంగ్డూలలో కాన్సులేట్ల మూసివేత ఆదేశాలతో యూఎస్‌, చైనా మధ్య చెలరేగిన వివాదాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచినట్లు బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి. దీనికితోడు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలర్‌ ఇండెక్స్‌ తాజాగా 0.5 శాతం క్షీణించి 94 డాలర్ల దిగువకు చేరింది.  ఇప్పటికే ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్‌-19 కట్టడికి యూరోపియన్‌ దేశాల నేతలు 850 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి గత వారం ఆమోదముద్ర వేశారు. మరోవైపు ఈ వారంలో వాషింగ్టన్‌ ప్రభుత్వం సైతం కోవిడ్‌-19 కారణంగా సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రజలను ఆదుకునేందుకు భారీ ప్యాకేజీని ప్రకటించనున్న అంచనాలు పెరుగుతున్నాయి.

ఈ వారం అమెరికన్‌ కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ పరపతి సమీక్షను చేపట్టనుంది. దీంతో ఫెడ్‌ నిర్ణయాలపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు సాధారణంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు, సావరిన్‌ ఫండ్స్‌, ఈటీఎఫ్‌ పెట్టుబడులు తదితరాలు బంగారం కొనుగోలుకి ఆసక్తి చూపే విషయం విదితమే. 

బుల్‌ ట్రెండ్‌లో
ప్రస్తుతం బంగారం బుల్‌ ట్రెండ్‌లో ఉన్నట్లు బులియన్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా పసిడిలో బుల్‌ ట్రెండ్‌ 8-10ఏళ్లపాటు ఉంటుందని తెలియజేశాయి. గతంలో 2001-2011 మధ్య వచ్చిన బుల్‌ ట్రెండ్‌ కారణంగా పసిడి 1921 డాలర్ల వద్ద రికార్డ్‌ నెలకోల్పిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. అయితే తదుపరి బంగారం ధరలు 46 శాతం పతనంకావడంతోపాటు.. కొన్నేళ్లపాటు కన్సాలిడేట్‌ అయినట్లు తెలియజేశారు. కాగా.. ప్రస్తుతం గోల్డ్‌లో నెలకొన్న స్పీడ్‌ ప్రకారం ఔన్స్‌ 3000 డాలర్లవరకూ దూసుకెళ్లవచ్చని యూఎస్‌ నిపుణులు నిగమ్‌ ఆరోరా ఒక నివేదికలో తాజాగా అంచనా వేశారు. ఇందుకు 50 శాతం అవకాశాలున్నాయని భావిస్తున్నట్లు అరోరా రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఇక జెఫరీస్‌ విశ్లేషకులు క్రిస్టోఫర్‌ ఉడ్‌ అయితే గత వారం ఔన్స్‌ పసిడి మరింత అధికంగా 4,000 డాలర్లను తాకవచ్చనంటూ అత్యంత ఆశావహంగా అంచనా వేసిన విషయం విదితమే. 

స్వల్ప కాలంలో
పసిడికి 1900-1917 డాలర్ల వద్ద ఎదురయ్యే బలమైన రెసిస్టెన్స్‌ను తాజాగా దాటడంతో స్వల్ప కాలంలో 2000 డాలర్లకు చేరే వీలున్నట్లు బులియన్‌ విశ్లేషకులు అరోరా ఊహిస్తున్నారు. సాంకేతికంగా ఓవర్‌బాట్‌ స్థాయికి చేరడంతో సమీపకాలంలో భారీగా దిద్దుబాటుకు లోనుకావచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవేళ వేగంగా పతనమైతే ఆ స్థాయిలలో పసిడిని కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నారు. ఇక నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల కారణంగా అక్టోబర్‌-నవంబర్‌కల్లా ఔన్స్‌ పసిడి 2350 డాలర్లకు, వెండి 29.70 డాలర్లకు బలపడే వీలున్నదని కామ్‌ట్రెంజ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ సీఈవో జ్ణానశేఖర్‌ త్యాగరాజన్‌ అంచనా వేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement