పట్టిందల్లా బంగారమే!
మురిపించిన బంగారం.. రోలర్ కోస్టర్ రైడ్‌ను తలపించిన స్టాక్ మార్కెట్లు. డాలర్ విలువతో బక్కచిక్కిన రూపాయి.. 2024లో ఇన్వెస్టర్ల అంచనాలకు అందని విధంగా వీటి ప్రయాణం సాగిపోయింది. రష్యా–ఉక్రెయిన్; ఇజ్రాయెల్–హమాస్–పాలస్తీనా–ఇరాన్ మధ్య ఘర్షణలు; కొండెక్కిన ద్రవ్యోల్బణం, యూఎస్ ఫెడ్ రేట్ల కోతలు, డోనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో టారిఫ్‌ల భయాలు.. ఇలాంటి ఎన్నో పరిణామాలు, అనిశ్చితులు బంగారానికి డిమాండ్ పెంచాయి. దీంతో ఈ ఏడాది ఈక్విటీ, డెట్‌కు మించి బంగారం సూపర్ ర్యాలీ చేసింది. డాలర్ బలోపేతం, అమెరికా డెట్‌లో మెరుగైన రాబడులతో విదేశీ ఇన్వెస్టర్లు భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకునేందుకే ప్రాధాన్యం చూపించారు. ఇది రూపాయి విలువపై ప్రభావం చూపించింది. ఈ ఏడాది 3 శాతం వరకు క్షీణించింది. స్థానిక రిటైల్ ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్ కొనుగోళ్లు ఒకింత ఈక్విటీ మార్కెట్లను ఆదుకున్నాయి. దీంతో ఈ ఏడాది మొత్తం మీద ఈక్విటీలు నికర రాబడులను అందించాయి. బంగారం తర్వాత ఇన్వెస్టర్లు వెండికి ప్రాధాన్యం ఇచ్చారు. పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాల నుంచి పెరిగిన డిమాండ్‌తో వెండి కూడా ర్యాలీ చేసింది. స్టాక్ మార్కెట్లు రికార్డులే రికార్డులుఅంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, (ఎఫ్ఐఐలు), విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారీ అమ్మకాలు చేపట్టినప్పటికీ భారత ఈక్విటీ మార్కెట్లు ఈ ఏడాది రికార్డుల మీద రికార్డులు సృష్టించాయి. దీనికి దేశీ పెట్టుబడులే అండగా నిలిచాయని చెప్పుకోవాలి. ఏడాది చివర్లో స్టాక్స్ మరోసారి దిద్దుబాటులోకి వెళ్లినప్పటికీ.. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 9 శాతం (6,459 పాయింట్లు), ఎన్ఎస్ఈ నిఫ్టీ 9.58 శాతం (2,082 పాయింట్లు) మేర లాభాలను (డిసెంబర్ 27 నాటికి) ఇచ్చాయి. ‘‘దేశీ, అంతర్జాతీయ పరిణామాలతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అసాధారణ అమ్మకాలకు దిగడంతో గత రెండు నెలల్లో ఈక్విటీ మార్కెట్ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి నుంచి దిద్దుబాటుకు గురైంది. 2020 కరోనా విపత్తు తర్వాత ఇది మూడో గరిష్ట దిద్దుబాటు’’అని మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ మేనేజ్మెంట్ వెల్లడించింది. రెండు అంతర్జాతీయ భౌగోళిక పరిణామాలను ఈక్విటీ మార్కెట్లు ఈ ఏడాది ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్–ఇరాన్ నేరుగా దాడులకు దిగాయి. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? అన్న ఆందోళన ఇన్వెస్టర్లను కలవరపాటుకు గురి చేసింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కూడా సమసిపోలేదు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో కార్పొరేట్ ఫలితాలు బలంగా ఉండడం, దేశీ పెట్టుబడుల ప్రవాహం, జీడీపీ పటిష్ట వృద్ధితో.. బీఎస్ఈ సెన్సెక్స్ 85,978 పాయింట్ల ఆల్‌టైమ్ గరిష్ట రికార్డును సెపె్టంబర్ 27న నమోదు చేసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ అదే రోజున 26,277 గరిష్టాన్ని తాకింది. ఈ స్థాయిల నుంచి చూస్తే సెన్సెక్స్ డిసెంబర్ 27 నాటికి 8.46 శాతం, నిఫ్టీ 9.37 శాతం చొప్పున నష్టపోయాయి. → నిఫ్టీ ఆల్‌టైమ్ రికార్డు: 26,277 (సెప్టెంబర్ 27) → ఈ ఏడాది నికర రాబడి: 2,082 పాయింట్లు (9.58%) → సెన్సెక్స్ ఆల్ టైమ్ రికార్డు: 85,978 (సెపె్టంబర్ 27) → ఈ ఏడాది నికర రాబడి: 6,459 పాయింట్లు (9%) → విదేశీ ఇన్వెస్టర్ల నికర ఈక్విటీ పెట్టుబడులు: రూ.1,655 కోట్లు (ప్రైమరీ, సెకండరీ) → విదేశీ ఇన్వెస్టర్ల నికర డెట్ పెట్టుబడులు: రూ.1,12,409 కోట్లుడిసెంబర్ 27 చివరికి సెన్సెక్స్ ముగింపు 78,699 కాగా, నిఫ్టీ ముగింపు 23,813 పాయింట్లు. ‘‘2024 బుల్స్, బేర్స్ మధ్య నువ్వా–నేనా అన్నట్టుగా యుద్ధం నడిచింది అంతర్జాతీయంగా స్థూల ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ పరిణామాలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ఈ ఒత్తిళ్లను తట్టుకుని మరీ భారత మార్కెట్లు చక్కని రాబడులు ఇచ్చాయి. దీంతో మన మార్కెట్ల విలువ ప్రపంచంలోనే అత్యంత ఖరీదుగా మారింది. దీనికితోడు అధిక లిక్విడిటీ (నిధుల ప్రవాహం) మార్కెట్ల వ్యాల్యూషన్‌ను గరిష్టాలకు చేర్చింది. దీంతో ఫండమెంటల్స్ కూడా పక్కకుపోయాయి. ఇదే అంతిమంగా మార్కెట్లో కరెక్షన్ను ఆహా్వనించినట్టయింది’’అని మెహతా ఈక్విటీస్ రీసెర్చ్ అనలిస్ట్ ప్రశాంత్ తాప్సే వివరించారు. జీడీపీ వృద్ధి రేటు ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయి అయిన 5.4 శాతానికి సెపె్టంబర్ త్రైమాసికంలో క్షీణించడం, ఇదే త్రైమాసికానికి సంబంధించి బలహీన కార్పొరేట్ ఫలితాలు, ఖరీదైన వ్యాల్యూషన్ల వద్ద విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడం చివరికి మార్కెట్లో దిద్దుబాటుకు దారితీశాయి. ద్రవ్యోల్బణం 6 శాతం దాటిపోవడంతో వ్యవస్థలో లిక్విడిటీ మరింత కట్టడి దిశగా ఆర్బీఐ తీసుకున్న చర్యలు కూడా వినియోగం క్షీణించి, వృద్ధిపై ప్రభావం చూపించాయి. ఈ ఏడాదిలో అధిక భాగం ద్రవ్యోల్బణం 5 శాతానికి పైనే చలించింది. వరుసగా 9వ ఏట భారత ఈక్విటీలు ఇన్వెస్టర్లకు లాభాలను పంచగా, స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ అయితే మరింత రాబడులతో మురిపించాయి.పసిడి మెరుపులు ఈ ఏడాది ఇన్వెస్టర్లు ఊహించినదానికి మించి బంగారం రాబడులు పంచింది. వెండి కూడా మెరిసింది. ఈ ఏడాది ఆరంభంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.63,000 స్థాయిలో ఉండగా, రూ.78,000–79000కు వృద్ధి చెందింది. రూపాయి మారకంలో 24 శాతం ర్యాలీ చేసింది. డాలర్ మారకంలో అయితే 29 శాతం పెరిగింది. ఇక వెండి కిలో ధర రూ.78,600 స్థాయి నుంచి 16 శాతానికి పైగా పెరిగి రూ.91,000కు చేరుకుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళుతుందన్న భయాలు, అంతకంతకూ పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఘర్షణలు ఈ ఏడాది పసిడికి బలాన్నిచ్చాయి. బంగారం అంతర్జాతీయంగా చూస్తే అక్టోబర్‌లో నమోదైన 2,670 డాలర్ల (ఔన్స్‌కు) నుంచి 4 శాతం నష్టపోయింది. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుదల, డాలర్ ర్యాలీ, ద్రవ్యోల్బణం ఆందోళనలు కొంత శాంతించడం పసిడి చల్లబడడానికి కారణాలుగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తన తాజా నివేదికలో ప్రస్తావించింది. అయినప్పటికి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నడుమ సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికి డిమాండ్ కొనసాగడం, ఆర్బీఐ సహా ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్‌లు పసిడి నిల్వలను పెంచుకుంటూ పోవడం ధరలకు మద్దతునిచ్చాయి. పండుగల సీజన్లో తప్పించి ఈ ఏడాది బంగారం ఆభరణాల కొనుగోళ్లు సాధారణంగానే ఉన్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బంగారం ధరలు ఆల్‌టైమ్ గరిష్టాలకు చేరడంతో కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిని అనుసరించారు. కానీ, పెట్టుబడి కోసం భౌతిక బంగారం కొనుగోళ్లు మాత్రం వృద్ధి చెందాయి. ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల్లో సురక్షిత సాధనంగా బంగారానికి ఉన్న గుర్తింపు సానుకూల సెంటిమెంట్‌కు దారితీసినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు), సిల్వర్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (సిల్వర్ ఈటీఎఫ్‌లు) ఈ ఏడాది 20 శాతం వరకు నికర రాబడిని అందించాయి. బంగారం ఈటీఎఫ్‌లు సగటున 20 శాతం పెరగ్గా, సిల్వర్ ఈటీఎఫ్‌ల ధర 19.66 శాతంగా పెరిగింది. ఈ రెండు విభాగాల్లోనూ మొత్తం 31 ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. 2023లో గోల్డ్ ఈటీఎఫ్‌లు 13 శాతం రాబడిని, సిల్వర్ ఈటీఎఫ్‌లు సగటున 4 శాతం రాబడిని అందించాయి. భారత గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని మొత్తం భౌతిక బంగారం గడిచిన నాలుగేళ్లలో రెట్టింపై 2024 అక్టోబర్ చివరికి 54.5 టన్నులకు చేరినట్టు డబ్ల్యూజీసీ తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ నాటికే గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు గతేడాదితో పోలి్చతే రెట్టింపై రూ.7367 కోట్లకు చేరాయి. 2023లో 2,919 కోట్లను గోల్డ్ ఈటీఎఫ్‌లు ఆకర్షించాయి. ఆర్బీఐ కొనుగోళ్లు.. ఈ ఏడాది బంగారం ధరల ర్యాలీకి సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు సైతం ప్రేరణగా నిలిచాయి. ఈ ఏడాది నవంబర్ వరకు 11 నెలల్లో ఆర్బీఐ 72.6 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. దీంతో ఆర్బీఐ వద్ద పసిడి నిల్వలు 9 శాతం పెరిగి 876 టన్నులకు చేరాయి. 2023లో 16 టన్నులు, 2022లో 33 టన్నుల చొప్పున ఆర్బీఐ బంగారం నిల్వలు పెంచుకున్నట్టు డబ్ల్యూజీసీ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది మొదటి 11 నెలల్లో భారత్ దిగుమతి చేసుకున్న బంగారం 800 టన్నులను మించి ఉంటుందని అంచనా వేసింది. 2023 ఏడాది మొత్తం దిగుమతులు 689 టన్నులుగా ఉన్నట్టు.. విలువ పరంగా చూస్తే దిగుమతులు 48 శాతం పెరిగినట్టు (ధరల పెరుగుదలతో) డబ్ల్యూజీసీ తెలిపింది. సావరీన్ గోల్డ్ బాండ్లు కనుమరుగు! బంగారంపై పెట్టుబడులను ఎల్రక్టానిక్ రూపంలోకి మళ్లించే ఉద్దేశ్యంతో 2015లో మోదీ సర్కారు సావరీన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఏటా నాలుగు విడతలుగా వీటిని జారీ చేయడం ద్వారా నిధులు సమకరిస్తూ వచ్చింది. ఇన్వెస్టర్లకు ఇవి మెరుగైన రాబడులు ఇచ్చాయి. ‘‘2024లో కేవలం ఒక్క విడతే ఎస్జీబీని ప్రభుత్వం తరఫున ఆర్బీఐ జారీ చేసింది. 2023లో నాలుగు ఇష్యూలు చేపట్టింది. 2.5 శాతం వడ్డీ హామీకితోడు పన్ను మినహాయింపు ప్రయోజనాలతో బంగారంపై పెట్టుబడులకు ప్రాధాన్య సాధనంగా ఇది మారిపోయింది. దీంతో డిమాండ్–సరఫరా మధ్య తీవ్ర అంతరానికి దారితీసింది. ఫలితంగా ఇన్వెస్టర్ల ఆసక్తి గోల్డ్ ఈటీఎఫ్‌ల వైపు మళ్లింది’’ అని ఫిన్‌ఎడ్జ్ కో ఫౌండర్ మయాంక్ భటా్నగర్ తెలిపారు. పసిడి బలమైన ర్యాలీ, దీనికితోడు వడ్డీ చెల్లింపులు భారంగా మారడంతో ఎస్‌బీజీలను కేంద్రం నిలిపివేసినట్టు తెలుస్తోంది. → గోల్డ్ ఈ ఏడాది ఆల్‌టైమ్ గరిష్టం: 82,000 (అక్టోబర్ 30న హైదరాబాద్) → వెండి ఈ ఏడాది ఆల్‌టైమ్ గరిష్టం: రూ.1,01,900 (అక్టోబర్ 30) → ఆర్బీఐ బంగారం కొనుగోళ్లు: 73 టన్నులు (నవంబర్ నాటికి) → బంగారం దిగుమతులు: 800 టన్నులు (నవంబర్ నాటికి) → గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు: 7,367 కోట్లు (అక్టోబర్ నాటికి) ఎఫ్ఐఐలు నికర పెట్టుబడిదారులేఅక్టోబర్, నవంబర్ నెలల్లోనే విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో రూ.1.4 లక్షల కోట్ల అమ్మకాలకు పాల్పడడం గమనార్హం. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వాటా 16 శాతానికి దిగొచ్చింది. 12 ఏళ్ల కనిష్ట స్థాయి ఇది. రిటైల్, దేశీ ఇనిస్టిట్యూషన్లు, హెచ్ఎన్ఐల వాటా 32 శాతానికి చేరింది. ఈ ఏడాది డిసెంబర్ 27 నాటికి ఎఫ్ఐఐలు నికరంగా రూ.1,19,277 కోట్ల మేర స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల ద్వారా (సెకండరీ మార్కెట్) అమ్మకాలు నిర్వహించారు. అదే సమయంలో ప్రైమరీ మార్కెట్ ద్వారా (ఐపీవోలు) వీరు రూ.1,20,932 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు ఎన్ఎస్డీఎల్ డేటా స్పష్టం చేస్తోంది. అంటే ఈక్విటీల్లో ఎఫ్ఐఐలు నికరంగా రూ.1,655 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ‘‘ఈ ప్రకారం ఎఫ్ఐఐలు ఈ ఏడాది ఇంత వరకు నికర పెట్టుబడిదారులుగానే ఉన్నారు. ఎక్సే్ఛంజ్‌ల ద్వారా అమ్మకాలన్నవి అధిక వ్యాల్యూషన్ల వల్లే. అదే సమయంలో సహేతుక విలువలు ఉండడంతో ప్రైమరీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది’’అని జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ డీకే విజయ్‌కుమార్ తెలిపారు. డెట్ మార్కెట్లో ఎఫ్ఐఐలు ఈ ఏడాది మొత్తం మీద రూ.1,12,409 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్టు ఎన్ఎస్డీఎల్ డేటా ఆధారంగా తెలుస్తోంది.– సాక్షి, బిజినెస్ డెస్క్