ముంబై: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021–22లో నాల్గవ విడత గోల్డ్ బాండ్ల జారీ సోమవారం నుంచీ (12వ తేదీ) ప్రారంభమవుతుంది. 16వ తేదీ వరకూ ఐదు రోజులు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఇష్యూ ధర గ్రాముకు రూ.4,807 అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం విడుదల చేసిన ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుదారులు, డిజిటల్ విధానంలో చెల్లింపుదారులకు ధరలో గ్రాముకు రూ.50 తగ్గింపు ఉంటుంది.
అంటే గ్రాముకు రూ.4,757 చెల్లిస్తే సరిపోతుంది. మే 31వ తేదీ నుంచి జూన్ 4 వరకూ అమల్లో ఉన్న మూడవ విడత స్కీమ్ ధర గ్రాముకు రూ.4,889. ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 2021 వరకూ మొత్తం ఆరు దఫాలుగా గోల్డ్ బాండ్ స్కీమ్ అమలు జరుగుతోంది. భారత ప్రభుత్వం తరఫున ఆర్‌బీఐ గోల్డ్ బాండ్లను జారీ చేసే సంగతి తెలిసిందే. చందాకు ముందు వారం చివరి మూడు రోజుల్లో 999 ప్యూరిటీ పసిడి ధర ముగింపు సగటు ప్రాతిపదికన ఇష్యూ ధర నిర్ణయించినట్లు ఆర్‌బీఐ తాజాగా తెలిపింది. 2015 నవంబర్లో కేంద్రం గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment