త్వరలో రూ.లక్షకు.. ఎవరెస్ట్‌ ఎక్కేసిన బంగారం! | Gold Prices Over The Years In India From 1950 To 2024, How It Is Increasing And Prices History | Sakshi
Sakshi News home page

త్వరలో రూ.లక్షకు.. ఎవరెస్ట్‌ ఎక్కేసిన బంగారం!

Oct 24 2024 8:32 AM | Updated on Oct 24 2024 11:12 AM

Gold prices over the years in india

చరిత్రలో తొలిసారి గరిష్ట ధర పలికిన పసిడి

రూ.80 వేలు దాటిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం

75 ఏళ్ల క్రితం 10 గ్రాములు రూ.99 మాత్రమే

ఐదేళ్ల తర్వాత 1955లో రూ.20 తగ్గి రూ.79కి చేరిక

2015లో కేవలం రూ.26,343 మాత్రమే..

గడచిన తొమ్మిదేళ్లలో ఏకంగా రూ.55వేలు పెరుగుదల

బంగారం.. ఓ సింగారం.. ఓ ఆచారం.. ఓ అవసరం.. ఓ ఫ్యాషన్‌.. ఇలా పేరు ఏదైనా నిత్య జీవితంలో దీనితో పెనవేసుకున్న బంధం వెలకట్టలేనిది. ఇంతగా ప్రాధాన్యత దక్కించుకున్న ఈ పసిడి ధర ఇప్పుడు కొండెక్కింది. కొండంటే మామూలు కొండ కాదు.. ఏకంగా ఎవరెస్టే ఎక్కి జిగేల్‌ జిగేల్‌మంటోంది.

సాక్షి ప్రతినిధి కర్నూలు: చరిత్రలో తొలిసారిగా 10 గ్రాముల బంగారం ధర రూ.80 వేల మార్క్‌ను దాటింది. బులియన్‌ మార్కె­ట్‌లో బుధవారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం పది గ్రాములు రూ.80,070కి చేరింది. దీంతో మార్కెట్‌లో ఒక్కసారిగా బంగారం ధరలపై మరోసారి చర్చ మొదలైంది. చాలా వేగంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని కొందరు అంటుంటే.. ఇంకొందరు త్వరలోనే రూ.80 వేలు కాస్త రూ.లక్షకు చేరుతుందని విశ్లేషిస్తు­న్నారు.

ఇంకోవైపు.. ఆశ్వీయుజ మాసంలో పెళ్లిళ్లకు సిద్ధమైన సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు బంగారు ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. బంగారం కొనుగోలు చేసే దేశాల్లో ప్రపంచంలోనే మన దేశం రెండో స్థానంలో ఉంది. బంగారం లేకుండా మన దగ్గర ఏ శుభకార్యం జరగదంటే అతిశయోక్తి కాదు. అయితే.. పదేళ్లుగా బంగారం ధరలు వేగంగా పెరుగుతూ వస్తున్నాయి. మూణ్ణెళ్ల కిందట జూలైలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.75వేల వరకూ ట్రేడ్‌ అయింది. అదే 22 క్యారెట్లు రూ.68,800 చేరింది.

అయితే, కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా 10 గ్రాములపై రూ.6 వేల వరకూ తగ్గింది. అంటే.. 22 క్యారెట్ల బంగారం రూ.63 వేలకు.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.70వేలకు తగ్గింది. కేంద్రం దిగుమతి సుంకం తగ్గించడంవల్లే ధరలు తగ్గుముఖం పట్టాయని, మరింతగా తగ్గే అవకాశం ఉందని బంగారం కొనేందుకు ఇదే అనువైన సమయమని అప్పట్లో అంతా భావించారు. ఇంకొందరు మరికొంత తగ్గుతాయని వేచిచూశారు. కానీ, అక్కడి నుండి రోజూ ధరలు ధగధగలాడుతూ బుధవారం ఏకంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.80,070కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ.73,400కు పెరిగింది. బులియన్‌ మార్కెట్‌ చరిత్రలో ఇదే గరిష్టం. 

 

75 ఏళ్ల కిందట రూ.99 మాత్రమే.. 
నిజానికి.. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో 10 గ్రాముల బంగారం ధర రూ.వందలోపే ఉండేది. 1950లో 10 గ్రాముల ధర రూ.99. ఐదేళ్ల తర్వాత అంటే 1955లో రూ.20 తగ్గి రూ.79కి చేరింది. ఆ తర్వాత ఐదేళ్లకు రూ.111కు చేరిన పుత్తడి, 1965లో ఏకంగా రూ.39 తగ్గి 20 ఏళ్లలో కనిష్టంగా రూ.72కు చేరింది. ఆ తర్వాత ఏటికేడు ధరలు పెరుగుతూ వచ్చాయి. 2008లో తొలిసారిగా పది గ్రాముల బంగారం రూ.10వేల మార్క్‌ దాటింది. అప్పట్లో దీనిపై పెద్ద చర్చే నడిచింది. అయితే.. రెండేళ్లలోనే అంటే 2010లో ఏకంగా రూ.8 వేలకు పైగా పెరిగి రూ.18వేల మార్క్‌ను దాటింది. 2015లో రూ.26,343 ఉండేది. ఇప్పుడు రూ.24 క్యారెట్లు రూ.80,070, 22 క్యారెట్ల ధర రూ.73,400కు పెరిగిందంటే బంగారం ధరలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో తెలుస్తోంది.

ప్రభావం చూపని సుంకం తగ్గింపు! 
బంగారం, వెండి, ప్లాటినంతో పాటు విలువైన లోహాలపై 10 శాతం బీసీడీ (బేసిక్‌ కస్టమ్‌ డ్యూటీ) ఉండేది. దీనికి అదనంగా ఏఐడీసీ (అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌) 5 శాతం ఉండేది. కేంద్రం బీసీడీని 5 శాతం, ఏఐడీసీని 4 శాతం తగ్గించింది. కస్టమ్స్‌ సుంకం ఆరు శాతానికే పరిమితం చేసింది. అయితే, జీఎస్టీలో మాత్రం మార్పుల్లేవు. మూడు శాతంగానే ఉంది. దీంతో మొత్తంగా జీఎస్టీతో కలిపి బంగారు, వెండిపై 18 శాతం ఉన్న సుంకం 9 శాతానికి తగ్గింది. ఫలితంగా.. బంగారు, వెండి ధరలు జూలైలో తగ్గుముఖం పట్టాయి. అయితే, ఆగస్టు నుంచి తిరిగి పెరుగుతూ అక్టోబరులో ఆల్‌టైం గరిష్టానికి చేరాయి. దీంతో కేంద్రం స్మగ్లింగ్‌ను నివారించేందుకు తగ్గించిన సుంకం మార్కెట్‌పై పెద్దగా ప్రభా­వం చూపలేదని వ్యాపార వర్గాలు అంటున్నాయి.

ప్లాటినం కంటే విలువైన లోహం..
పదిహేనేళ్ల కిందటి వరకూ బంగారం కంటే ప్లాటినం విలువైన లోహం. బాగా డబ్బున్న కోటీశ్వరులు బంగారం కంటే ప్లాటినం ఆభరణాలు కొనుగోలు చేసేవారు. అప్పట్లో బంగారం కంటే ప్లాటినం ధర ఎక్కువగా ఉండటంతో ఏదైనా శుభకార్యానికి ప్లాటినం నగలతో వచ్చే స్త్రీలను ప్రత్యేకంగా చూసేవారు. అయితే, ఇప్పుడు ప్లాటినంను దాటి బంగారం ధర రెట్టింపు అయింది.

బులియన్‌ మార్కెట్‌లో ఇలా జరుగుతుందని ఊహించలేదని బంగారు వ్యాపారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర బుధవారం రూ.73,400 ఉంటే, 10 గ్రాముల ప్లాటినం ధర రూ.30,500 ఉంది. దీనికి కారణమేంటని వ్యాపారులను ఆరా తీస్తే ప్రపంచవ్యాప్తంగా ప్లాటినంతో పోలిస్తే బంగారం కొనుగోళ్లు అధికమని.. ఫారెక్స్‌ మార్కెట్‌లో కూడా బంగారంపైనే పెట్టుబడులు పెడతారని, దీంతో అది భారీగా పెరుగుతూ వచ్చిందని చెబుతున్నారు.

ఇదీ చదవండి: రూ.12 లక్షలు ఉన్నాయి.. ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలి?

బంగారు కొనాలంటేనే భయం వేస్తోంది. 
గోల్డ్‌ ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దీంతో సామాన్యులు కొనే పరిస్థితి లేదు. ఇలా ధరలు పెరిగిపోతూ ఉంటే ఆచితూచి కొనాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో గోల్డ్‌షాపులకు వెళ్లాలంటే కొంచెం ఆలోచించాల్సిందే. 
– నవిత, కిడ్స్‌ స్టూడియో నిర్వాహకులు, కర్నూలు

గోల్డ్‌ కొనడం కష్టమే..
బంగారం ధర రూ.80­వేలు దాటింది. మేకింగ్‌ చార్జీలు, జీఎస్టీ అంతా కలిపి రూ. లక్ష అవుతోంది. 10 గ్రాముల బంగారాన్ని దాదాపు రూ.లక్ష పెట్టి కొనడమంటే చాలా కష్టం. చైన్‌ హుక్‌ పోతే చేయించడానికి రూ.10 వేలు అవుతోంది. ధరల పెరుగుదలను ఊహించలేకపోతున్నాం. మధ్య తరగతి కుటుంబాలు బంగారం అంటేనే అమ్మో అనే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. పెళ్లిళ్లు ఉన్న వారికి పెరిగిన గోల్డ్‌ ధరలు అదనపు భారమే.
– గౌతమి, కర్నూలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement