హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా క్లినికల్ ట్రయల్స్ పరిశ్రమ ఏటా 7–8 శాతం మేర వృద్ధి చెందనుంది. 2.3 బిలియన్ డాలర్లుగా ఉన్న పరిశ్రమ వచ్చే అయిదేళ్లలో దాదాపు 5 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. అంతర్జాతీయంగా క్లినికల్ రీసెర్చ్ దిగ్గజాల్లో ఒకటైన పారెక్సెల్ భారత విభాగం ఎండీ సంజయ్ వ్యాస్ శుక్రవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఈ విషయాలు తెలిపారు.
దేశీయంగా దాదాపు 40 పైగా అధ్యయనాలు జరుగుతుండగా.. వాటిలో తమ సంస్థ సుమారు 12–15 స్టడీస్ నిర్వహిస్తోందని ఆయన చెప్పారు. భారత్‌లో తమకు మొత్తం 5 కేంద్రాల్లో 6,000 మంది పైచిలుకు సిబ్బంది ఉండగా.. హైదరాబాద్, చండీగఢ్ సెంటర్లు అతి పెద్దవని వ్యాస్ వివరించారు. వచ్చే అయిదేళ్లలో ఉద్యోగుల సంఖ్యను 8,000కు పెంచుకోనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో తమకు 2,500 మంది పైగా సిబ్బంది ఉన్నట్లు వివరించారు.
తెలంగాణ సహా దేశీయంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు పరిస్థితులు, నిపుణుల లభ్యత బాగుంటున్నాయని ఆయన చెప్పారు. అయితే, పేషెంట్లలో అవగాహన, తృతీయ శ్రేణి పట్టణాలు మొదలైన చోట్ల మౌలిక సదుపాయాలు, అధ్యయనాల మధ్యలోనే పేషెంట్లు తప్పుకోవడం తదితర అంశాలపరంగా కొన్ని సవాళ్లను అధిగమించాల్సి ఉందని వ్యాస్ పేర్కొన్నారు. విద్యార్థుల్లో పరిశ్రమకు అవసరమయ్యే నైపుణ్యాలను పెంపొందించేందుకు విద్యాసంస్థలతో కూడా కలిసి పనిచేస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వంతోనూ ఈ విషయంలో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment