ముంబై: ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగే ఈ వారంలో స్టాక్ సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నెలవారీ ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ ట్రేడింగ్(గురవారం)కు సంబంధించి ఈ ఏడాదికిదే ఆఖరి వారం కావడంతో ట్రేడర్లు ఆచితూచి అడుగేసే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా నమోదవుతున్న కోవిడ్ కేసులు, ఎర్ర సముద్రంలో అలజడుల పరిణామాలను మార్కెట్ వర్గాలు పరిశీలించవచ్చు. ఈ వారంలోని ఆయా కంపెనీల ఐపీఓలు, లిస్టింగులపైనా దృష్టి సారించే వీలుంది. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల క్రయవిక్రయాలు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలూ ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే వీలుంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా నేడు(సోమవారం) మార్కెట్లకు సెలవు.
► ‘‘మార్కెట్‌లో ఇప్పటికీ సానుకూల వాతావరణం కలిగి ఉంది. అయితే కొత్త ఏడాది ప్రారంభం, క్రిస్మస్ పండుగ సెలవుల నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి పెద్దగా సంకేతాలు అందకపోవచ్చు. రంగాల వారీ, స్టాక్ ఆధారిత ట్రేడింగ్ దేశీయ ఈక్విటీ మార్కెట్‌కు దిశానిర్దేశం చేయొచ్చు.
సాంకేతికంగా నిఫ్టీకి దిగువ స్థాయిలో 21,000 – 20,950 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే లాభాల స్వీకరణ చోటు చేసుకోవచ్చు. ఎగువన 21,400 – 21,450 స్థాయిల్లో నిరోధం ఉంది. స్థిరీకరణలో భాగంగా, పతనమైన నాణ్యత కలిగి షేర్లను కొనుగోలు చేయొచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ్ ఖేమా తెలిపారు.
► గరిష్ట స్థాయిల వద్ద స్థిరీకరణలో భాగంగా గతవారం సెన్సెక్స్ 377 పాయింట్లు, నిఫ్టీ 107 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. డిసెంబర్ 20(మంగళవారం) సెన్సెక్స్ 71,913, నిఫ్టీ 21,593 వద్ద కొత్త జీవితకాల గరిష్ట స్థాయిలు నమోదు చేశాయి.
4 ఐపీఓలు, 8 లిస్టింగులు...
ట్రిడెంట్ టెక్‌లాబ్స్, సమీరా ఆగ్రో అండ్ ఇన్ఫ్రా, సుప్రీం పవర్ ఎక్విప్‌మెంట్, ఇండిఫ్రా కంపెనీలు ఈ వారంలో ప్రాథమిక మార్కెట్ నుంచి నిధులు సమీకరణ సిద్ధమయ్యాయి. ఇక ఈ ఏడాది చివరి వారంలో 8 ప్రధాన కంపెనీల షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. మోతీసన్స్ జ్యువెలరీస్, మూత్తూట్ మైక్రోఫిన్, సూరజ్ ఎస్టేట్ డెవెలపర్స్ షేర్లు మంగళవారం (డిసెంబర్ 26న), హ్యాపీ ఫోర్జిన్స్, ఆర్‌బీజెడ్ జ్యువెలరీస్, క్రెడో బ్రాండ్ ముఫ్టీ షేర్లు బుధవారం (డిసెంబర్ 27న), అజాద్ ఇంజనీరింగ్స్ (డిసెంబర్ 28న), ఇన్నోవా క్యాప్‌ట్యాబ్ కంపెనీల డిసెంబర్ 29 (గురువారం) లిస్ట్ కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment