ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 483 పాయింట్లు జంప్‌చేసి 37,872కు చేరింది. కాగా.. కోవిడ్-19 చికిత్సలో వినియోగిస్తున్న ఫావిపిరవిర్ ఔషధాన్నిదేశీ మార్కెట్లో విడుదల చేసినట్లు వెల్లడించడంతో ఇండొకొరెమిడీస్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు పీఎస్‌యూ దిగ్గజాల నుంచి తాజాగా ఆర్డర్లు పొందినట్లు పేర్కొనడంతో స్టీల్, ఎలక్ట్రికల్ లైటింగ్ ప్రొడక్టుల కంపెనీ సూర్య రోష్నీ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..
ఇండొకొ రెమిడీస్
ఫెవిండో 400 పేరుతో ఫావిపిరవిర్ ఔషధాన్ని 400 ఎంజీ డోసేజీలో దేశీ మార్కెట్లో విడుదల చేసినట్లు ఫార్మా రంగ కంపెనీ ఇండొకొరెమిడీస్ వెల్లడించింది. ఇన్‌ఫ్లుయెంజా వైరస్ కట్టడికి ఆర్‌ఎన్‌ఏ ఆధారంగా పనిచేసే ఈ ఔషధానికి డీసీజీఐ అనుమతి లభించినట్లు పేర్కొంది. ఈ ఔషధంతోపాటు.. కోవిడ్-19 చికిత్సలో భాగంగా వినియోగించగల పోవిడోన్ లోడిన్ గార్గిల్, రోగ నిరోధక శక్తిని పెంచగల ట్యాబ్లెట్లనూ విడుదల చేసినట్లు ఇండొకొ తెలియజేసింది. ఈ ట్యాబ్లెట్లు జింక్, విటమిన్ సి, డిలను కలిగి ఉంటాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇండొకొ షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత 9 శాతం దూసుకెళ్లింది. రూ. 284 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 5 శాతం ఎగసి రూ. 275 వద్ద ట్రేడవుతోంది.
సూర్య రోష్నీ
ఆయిల్, గ్యాస్ పీఎస్‌యూలు గెయిల్, ఐజీజీఎల్ నుంచి రూ. 273 కోట్ల విలువైన కాంట్రాక్టులు తాజాగా లభించినట్లు సూర్య రోష్నీ పేర్కొంది. ఆర్డర్లలో భాగంగా ఏపీఐ లైన్ పైపులను గెయిల్, ఐజీజీఎల్(ఇంద్రధనుష్ గ్యాస్ గ్రిడ్)లకు సరఫరా చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ఈశాన్య గ్యాస్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా ఈ ఆర్డర్లు లభించినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో సూర్య రోష్నీ షేరు తొలుత ఎన్‌ఎస్‌ఈలో 10 శాతం జంప్‌చేసింది. రూ. 213ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 6 శాతం లాభంతో రూ. 206 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment