అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై ప్రముఖ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ కీలక వ్యాఖ్యలు చేశారు. హిండెన్‌బర్గ్ నివేదిక తయారీకి ముందే అదానీ షేర్లలో కోటక్ ఇండియా ఆపర్చునిటీ ఫండ్(కేఐఓఎఫ్) ద్వారా షార్ట్ పొజిషన్‌లను తీసుకున్నట్లు చెప్పారు. హిండెన్‌బర్గ్ నివేదిక వెనక చైనా వ్యక్తుల హస్తం ఉందన్నారు. అదానీ గ్రూప్‌పై నివేదికను సిద్ధం చేసేందుకే అమెరికా వ్యాపారవేత్త మార్క్ కింగ్‌డన్ హిండెన్‌బర్గ్‌ను ఆశ్రయించారని చెప్పారు.
సెబీ ఇటీవల హిండెన్‌బర్గ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందిస్తూ ఆ నోటీసుల్లో ఎలాంటి నిజం లేదని హిండెన్‌బర్గ్ వాటిని కొట్టిపారేసింది. అదానీ షేర్ల పతనాన్ని ముందే అంచనా వేసి ట్రేడ్ చేసినట్లు సెబీ నోటీసుల్లో ఉంది. నివేదిక విడుదలకు ముందే కింగ్‌డన్‌తో హిండెన్‌బర్గ్ అనుబంధం మొదలైందని సెబీ పేర్కొంది. ఇదంతా కుట్రలో భాగంగానే జరిగిందని తెలిపింది. ఇదిలాఉండగా, అదానీ గ్రూప్ కృత్రిమంగా స్టాక్ ధరలను పెంచిందని చెప్పిన సమయంలోనే స్టాక్స్ ధరను షార్ట్ చేశామని హిండెన్‌బర్గ్ తెలిపింది. కింగ్‌డన్ షార్ట్ పొజిషన్ల గురించి తమకు సమాచారం లేదని సెబీ నోటీసుల తర్వాత హిండెన్‌బర్గ్ తన వివరణలో పేర్కొంది.
ఈ వ్యవహారంపై తాజాగా ప్రముఖ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ స్పందిస్తూ..‘అమెరికా వ్యాపారవేత్త కింగ్‌డన్ అదానీ గ్రూప్‌పై నివేదికను రూపొందించడానికే హిండెన్‌బర్గ్‌ను ఆశ్రయించారు. అదానీ షేర్లలో ట్రేడింగ్ కోసం ఆఫ్‌షోర్ ఫండ్ ఏర్పాటుకు కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్‌మెంట్స్ (కేఎంఐఎల్)ని కింగ్‌డన్ సంప్రదించారు. అలా కోటక్ ఇండియా ఆపర్చునిటీ ఫండ్ (కేఐఓఎఫ్)ను సిద్ధం చేశారు. హిండెన్‌బర్గ్ నివేదిక తయారీకి ముందే మారిషస్ ద్వారా అదానీ షేర్లలో కేఐఓఎఫ్ షార్ట్ పొజిషన్‌లను తీసుకుంది. దీని కోసం కింగ్‌డన్ మాస్టర్ ఫండ్ నిధులు అందించింది. ఇందులో కింగ్‌డన్ భార్య అన్లాచెంగ్‌తో సహా ఆయన కుటుంబానికి భారీగా వాటాలున్నాయి’ అని చెప్పారు.
ఎవరీ అన్లా చెంగ్..?
అన్లా చెంగ్ ఒక చైనీస్ అమెరికన్. అమెరికాలో చైనీయుల హక్కులు, వారి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. ఆమె ‘సుప్‌చైనా’ అనే మీడియా సంస్థకు సీఈఓగా వ్యవహరించారు. ఇది అమెరికాలో చైనా అనుకూల మీడియా సంస్థలను నిర్వహిస్తుంది. ఈ సంస్థకు అక్కడి కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధం ఉందని ఆరోపణలు రావటంతో దాన్ని మూసివేశారు.
ఇదీ చదవండి: గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్.. మంత్రి ప్రకటన
‘హిండెన్‌బర్గ్ నివేదిక వెనక చైనా వర్గాల హస్తం ఉంది. అసలు కేఎంఐఎల్‌ను కింగ్‌డన్‌కు ఎవరు పరిచయం చేశారు? హిండెన్‌బర్గ్ నివేదిక రూపకల్పనలో సహకరించిన భారత ఆర్థిక సంస్థలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులకు చైనా వర్గాల గురించి ముందే తెలుసా? షార్ట్ ట్రేడింగ్ వల్ల వారికి ఏమేరకు లాభం చేకూరింది? వీటన్నింటిపై సెబీ సమగ్ర దర్యాప్తు చేయాలి’ అని జెఠ్మలానీ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment