దిగ్గజ బ్యాంకర్ 'నారాయణన్ వాఘుల్' కన్నుమూత | Legendary Banker Narayanan Vaghul Passes Away At 88 | Sakshi
Sakshi News home page

దిగ్గజ బ్యాంకర్ 'నారాయణన్ వాఘుల్' కన్నుమూత

Published Sat, May 18 2024 5:23 PM | Last Updated on Sat, May 18 2024 5:42 PM

Legendary Banker Narayanan Vaghul Passes Away At 88

ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఛైర్మన్ 'నారాయణన్ వాఘుల్' చెన్నైలోని అపోలో హాస్పిటల్స్‌లో కన్నుమూశారు. రెండు రోజులకు ముందు ఇంట్లో పడిపోవడం వల్ల అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. హుటాహుటిన ఆయన్ను అపోలో ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌ సపోర్ట్‌తో చికిత్స పొందుతూ.. శనివారం తుది శ్వాస విడిచారు.

నారాయణన్ వాఘుల్ వయసు 88 ఏళ్లు. ఈయన భార్య పద్మా వాఘల్, పిల్లలు మోహన్, సుధ.. మనవళ్లు సంజయ్, కావ్య, అనువ్, సంతోష్ ఉన్నారు. భారతీయ బ్యాంకింగ్‌లో కొత్త శకానికి నాంది పలికిన దిగ్గజం నారాయణన్ వాఘుల్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

నారాయణన్ వాఘుల్ 1936లో దక్షిణ భారతదేశంలోని గ్రామీణ ప్రాంతంలో జన్మించారు. అతని కుటుంబం చెన్నైకి (అప్పటి మద్రాసు) వెళ్లింది. అక్కడే లయోలా కాలేజీలో చదువుకున్నాడు. బ్యాంకింగ్ రంగంలో గొప్పగా ఎదిగిన వాఘల్.. ప్రారంభంలో సివిల్ సర్వీసెస్‌లో చేరాలనుకున్నారు. అయితే కొత్తగా ఏర్పడిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ప్రవేశించడానికి పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఆ పరీక్షను వాఘుల్ కేవలం ప్రాక్టీస్ టెస్ట్ మాదిరిగా ప్రయత్నించినట్లు పేర్కొన్నారు.

తండ్రి ప్రోత్సాహంతో 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఎస్‌బీఐ నుంచి వైదొలిగారు. ఆ తరువాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్‌లో చేరి దాని డైరెక్టర్ అయ్యారు. 39 సంవత్సరాల వయస్సులో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిని చేపట్టారు.

నారాయణన్ వాఘుల్ 1981లో బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చెప్పారు. 1981 - 1985 మధ్య కాలంలో ఐసీఐసీఐ లిమిటెడ్‌కి చైర్మన్‌గా నాయకత్వం వహించారు. ఇలా ఆయన దినదినాభివృద్ధి చెందుతూ.. బ్యాంకింగ్ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. 2006లో ఎకనామిక్ టైమ్స్ ద్వారా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. వాణిజ్యం, పరిశ్రమలకు చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2009లో పద్మభూషణ్‌తో సత్కరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement