సార్వత్రిక ఎన్నికల వేళ వాహనదారులకు కేంద్ర ఎన్నికల సంఘం రిలీఫ్ కల్పించింది. టోల్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ)ను ఆదేశించింది. కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ అభ్యర్థన మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో వాహనదారుల నుంచి పాత టోల్ ఛార్జీలే వసూలు చేయాలని టోల్ ఆపరేటర్లకు ఎన్‌హెచ్ఏఐ సూచించింది.
ఏటా ఏప్రిల్ ఒకటో తేదీన ఎన్‌హెచ్ఏఐ టోల్ ఛార్జీలు పెంచుతుంది. సంస్థ నిర్ణయాల ప్రకారం..సరాసరి ఐదు శాతం టోల్ ఛార్జీలు పెరుగుతాయి. ఈమేరకు ముందుగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆదివారం రాత్రి నుంచి పెరిగిన టోల్ ఛార్జీలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. కానీ కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ ఛార్జీల పెంపు అంశాన్ని ఎన్నికల సంఘం వద్దకు తీసుకెళ్లింది. దాంతో ఆ వ్యవహారాన్ని పరిశీలించిన ఈసీ ఎన్నికల నేపథ్యంలో పెంపు నిర్ణయం వాయిదా వేయాలని ఎన్‌హెచ్‌ఏఐను ఆదేశించింది. దాంతో తాజాగా ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా వెనక్కి తీసుకుంటున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. పెరిగిన టోల్ ఛార్జీలు ఎప్పటి నుంచి అమలవుతాయో తెలియజేస్తామని చెప్పింది. అప్పటివరకు పాత ఛార్జీలే వర్తిస్తాయని పేర్కొంది.
ఇదీ చదవండి: పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. ఎంతంటే..
ఈ మేరకు ఆదివారం అర్ధరాత్రి నుంచి వాహనదారుల నుంచి వసూలు చేసిన అదనపు మొత్తం టోల్ ఛార్జీలను సదరు వాహనదారులకు వెనక్కు చెల్లిస్తామని ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు చెప్పాయి. ఈ నెల 26 నుంచి జూన్ ఒకటో తేదీ వరకూ ఏడు విడతల్లో దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెలువడతాయి.
Comments
Please login to add a commentAdd a comment