హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ వచ్చే అయిదేళ్లలో 8.92 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నట్లు ఈ–గేమింగ్ ఫెడరేషన్ (ఈజీఎఫ్) సీఈవో అనురాగ్ సక్సేనా తెలిపారు. ప్రస్తుతం ఇది 3.1 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నట్లు చెప్పారు. ఇటీవలి గ్రాంట్ థార్న్‌టన్ భారత్, ఈజీఎఫ్ నివేదిక ప్రకారం 2018–23 మధ్య కాలంలో ఈ రంగంలో పనిచేసేవారి సంఖ్య 20 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. ఏడాదికి దాదాపు రూ. 7వేల కోట్ల స్థాయిలో జీఎస్‌టీ వసూళ్లు ఉంటున్నాయన్నారు.
అయితే, పరిశ్రమ ఇంత భారీగా విస్తరిస్తున్నప్పటికీ ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల స్కిల్ గేమింగ్, గ్యాంబ్లింగ్ మధ్య తేడా తెలియక గందరగోళం నెలకొంటోందని సక్సేనా చెప్పారు. ఈ నేపథ్యంలోనే పరిశ్రమకు నియంత్రణపరమైన విధి విధానాలను రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు. దీనిపై కసరత్తు జరుగుతోందని వివరించారు. నియంత్రణ వ్యవస్థ ఉంటే గేమింగ్ రంగంలోకి భారీగా పెట్టుబడులు వస్తాయని సక్సేనా చెప్పారు. గేమింగ్‌పై అవగాహన పెంచేందుకు ప్రత్యేకంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. టెక్ రంగంలో హైదరాబాద్ వేగంగా పురోగమిస్తోందని, స్థానికంగా 4,369 టెక్ స్టార్టప్‌లు, దాదాపు 77 గేమింగ్ స్టార్టప్‌లు ఉన్నాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment