
ప్రధాన నగరాల్లో స్థిరాస్తి ధరలు భారీగా పెరగడంతో రియల్‌ఎస్టేట్ పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయాల కోసం ఇతర పట్టణాలపై ఆసక్తి చూపుతున్నారని ప్రాపర్టీ రీసెర్చ్ సంస్థ కొలియర్స్ ఇండియా ఒక నివేదికలో తెలిపింది. ముంబై, దిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ప్రాపర్టీ ధరలు పెరగడంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న 17 నగరాలను ప్రతిపాదించింది.
రిపోర్ట్‌లోని వివరాల ప్రకారం..దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు(రూ.83 లక్షల కోట్లు), 2050 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల(రూ.410 లక్షల కోట్లు)కు చేరుతుందని అంచనా. 2050 నాటికి దేశంలో ఎనిమిది మెగాసిటీలు ఏర్పడుతాయి. నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్‌ఐపీ), పీఎం గతిశక్తి ప్రాజెక్టులు టైర్ 1 నగరాల్లో కీలకమార్పులు తీసుకొస్తాయి. మెరుగైన కనెక్టివిటీ, తయారీ కార్యకలాపాల వృద్ధి ఊపందుకుంటుంది. ఉద్యోగులు హైబ్రిడ్ వర్క్ మోడల్స్ వైపు మారడంతో చిన్న నగరాల్లో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే వృద్ధి చెందిన దిల్లీ, ముంబయి, బెంగళూరులో ప్రాపర్టీ ధరలు భారీగా పెరిగాయి. దాంతో రియల్టీ పెట్టుబడిదారులు ఇతర నగరాలపై దృష్టి పెడుతున్నారు. అందులో ప్రధానంగా ఉత్తరాన అమృత్‌సర్, అయోధ్య, జైపుర్, కాన్పూర్, లఖ్‌నపూ, వారణాసి; తూర్పున పట్నా, పూరీ; పశ్చిమాన ద్వారక, నాగ్‌పుర్, షిర్డీ, సూరత్; దక్షిణాన కోయంబత్తూర్, కొచ్చి, తిరుపతి, విశాఖపట్నం, ఇందోర్ నగరాలున్నాయి. ఈ నగరాల్లో కార్యాలయాలు, గిడ్డంగులు, టూరిజం..వంటి వాటికి ప్రాధాన్యత పెరుగుతోంది.
ఇదీ చదవండి: యాపిల్ ఉత్పత్తుల్లో మెటా ఏఐ.. క్లారిటీ ఇచ్చిన దిగ్గజ సంస్థ
ఈ సందర్భంగా కొలియర్స్ ఇండియా సీఈఓ, బాదల్ యాగ్నిక్ మాట్లాడుతూ..‘టైర్1, టైర్ 2 నగరాల్లో పనిప్రదేశాలకు డిమాండ్ పెరుగుతోంది. మౌలిక సదుపాయాలు మెరుగవుతున్నాయి. పర్యాటకం (ముఖ్యంగా ఆధ్యాత్మిక పర్యాటకం), ఇంటర్నెట్ వ్యాప్తి అధికమవుతోంది. కోయంబత్తూర్, ఇందోర్, కొచ్చి శాటిలైట్ ఆఫీస్ మార్కెట్‌లుగా ఎదుగుతున్నాయి. జైపుర్, కాన్పూర్, లఖ్‌నవూ, నాగ్‌పుర్, పట్నా, సూరత్‌లు డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అమృత్‌సర్, అయోధ్య, ద్వారక, పూరీ, షిర్డీ, తిరుపతి, వారణాసి వంటి నగరాలు ఆధ్యాత్మిక పర్యాటకంలో వృద్ధి చెందుతున్నాయి’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment