
సెకండ్ వేవ్‌లో భాగంగా పలు యూరోపియన్ దేశాలతోపాటు.. యూఎస్‌లోనూ కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో దేశీ కరెన్సీకి సైతం ఆ సెగ తగులుతోంది. దీంతో వరుసగా రెండో రోజు డాలరుతో మారకంలో రూపాయి పతన బాటలో సాగుతోంది. ప్రస్తుతం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 30 పైసలు(0.4 శాతం) కోల్పోయి 74.40ను తాకింది. ఆగస్ట్ 27 తదుపరి ఇది కనిష్టంకాగా.. గురువారం రూపాయి సాంకేతికంగా కీలకమైన 74 ఎగువకు చేరిన విషయం విదితమే. గురువారం డాలరుతో మారకంలో రూపాయి 23 పైసలు క్షీణించి 74.10 వద్ద ముగిసింది. శుక్రవారం ఫారెక్స్ మార్కెట్లకు సెలవుకాగా.. యూఎస్ కాంగ్రెస్‌లో ప్యాకేజీకి ఆమోదముద్ర పడకపోవడంతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలపడుతూ వస్తోంది. ఇది రూపాయిని దెబ్బతీస్తున్నట్లు ఫారెక్స్ వర్గాలు తెలియజేశాయి.
ఇదీ ప్రభావం
కరోనా వైరస్ కట్టడికి వీలుగా బ్రిటన్ బాటలో తాజాగా జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ తదితర దేశాలలోనూ ఆంక్షలు విధిస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీకి దెబ్బతగలనున్న అంచనాలు బలపడుతున్నాయి. దీంతో అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం తలెత్తవచ్చన్న ఆందోళనలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్లు, ముడిచమురు ధరలు పతన బాటలో సాగుతుంటే.. సంక్షోభ సమయాల్లో పెట్టుబడులను ఆకట్టుకునే పసిడి మెరుస్తోంది. దీనికితోడు ఈ వారంలో అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుండటం, అధ్యక్ష ఎన్నికలు వంటి అంశాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచినట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా.. సమీపకాలంలో రూపాయికి 74.95 వద్ద గట్టి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని ఐఎఫ్‌ఏ గ్లోబల్ సీఈవో అభిషేక్ గోయెంకా అంచనా వేశారు. ఇదేవిధంగా 73.65 వద్ద సపోర్ట్ లభించవచ్చని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment