
సోలార్ ఫొటొ వోల్టాయిక్ మాడ్యూళ్ల తయారీ కంపెనీ సాత్విక్ గ్రీన్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూకి రూ. 442–465 ధరల శ్రేణి ప్రకటించింది. ఈ నెల 19న ప్రారంభంకానున్న ఇష్యూలో భాగంగా రూ. 700 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 200 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి 23న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 900 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. కంపెనీ లిస్టయితే రూ. 5,910 కోట్ల మార్కెట్ విలువను అందుకునే వీలుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 18న షేర్లను కేటాయించనుంది.
ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 477 కోట్లు సాత్విక్ సోలార్ ఇండస్ట్రీస్‌లో ఇన్వెస్ట్ చేయనుంది. ఒడిషాలోని గోపాల్‌పూర్ ఇండ్రస్టియల్ పార్క్‌లో 4 గిగావాట్ల సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. మరో రూ. 166.5 కోట్లు అనుబంధ సంస్థ రుణ చెల్లింపులకు వినియోగించనుంది. 2025 జూన్30కల్లా 3.8 గిగావాట్ల సోలార్ ఫొటొవోల్టాయిక్ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. సోలార్ ప్రాజెక్టులకు ఎండ్‌టుఎండ్ ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, నిర్మాణ సంబంధ సర్వీసులను కంపెనీ సమకూర్చుతోంది.
జీకే ఎనర్జీ @ రూ. 145–153
సౌర విద్యుత్(సోలార్ పవర్) ఆధారిత వ్యవసాయ నీటి పంప్ సిస్టమ్స్ అందించే జీకే ఎనర్జీ పబ్లిక్ ఇష్యూకి రూ. 145–153 ధరల శ్రేణి ప్రకటించింది. ఈ నెల 19న ప్రారంభంకానున్న ఇష్యూలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 65 కోట్ల విలువైన 42 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి 23న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 465 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 18న షేర్లను విక్రయించనుంది.
ఈక్విటీ జారీ నిధుల్లో దాదాపు రూ. 323 కోట్లు కంపెనీ దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. సోలార్ పవర్ వ్యవసాయ పంప్ సిస్టమ్స్‌కు కంపెనీ పూర్తిస్థాయిలో ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కమిషనింగ్(ఈపీసీ) సేవలు సమకూర్చుతోంది. తద్వారా రైతులకు వీటికి సంబంధించిన సర్వే, డిజైన్, సప్లై, అసెంబ్లీ, ఇన్‌స్టలేషన్, టెస్టింగ్, నిర్వహణ తదితర ఏకీకృత సర్వీసులు అందిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 98 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.