‘రూ.1.8 లక్షలు చెల్లిస్తే రూ.5 కోట్లు’.. సీఈఓ ఏమన్నారంటే.. | Scams Involving Fake Screenshots Of Zerodha, CEO Nithin Kamath Warns About New Scam Targeting Customers - Sakshi
Sakshi News home page

‘రూ.1.8 లక్షలు చెల్లిస్తే రూ.5 కోట్లు’.. సీఈఓ ఏమన్నారంటే..

Published Sat, Nov 25 2023 5:13 PM | Last Updated on Sat, Nov 25 2023 6:42 PM

Scams Involving Fake Screenshots Of Zerodha - Sakshi

డీప్‌ఫేక్‌ టెక్నాలజీ పుణ్యమా అని మెసేజ్‌, ఇమేజ్‌, వీడియో చూసినా అది నమ్మాలో.. వద్దో తెలియని పరిస్థితి దాపరించింది. ఇటీవల సెలబ్రిటీల ఫొటోలను డీప్‌ఫేక్‌ ద్వారా అనుమానం రాకుండా మార్ఫింగ్‌ చేసిన సైబర్‌ అటాకర్లు.. తాజాగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లపై విజృంభిస్తున్నారు. అనేక మంది ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ఇన్వెస్టర్లను బురిడీ కొట్టించే పనిలో పడ్డారు.

డీప్‌ఫేక్‌లను సాంకేతికత పెద్ద సమస్యగా మారింది. సైబర్ మోసగాళ్లు వీటిని వినియోగించి ఫేక్ ఇమేజెస్, వాయిస్, వీడియోలను తయారు చేస్తున్నారు. ఇవి కొందరికి ఆర్థిక పరమైన, వ్యక్తిగత, వృత్తిపరమైన నష్టాలను కలిగిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. వీటిని కేంద్రం సైతం చాలా సీరియస్‌గా తీసుకుంది. మంత్రులు సైతం ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. ఈ అంశాలపై అవగాహన లేనివారు సైబర్ మోసగాళ్ల చర్యలకు బలైపోతున్నారు.

డీప్‌ఫేక్‌ అంశంపై తాజాగా ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెరోధా సీఈఓ నితిన్‌కామత్‌ స్పందించారు. ఒక కస్టమర్ రూ.1.80 లక్షల స్కామ్‌ను తృటిలో తప్పించుకున్న సంఘటనను కామత్‌ తన ఎక్స్‌ ఖాతాలో వివరించారు. డీప్‌ఫేక్‌లను సృష్టించే యాప్స్ అందుబాటులోకి రావటంతో ఇలాంటి మోసపూరిత దాడులు పెరుగుతున్నాయని కంపెనీ హెచ్చరించారు. జెరోధా కస్టమర్‌కు రూ.1.8లక్షలు చెల్లిస్తే అతడి ఖాతాలో రూ.5 కోట్లు జమ చేస్తామని జెరోధా నుంచి ఒక మెసేజ్‌ వచ్చినట్లు కామత్‌ చెప్పారు. పైగా మెసేజ్‌ పంపించిన వారు తమ అకౌంట్లో రూ.10 కోట్లు ఉన్నట్లు కూడా ఫేక్‌ ఇమేజ్‌లు చూపించినట్లు తెలిపారు. ఈ తతంగాన్ని వెంటనే సదరు కస్టమర్‌ జెరోధా కస్టమర్‌ కేర్‌ విభాగంతో ధ్రువీకరించుకున్నారు. దాంతో తాను మోసపోకుండా ఉన్నాడని చెప్పారు. జెరోధా ఎవరికి ఇలాంటి మెసేజ్‌లు పంపలేదని, భవిష్యత్తులోనూ పంపదని కామత్‌ స్పష్టం చేశారు. డీప్‌ఫేక్‌ ఇమేజ్‌లు, వాయిస్‌లు, ఫొటోలతో స్కామర్లు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు వివరించారు. అలాంటి మెసేజ్‌లు నమ్మకూడదన్నారు. అందుకు సంబంధించి కామత్‌ తన ఎక్స్‌ ఖాతాలో ఒక వీడియో అప్‌లోడ్‌ చేశారు. 

ఇదీ చదవండి: సాయంత్రం 5 దాటితే కష్టాలే.. ఆ నగరాల్లో దారుణమైన ట్రాఫిక్‌!

స్కామర్లు స్టాక్ ట్రేడింగ్‌కు సంబంధించిన లాభనష్టాలు, లెడ్జర్‌లు, ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లు బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన రిపోర్టులను క్లోన్ యాప్స్ ద్వారా నకిలీ తయారు చేస్తున్నారు. వీటిని వినియోగించి వీడియోలు చేసి వైరల్ చేస్తున్నారు. వీరి మాటలు నమ్మి పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్ముతున్న కొందరు నష్టాల పాలవుతున్నారు. ఇన్వెస్టర్లు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement