జాబితాలో పారస్ హెల్త్‌కేర్
నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్
జారో ఎడ్యుకేషన్ ప్రాస్పెక్టస్ దాఖలు
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా రెండు కంపెనీలను అనుమతించింది. ఈ జాబితాలో ఆరోగ్య బీమా సేవలందించే నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఆరోగ్య పరిరక్షణ సర్వీసుల సంస్థ పారస్ హెల్త్‌కేర్ లిమిటెడ్ ఉన్నాయి. నివా బూపా జులైలోనూ, పారస్ హెల్త్ ఆగస్ట్‌లోనూ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. వివరాలు చూద్దాం.
ఆసుపత్రుల సంస్థ
పారస్ హెల్త్ బ్రాండుతో ఆసుపత్రుల చైన్‌ను నిర్వహిస్తున్న పారస్ హెల్త్‌కేర్ ఐపీవోలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.5 కోట్ల షేర్లను కంపెనీ ప్రమోటర్, ప్రస్తుత వాటాదారు సంస్థ ఆఫర్ చేయనున్నాయి. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, అనుబంధ సంస్థలు పారస్ హెల్త్‌కేర్(రాంచీ) ప్రయివేట్, ప్లస్ మెడికేర్ హాస్పిటల్స్ ప్రయివేట్‌లో పెట్టుబడులకు( రుణ చెల్లింపులు) వెచి్చంచనుంది. హర్యానా, బీహార్, యూపీ, రాజస్తాన్, జేఅండ్‌కేలలో సంస్థ పారస్ హెల్త్ పేరుతో 8 ఆసుపత్రులను నిర్వహిస్తోంది. మొత్తం 2,135 పడకలతో కార్యకలాపాలు కొనసాగిస్తోంది.
రూ. 3,000 కోట్లపై కన్ను
గతంలో మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీగా సేవలందించిన నివా బూపా ఐపీవోలో భాగంగా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 2,200 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్ విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 3,000 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ప్రస్తుతం కంపెనీలో యూకే దిగ్గజం బూపా(సింగపూర్ హోల్డింగ్స్) 62.27 శాతం వాటాను కలిగి ఉంది. ఫెటిల్ టోన్ ఎల్‌ఎల్‌పీకు 27.86 శాతం వాటా ఉంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 625 కోట్లు మూలధన పటిష్టతకు వినియోగించనుంది. స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ తదుపరి రెండో స్టాండెలోన్ హెల్త్ ఇన్సూరర్‌గా బూపా నివా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కానుంది.
ఐపీవో బాటలో జారో
విద్యా రంగ సంస్థ జారో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్(జారో ఎడ్యుకేషన్) పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 170 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ విక్రయానికి ఉంచనున్నారు. ప్రస్తుతం ప్రమోటర్లకు కంపెనీలో 85 శాతానికిపైగా వాటా ఉంది. ఐపీవో నిధుల్లో రూ. 81 కోట్లు బ్రాండ్ విస్తరణకు, రూ. 48 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది.
Comments
Please login to add a commentAdd a comment