సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురీ బుచ్ పనితీరుపై ఆందోళనలు పెరుగుతున్నాయి. పని సమయాల్లో కిందిస్థాయి సిబ్బందితో పరుష పదజాలాన్ని వాడుతున్నారని, అవాస్తవ లక్ష్యాలను నిర్దేశిస్తున్నారని సెబీ అధికారులు ఆర్థిక మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశారు.
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అధికారులు ఇటీవల సంస్థ చీఫ్ పనితీరుపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసినట్లు కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. ఫిర్యాదులోని వివరాల ప్రకారం మాధబి కిందిస్థాయి ఉద్యోగులతో సమావేశాల్లో అరవడం, తిట్టడం, బహిరంగంగా అవమానిస్తున్నట్లు తెలిపారు. అసిస్టెంట్ మేనేజర్ ఆపై స్థాయి సిబ్బంది మొత్తం సెబీలో 1000 మంది ఉన్నారు.
అందులో 500 మంది ‘గ్రీవెన్స్ ఆఫ్ సెబీ ఆఫీసర్స్-ఎ కాల్ ఫర్ రెస్పెక్ట్’ అనే శీర్షికతో రాసిన ఫిర్యాదు లేఖపై సంతకం చేసినట్లు తెలిసింది. స్నేహపూర్వక విధానాలు, పని సమయంలో వేధింపుల వంటి అంశాలపై సెబీ అధికారులు ఆందోళన వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి. ఇది తమ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిందని లేఖలో తెలిపారు. సెబీ ఉన్నతాధికారులకు గతంలో ఈ విషయంపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు అధికారులు పేర్కొన్నారు. పని సామర్థ్యాన్ని పెంచే పేరుతో మేనేజ్‌మెంట్ వ్యవస్థలను సమూలంగా మార్చేసి తిరోగమన విధానాలను అమల్లోకి తెచ్చిందని చెప్పారు. దాంతో సంస్థకు నష్టం వాటిల్లుతుందన్నారు.
ఈ ఏడాదికి సంబంధించి ‘కీ రిజల్ట్ ఏరియా(కేఆర్‌ఏ)’ లక్ష్యాలను మేనేజ్‌మెంట్ 20-50% పెంచిందని లేఖలో తెలిపారు. డిసెంబర్ నాటికి ఉద్యోగులు ఆ లక్ష్యాలను సాధించాలని అధికారులు ఆదేశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది వాస్తవానికి దరిదాపుల్లో కూడా లేదని, దాంతో ఒత్తిడి, ఆందోళనలు పెరుగుతున్నాయని చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై సెబీ మెయిల్ ద్వారా స్పందించింది. ఉద్యోగులతో ఉన్న సమస్యలను పరిష్కరించినట్లు తెలిపింది. చాలా సంప్రదింపుల తర్వాత కేఆర్‌ఏలను రూపొందించామని కొందరు అధికారులు తెలిపారు. ఉద్యోగులు సమస్యను లేవనెత్తిన తర్వాత అన్ని విభాగాలతో సమీక్షించామన్నారు. కొన్ని డిపార్ట్‌మెంట్‌ల్లో చిన్న సర్దుబాట్లు జరిగాయని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: రూ.1.44 లక్షల కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం
ఇటీవల సింగపూర్, మారిషస్‌లకు చెందిన డొల్ల కంపెనీల ద్వారా మాధబి అదానీ గ్రూప్‌ల్లో పెట్టుబడి పెట్టారని హిండెన్‌బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె 2017 నుంచి 2024 మధ్య ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.12 కోట్లకు పైగా వేతనం తీసుకున్నారని ఇటీవల కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ప్రముఖ సంస్థకు చీఫ్‌గా వ్యవహరిస్తూ వేరే సంస్థ నుంచి వేతనం తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమన్నారు. మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ చీఫ్‌పై ఇలా ఆరోపణలు రావడంపై ట్రేడర్లు, పెట్టుబడిదారుల్లో ఆందోళనలు నెలకొంటున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment