పొద్దున లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు పనుల్ని చక్కబెట్టడంలో స్మార్ట్‌ఫోన్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. స్మార్ట్‌ఫోన్ వల్ల తరచూ ప్రమాదాలు కూడా జరుగుతుండడం చూస్తున్నాం.. వింటున్నాం. మొన్నీమధ్యే ఓ అడ్వొకేట్ గౌన్‌లో ఫోన్ పేలిందన్న వార్త, దీనికి ముందు విమానంలో ఫోన్ పేలిపోవడంతో ఎమర్జెన్సీ ల్యాండ్ కావడం, అంతకు ముందు ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడిన యువతి దుర్మరణం.. ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే ఫోన్ వాడకంలో కొన్ని కనీస జాగ్రత్తలు పాటిస్తే.. ఇలాంటి ఘటనలు నివారించిన వాళ్లం అవుతామంటున్నారు నిపుణులు.
చాలామంది స్క్రీన్ పగిలిన ఫోన్లను అలాగే వాడేస్తుంటారు. రిపేరింగ్‌కు బద్ధకిస్తుంటారు. ఇలా ఫోన్లను ఉపయోగించకపోవడమే మంచిదంటున్నారు టెక్ నిపుణులు. కారణం.. అలా పగిలిన చోటు నుంచి నీరు లేదంటే చెమట ఫోన్ లోపలికి ప్రవేశించే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా బ్యాటరీ, లోపలి భాగాలు పనిచేయకపోవచ్చు. అలాంటప్పుడు ఫోన్‌పై ఒత్తిడి పెరిగి మంటలు చెలరేగి.. పేలిపోయే అవకాశం ఉంది. కాబట్టి, ఫోన్ పాడైన వెంటనే దాన్ని రిపేర్ చేయించాలి. అంతేకాదు స్క్రీన్ గార్డ్‌కు క్రాక్స్ వచ్చినా వెంటనే మార్చేయడం ఉత్తమం. కరోనా వల్ల ఈమధ్య శానిటైజర్‌లను ఫోన్లకు సైతం వాడేస్తున్నారు కొందరు. అయితే ఛార్జింగ్ సాకెట్‌ల ద్వారా లిక్విడ్ లోపలికి వెళ్లి.. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి టిష్యూస్‌తో అదీ జాగ్రత్తగా తుడవడం బెటర్ అని సూచిస్తున్నారు.
డుప్లికేట్ ఛార్జర్లు
ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ.. ఫోన్లలో చాలా వరకూ వీటితోనే నడుస్తున్నాయి. బ్యాటరీలు, ఛార్జింగ్ వైర్లు, అడాప్టర్లను స్పెషల్ టెక్నాలజీతో తయారు చేస్తున్నాయి కంపెనీలు. కాబట్టి, తక్కువ ధరలో దొరికే డుప్లికేట్ ఛార్జర్లు, బ్యాటరీలు ఉపయోగించకపోవడం ఉత్తమం. ఇక ఇతరుల ఫోన్‌ల ఛార్జర్‌లను(వేరే కంపెనీలవి) సైతం అత్యవసర సమయంలోనే ఉపయోగించాలని నిపుణులు చెప్తున్నారు. డుప్లికేట్ ఛార్జర్లను ఉపయోగించడం వల్ల ఫోన్ బ్యాటరీ వేడెక్కి ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు. అందుకే ఫోన్‌లో బ్యాటరీ ఛేంజ్ చేసేప్పుడు కంపెనీ సూచించిన బ్యాటరీనే ఉపయోగించడం మేలు.
ఇలా చేయకపోవడం బెటర్
► సూర్యరశ్మి తగిలే చోటులో ఫోన్ వేడెక్కడం సహజం. అలా సూర్యరశ్మి పడే చోట ఛార్జింగ్ పెట్టడం మంచిది కాదు.
► ఫోన్‌పై అదనంగా ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఛార్జ్ చేసేప్పుడు ఫోన్‌పై ఎలాంటి వస్తువులు ఉంచకపోవడం ఉత్తమం.
► ఛార్జింగ్ టైంలో ఫోన్ వేడెక్కుతున్నట్లు గమనిస్తే వెంటనే అన్‌ఫ్లగ్ చేయాలి.
► వర్షాలు పడుతున్న టైంలో ఛార్జింగ్ పెట్టి ఫోన్‌లు ఉపయోగించడం అస్సలు మంచిది కాదు.
► ఫోన్ వేడెక్కినట్లు అనిపిస్తే.. సర్వీస్ సెంటర్ తీసుకెళ్లి చెక్ చేయించాలి.
► వంద శాతం ఛార్జింగ్.. చాలామందికి ఇదొక ఆనందం. కొన్నిసార్లు రాత్రంతా ఛార్జింగ్ పెట్టి అలానే వదిలేస్తారు. అలాంటప్పుడు వేడెక్కి పేలిపోవచ్చు.
వెహికిల్స్‌లో ఛార్జింగ్ పెట్టేందుకు ఉపయోగించే పవర్ కేబుల్స్, పవర్ బ్యాంక్‌లను.. ఇంట్లో పవర్ ప్లగ్ నుంచి ఫోన్‌ని ఛార్జ్ చేసేందుకు ఉపయోగిస్తుంటారు. కానీ, పవర్ సప్లైలో తేడా ఉంటుందనే విషయం, ఆ కేబుల్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. వాటితో ఫోన్‌లు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని గుర్తించాలి. వీటితో పాటు కాస్ట్‌లీ ఫోన్‌లలో సమస్య తలెత్తినప్పుడు ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌లలో రిపేర్ చేయించడం బెటర్. పైగా ఫోన్‌లో కంపెనీ యాక్ససరీలు కాకుండా థర్డ్ పార్టీ యాక్ససరీలు ఉపయోగించడం వల్ల ఫోన్‌పై ఒత్తిడి పెరిగి ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు. టెక్నికల్ లోటుపాట్లను పక్కనపెడితే.. మన చేతుల్లో ఉన్న జాగ్రత్తల్ని పాటించడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను నివారించొచ్చనే చెప్తున్నారు టెక్ ఎక్స్‌పర్ట్స్.
- సాక్షి, వెబ్‌స్పెషల్
Comments
Please login to add a commentAdd a comment