
కరోనా రాకతో పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోంకే పరిమితమైన ఉద్యోగులు ఈ బడ్జెట్‌లో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2022లో ‘వర్క్‌ఫ్రమ్ హోం’కు నిరాశే ఎదురైంది. క్రిప్టో కరెన్సీపై బడ్జెట్‌లో ప్రకటనను ఎవరూ ఊహించకపోగా.. ఊహించిన వర్క్‌ఫ్రమ్ హోం లాంటి అంశంపై కేంద్రం నుంచి ప్రకటన రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
కరోనా మహమ్మారి రాకతో.. కంపెనీలన్ని వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. తద్వారా ఆయా కంపెనీలకు అయ్యే ఖర్చు అమాంతం తగ్గింది. కంపెనీలు ఆయా ఖర్చులను తగ్గించుకున్నా.. ఎక్కువ శాతం ఆ భారం పూర్తిగా ఉద్యోగుల మీద పడుతోంది. దీనికి తగ్గట్టుగా ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించాలనే డిమాండ్‌లు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఇవి దృష్టిలో ఉంచుకోని బడ్జెట్-2022లో కేంద్రం ఊరట ఇస్తుందని అంతా భావించారు. పైగా స్టాండర్డ్ డిడక్షన్, వర్క్‌ఫ్రమ్ హోం అలవెన్స్ విషయంలో స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో ఉద్యోగులకు నిరాశే ఎదురైంది.
స్టాండర్డ్ డిడక్షన్.. తుస్?
2018లోనే ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్‌ను మళ్లీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అనేక మంది ఉద్యోగులు స్టాండర్డ్ డిడక‌్షన్‌ని ఎంచుకున్నారు. ప్రస్తుత స్టాండర్డ్ డిడక్షన్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ అలవెన్స్‌ను కవర్ చేసేందుకు ఎలాంటి అవకాశం లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారి కోసం ప్రస్తుత స్టాండర్డ్ డిడక్షన్ పరిమితినైనా పెంచాల్సి ఉంది. లేదంటే కొత్తగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఖర్చుల కోసం కొత్త డిడక్షన్‌నైనా ప్రవేశపెట్టాల్సి ఉంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 16 కింద ప్రస్తుతం ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50వేల నుండి రూ.1 లక్షకు పెంచాలని కోరగా.. కేంద్రం నుంచి సానుకూల స్పందన కరువ కావడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు.
వర్క్ ఫ్రమ్ హోమ్ అలవెన్స్.. సైలెంట్
వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు అలవెన్స్ అందించాలని ప్రభుత్వాన్ని పరిశ్రమల సంస్థ నాస్కామ్ సహా డెలాయిట్ ఇండియా ప్రీ-బడ్జెట్ ఎక్స్‌పెక్టేషన్ 2022 నివేదికలో బలంగానే కేంద్రాన్ని కోరాయి. పనిలో పనిగా ఉద్యోగుల కోసం ‘‘వర్క్ ఫ్రమ్ హోమ్’’ ఖర్చులపై మరిన్ని తగ్గింపులను సూచించాయి. అంటే.. ఉద్యోగులకు అదనంగా రూ. 50,000 WFH భత్యాన్ని సిఫార్సు చేయగా.. బడ్జెట్‌లో అసలు ఆ ఊసే లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. శాలరీ స్ట్రక్చర్’ని ఓ కొలిక్కి తీసుకొచ్చినట్లు ప్రకటించుకున్న కేంద్రం.. ‘తక్కువ ఇంటి అద్దె భత్యం నుంచి కొత్త తగ్గింపుల వరకు’.. కొన్ని ప్రతిపాదనలపై కంపెనీల ప్రతినిధుల మధ్య వరుసబెట్టి చర్చలు నడిపించింది. పైగా కొత్త వర్క్ మోడల్‌కు లీగల్ ఫ్రేమ్‌వర్క్ అంటూ గప్పాల ప్రకటనలు ఇచ్చిన కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ.. ఈ దిశగా ఆర్థిక శాఖపై ఒత్తిడి తేలేకపోయిందనే విమర్శ వినిపిస్తోంది ఇప్పుడు.
Comments
Please login to add a commentAdd a comment