అదానీ గ్రూప్ స్టాక్స్‌పై షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికతో గతేడాది ఇన్వెస్టర్లలో ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. దాంతో పెద్దమొత్తంలో స్టాక్ ధరలు తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. ఆ నివేదిక వెలువడినప్పటి నుంచి ఇన్వెస్టర్ల సంపద భారీగా పతనమైంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అదానీ గ్రూప్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని అదానీ ఇటీవల తెలిపారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో అదానీ మాట్లాడుతూ హిండెన్‌బర్గ్ వ్యవహారాన్ని ఎలా కట్టడిచేశామో తెలిపారు.
‘హిండెన్‌బర్గ్ ఆరోపణలను వచ్చాక తొలుత వాటికి ప్రాధాన్యం ఇవ్వలేదు. పూర్తిగా పాత సమాచారాన్నే ఆ సంస్థ కొత్త రూపంలో పేర్కొంది. ఆ వివాదం వెంటనే తొలగిపోతుందనుకున్నాను. ప్రపంచంలో ఓ కార్పొరేట్ కంపెనీపై జరిగిన అతిపెద్ద దాడి అది. సాధారణంగా షార్ట్‌సెల్లర్లు చేసే దాడులకు వ్యాపార కోణమే ఉంటుంది. కానీ, మాపై జరిగినది కేవలం ఫైనాన్షియల్ మార్కెట్లకే పరిమితం కాలేదు.. రాజకీయ కోణం కూడా సంతరించుకుంది. చాలా సమన్వయంతో మమ్మల్ని దెబ్బకొట్టాలనుకున్నారు. చాలా తొందరగానే హిండెన్‌బర్గ్ కుట్రను అర్థం చేసుకున్నాను. గతంలో ఈ స్థాయి సంక్షోభాన్ని ఎదుర్కొన్న అనుభవం లేదు. దాంతో మా సొంత ప్లాన్ సిద్ధం చేసుకున్నాం.
ఇందులో భాగంగా రూ.20 వేల కోట్లు విలువైన ఎఫ్‌పీవోను వెనక్కి తీసుకొన్నాం. రూ.75,000 కోట్ల నగదు, రూ.17,500 కోట్ల ప్రీపెయిడ్ మార్జిన్ లింక్డ్ ఫైనాన్సింగ్‌తో నిధి ఏర్పాటు చేశాం. సీఈవోలు, ఎగ్జిక్యూటివ్‌లను వ్యాపారంపై శ్రద్ధ పెట్టాలని సూచించాం. ఖావ్డ, ధారావి వంటి కొత్త ప్రాజెక్టుల రూపంలో వ్యాపార విస్తరణను కొనసాగించాం. వార్‌రూమ్ ఏర్పాటు చేశాం. దాంతో ఇన్వెస్టర్లకు ఎదురైన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాం.
ఇదీ చదవండి: మానవ మెదడుతో ఏదీ సరితూగదు.. ఏఐని తలదన్నే ఉద్యోగాలివే..
ఈ వ్యవహారం నుంచి ఓ విషయం నేర్చుకొన్నాం. మంచి పనిచేయడమే కాదు.. మన గురించి అందరికీ తెలియాలి. కమ్యూనికేషన్ మరింత పెంచుకోవాలి. హిండెన్‌బర్గ్ వ్యవహారం మొత్తంలో చిన్న వాటాదారులు దెబ్బతినడమే నన్ను బాధించింది. మా కంపెనీలు తిరిగి పుంజుకొన్నాక హిండెన్‌బర్గ్ నివేదికలో నిజం లేదని తేలింది’ అని గౌతమ్ అదానీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment