న్యాయం చేయాలని.. భర్త ఇంటి ఎదుట ధర్నా
గంగవరం : వారిద్దరూ ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు.. ఒకరికొకరు ఇష్టపడ్డారు.. కులాంతర వివా హం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నా ఆరు మాసాలకే కట్టుకున్న భార్యను వంచించి వదిలేసి.. వెళ్లిపోయాడు.. దీంతో భర్త రాక కోసం నెల రోజులు పాటు ఆమె నిరీక్షించింది.. చేసేది లేక గంగవరం గ్రామంలోని తన భర్త ఇంటి ముందు గురువారం తనకు న్యాయం చేయాలంటూ ఆమె ధర్నాకు దిగింది. బాధితురాలు కథనం మేరకు మబ్బువారిపేట గ్రామానికి చెందిన నాగరాజు కుమార్తె రమ్య, గంగవరం గ్రామానికి చెందిన భరత్ ఇద్దరూ కలిసి ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే ఇద్దరూ కలిసి జీవితంలో స్థిరపడ్డాక వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. భరత్ అందుకు ఒప్పుకోకుండా ఇంట్లో అతడికి సంబంధాలు చూస్తున్నారని, వెంటనే పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానంటూ ఆమెని మభ్యపెట్టడంతో ఇద్దరూ కలిసి వివాహం చేసుకున్నారు. అలా జరిగిన వారి వివాహం జీవితం ఆరు మాసాలకే పఠాపంచలైంది. వివాహం అనంతరం ఇద్దరూ తిరుపతి, ముళబాగిల్ ప్రాంతాల్లో కాపురం పెట్టారు. అతడికి ఎలాంటి పని లేకపోవడంతో ఆమె మెడికల్ షాపులో పనిచేస్తూ భర్తను పోషించేది. అంతలో భరత్ కుటుంబీకుల నుంచి ఒత్తిడి రావడంతో కొన్ని నెలల తరువాత ఇద్దరూ కలిసి గంగవరానికి రాగానే ఆమైపె దాడికి పాల్పడ్డారంటూ ఆమె పేర్కొంది. నీ సామాజిక వర్గం తక్కువదని.. మా బిడ్డను ఎలా పెళ్లి చేసుకుంటావంటూ భర్త కుటుంబీకులు ఆమెను చిత్రహింసలకు గురి చేశారంటూ ఆరోపించింది. అప్పట్లో ఆమె పోలీసులను ఆశ్రయించగా ఇరువురూ కలిసి స్టేషన్‌లో రాజీ కుదుర్చుకున్నారు. ఆ తరువాత ఇద్దరూ కలిసి ముళబాగిల్‌లో నివాసం ఉండేవాళ్లు. కొన్ని రోజులు తరువాత మళ్లీ తన భర్త కుటుంబీకుల నుంచి ఫోన్‌కాల్స్ రావడంతో ఉన్నట్టుండి ఆమెను అక్కడే విడిచి ఎక్కడికో వెళ్లిపోయాడంటూ ఆమె ఆరోపించింది. అక్క డ దాదాపు 20 రోజులు ఒంటరిగా గడిపి తిరిగీ ఆమె పుట్టింటికి చేరింది. ఎన్నిసార్లు తన భర్తకు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో తనకు న్యాయం కోసం గంగవరంలోని తన భర్త ఇంటి ముందు కుటుంబంతో సహా ధర్నాకు దిగింది. తన భర్త వచ్చే వరకూ ఎన్నాళ్లు అయినా అక్కడే నిరీక్షిస్తానంటూ ఆమె తెలిపింది. స్పందించిన పోలీసులు ధర్నా చేస్తున్న ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఇద్దరినీ కలుపుతామంటూ పోలీసులు హామీ ఇచ్చారు. తన భర్త కుటుంబీకుల నుంచి తనకు ప్రాణహాని ఉందని తనకు న్యాయం చేయాలంటూ ఆమె పోలీసులను కోరింది.
● మోసగించాడని భార్య ఆందోళన