గ్రానైట్‌.. రైట్‌ రైట్‌ | - | Sakshi

గ్రానైట్‌.. రైట్‌ రైట్‌

Apr 2 2025 1:46 AM | Updated on Apr 2 2025 1:48 AM

కుప్పం.. గ్రానైట్‌ నిక్షేపాల గని .. రెండు రాష్ట్రాల సరిహద్దు నియోజకవర్గం..ఆపై సీఎం ప్రాతినిథ్యం.. అడిగేవారేరీ.. అడ్డుకునే నాథుడేరి.. ఇది కూటమి నేతల ధైర్యం.. ఇంకేముంది..? గ్రానైట్‌ పర్మిట్లు లేకుండా రాత్రి వేళల్లో యథేచ్ఛగా సరిహద్దులు దాటుతున్న వైనం.. ఫలితం కరుగుతున్న ప్రకృతి సంపద.. ప్రభుత్వ రాబడికి భారీ గండి. దీనికి అడ్డుకట్ట పడేనా? అన్నది శేష ప్రశ్న.

కుప్పంరూరల్‌: సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో గ్రానైట్‌ అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఒక పర్మిట్‌ మీద నాలుగైదు దిమ్మెలు తరలిస్తూ అక్రమార్కులు విజయం సాధిస్తున్నారు. కనులుగప్పి రాత్రిపూట దొడ్డిదారుల్లో గ్రానైట్‌ దిమ్మెలను ఎల్లలు దాటిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ అక్రమ రవాణాకు అడ్డూ అదుపులేకపోతోంది. అడ్డుకోవాల్సిన అధికారులు సీఎం నియోజక వర్గం కావడంతో ఎక్కడ కూటమి నేతల నుంచి ఒత్తిళ్లు వస్తాయోనని వెనుకడుగు వేస్తున్నారు. దీంతో గ్రానైట్‌ అక్రమ రవాణా మూడు పువ్వులు..ఆరు కాయలుగా సాగుతోంది.

ఎల్లలు దాటుతున్న విలువైన గ్రానైట్‌

కుప్పం నియోజకవర్గంలో ప్రపంచ ప్రఖ్యాత గాంచిన గ్రానైట్‌ నిక్షేపాలున్నాయి. నియోజకవర్గం లో వంద వరకు క్వారీలు నిర్వహిస్తున్నారు. మరో 20 వరకు అక్రమ గ్రానైట్‌ క్వారీలు నడుస్తున్నాయి. క్వారీల నుంచి తొలగించి రాతి దిమ్మెలను తమిళనాడులోని తిరుపత్తూరు, జగదేవి, హొసూరు, చైన్నెలోని ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. నాణ్యమైనవి విదేశాలకు వెళుతున్నాయి. ఈ క్రమంలో రాతి దిమ్మెలు తరలించేందుకు భూగర్భగనుల శాఖ నుంచి పర్మిట్లు పొందాల్సి ఉంది. పర్మిట్లు ఖర్చుతో కూడుకున్న విషయం కావడంతో అక్రమార్కులు ఒక పర్మిట్‌ తీసుకుని దానిపై నాలుగైదు రాతి దిమ్మెలు రవాణా చేస్తున్నారన్నది సత్యం. అసలైన పర్మిట్లు ఉన్న లారీలను పగటి పూట జాతీయ రహదారిపై రవాణా చేస్తారు. నకిలీ పర్మిట్లు వేసుకున్న దిమ్మెలను రాత్రిపూట దొడ్డిదారుల్లో రాష్ట్రం హద్దులు దాటిస్తున్నారు. కుప్పం నియోజక వర్గం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దులో ఉండి, పదుల సంఖ్యలో గమ్యాలు చేరుకునే మార్గాలు ఉండడం అక్రమార్కులకు కలిసి వస్తోంది. దీంతో రాత్రి పూట నిలకడ లేకుండా రోడ్లపై గ్రానైట్‌ లారీలు పరుగులు తీస్తున్నాయి.

అధికారుల వెనుకడుగు

కుప్పం ముఖ్యమంత్రి నియోజక వర్గం కావడంతో అక్రమార్కులపై చర్యలు తీసుకుంటే ఏ వైపు నుంచి ఏరకమైన ఉపద్రవం వచ్చి పడుతుందోనని అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. కారణం అక్రమార్కుల వెనుక కూటమి నేతలు ఉండడమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అక్రమ రవాణాకు అడ్డుకట్ట ఎప్పుడో?

విలువైన గ్రానైట్‌ అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడేదెప్పుడోనని కుప్పం ప్రజలు ప్రభుత్వా న్ని, అధికారులను ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అక్రమ గ్రానైట్‌ క్వారీలను పరిశీలించి నిరోధించాలని ట్రిబ్యునల్‌కు వెళ్లారు. అలాంటే వ్యక్తే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నా.. గ్రానైట్‌ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఆయనే చొరవ తీసుకుని అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని జనం కోరుతున్నారు. అక్రమ రవాణా వెనుక తమ నేతలే అధికంగా ఉండడంతో చంద్రబాబు అడ్డుకట్ట వేయడం అనేది ప్రశ్నార్థకమే?నని పర్యావరణ ప్రియు లు అంటున్నారు.

పర్మిట్లు లేకనే తరలింపు ఒక్క పర్మిట్‌తో నాలుగైదు దిమ్మెల తరలింపు

రాత్రిపూట తరలింపులో ఆంతర్యం ఏమిటి?

కూటమి హయాంలో పెరిగిన అక్రమ రవాణా

ఛిద్రమవుతున్న రోడ్లు

గ్రానైట్‌ లారీల రాకపోకలతో గ్రామీణ రోడ్లు ఛిద్రమవుతున్నాయి. వసనాడు, గుడ్లనాయనపల్లి, పరమసముద్రం, పొగురుపల్లి, సంగనపల్లి గ్రామాలకు ఉన్న రోడ్లు గ్రానైట్‌ లారీలు రాకపోకలు సాగించి, గుంతలుగా మారుతోంది. అంతే కాకుండా రాత్రి పూట వేగంగా శబ్దాలు చేస్తూ భారీ లారీ రాకపోకలు సాగిస్తుండడంతో రాత్రుల్లో నిద్రపట్టడం లేదని గ్రామీణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గ్రానైట్‌.. రైట్‌ రైట్‌1
1/2

గ్రానైట్‌.. రైట్‌ రైట్‌

గ్రానైట్‌.. రైట్‌ రైట్‌2
2/2

గ్రానైట్‌.. రైట్‌ రైట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement