
పరిస్థితి విషమించడంతో విజయవాడ తరలింపు
వీఆర్వోగా పనిచేస్తున్న బాధితురాలు
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చిట్టేల గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావుపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆగడాలతో తీవ్ర మనస్తాపం చెందిన సర్పంచ్ భార్య కవిత ఆత్మహత్యకు యత్నించారు.
ఎమ్మెల్యే అతనిని బహిరంగంగా దూషించడమే కాక బుధవారం చిట్టేల వెళ్లి దాడికి యత్నించడంతో ఆమె కలతచెంది నిద్రమాత్రలు మింగారు. ఆపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను తిరువూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి హుటాహుటిన విజయవాడ తరలించారు. కవిత కోకిలంపాడు వీఆర్వోగా పనిచేస్తున్నారు.
ఎమ్మెల్యే వేధింపులతోనే ఆత్మహత్యాయత్నం
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తనను చంపడానికి యత్నిస్తుండడంతో భయపడి తన భార్య కవిత ఆత్మహత్యా యత్నం చేసుకున్నట్లు తుమ్మలపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. తిరువూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులతో తప్పుడు కేసులు బనాయించి తనను అరెస్టు చేయించడమేకాక చిట్టేల వాగు నుంచి ఇసుక తోలకాలను తాను అడ్డుకుంటున్నానని ఆరోపిస్తూ అంతమొందిస్తానని బెదిరించారని చెప్పారు.
తిరువూరు మెయిన్‌రోడ్డులో బహిరంగంగా తనను అసభ్య పదజాలంతో తిట్టడమే కాక ఆయన అనుచరులను రెచ్చగొట్టి తనపైకి ఉసిగొల్పుతున్నాడని సర్పంచ్ వివరించారు. చిట్టేలలో బుధవారం 20 మంది అనుచరులతో వచ్చిన ఎమ్మెల్యే పొలానికి వెళ్తున్న తనను అంతమొందించడానికి ప్రయత్నించారని, ఆయన దురుసు ప్రవర్తన, దౌర్జన్యంతో ఆందోళనకు గురైన తన భార్య కవిత నిద్రమాత్రలు మింగిందని ఆవేదన వ్యక్తంచేశారు.
గ్రామస్తుల ఆందోళన..
ఈ ఘటన నేపథ్యంలో చిట్టేల గ్రామస్తులు బుధవారం తిరువూరులో ఆందోళనకు దిగారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించారు. కవితను మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సుధారాణి çకూడా పరామర్శించిఅండగా ఉంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment