మాట వినకుంటే బెల్డ్ తీస్తాం | - | Sakshi
Sakshi News home page

మాట వినకుంటే బెల్డ్ తీస్తాం

Published Sun, Oct 20 2024 3:10 AM | Last Updated on Sun, Oct 20 2024 6:53 PM

శ్యామలానగప్ రామలయం సెంటర్ వద్ద మద్యం దుకాణం

శ్యామలానగప్ రామలయం సెంటర్ వద్ద మద్యం దుకాణం

మద్యం, బెల్ట్‌ షాపుల ఏర్పాటు

నిర్ణయం కూటమి నేతలదే

సిండికేట్‌ చేసేందుకు యత్నాలు

ఫుల్‌గా తాగించందుకు నిర్ణయాలు

సాక్షి, అమలాపురం: మద్యం ముంగిటకే తెస్తున్నారు.. వీధివీధినా బెల్టు షాపుల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు.. దీనికి సరిహద్దులూ నిర్ణయిస్తున్నారు.. ఇప్పటికే మద్యం దుకాణాలు ఎక్కడ ఏర్పాటు చేయాలి? వీటి పరిధిలో బెల్టు షాపులు ఎక్కడ పెట్టాలో అనే అంశాలపై కూటమి చెందిన కొందరు నేతలు హుకుం జారీ చేశారు. సిండికేట్‌ నిర్ణయించిన ‘హద్దులు’ దాటితే ‘బెల్టు’ తీస్తామని హెచ్చరికలు చేస్తున్నారు. జిల్లాలో కొత్త మద్యం పాలసీ ప్రకారం 133 మద్యం దుకాణాలను కేటాయించారు. పలుచోట్ల దుకాణాలు తెరిచి మద్యం విక్రయాలు జరుపుతున్నారు. మద్యం దుకాణాలు పూర్తి స్థాయిలో తెరిచేందుకు మరో రెండు, మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.

సిండికేట్‌పై స్పష్టత లేకపోవడంతో పలుచోట్ల ఆలస్యమవుతుంది. ఈసారి ప్రభుత్వం మద్యం దుకాణాలకు మున్సిపాలిటీ, మండలాల యూనిట్‌గా దరఖాస్తులు కోరిన విషయం తెలిసిందే. దీనివల్ల మద్యం వ్యాపారుల మధ్య సరిహద్దు సమస్యలు వస్తున్నాయి. ఉదాహరణకు అంబాజీపేట మండలంలో మొత్తం ఐదు మద్యం దుకాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంబాజీపేట బస్టాండ్‌, మెయిన్‌ రోడ్డు ఇలా కిలోమీటర్‌ పరిధిలోనే మూడు దుకాణాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ సిండికేట్‌పై చర్చలు జరుగుతున్నాయి. ఇంతలోనే పాత సిండికేట్‌దారులు తమ చుట్టూ ఉన్న బెల్టు షాపులతో మాట్లాడుకుని వ్యాపారం ప్రారంభించడంతో మిగిలిన వ్యాపారులు మండిపడుతున్నారు. దీంతో టీడీపీలో కీలక నేతలు రంగప్రవేశం చేసి వ్యాపారులను సిండికేట్‌ చేసేపనిలో పడ్డారు. అంబాజీపేటలోనే కాదు.. జిల్లాలో పలుచోట్ల ఇదే పరిస్థితి ఉంది.

వారి కనుసన్నల్లోనే..

జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధులు, వారి సోదరులు, ముఖ్య అనుచరులు, పాత మద్యం మాఫియా కనుసన్నల్లోనే దుకాణాల సరిహద్దులు నిర్ణయిస్తున్నారు. ఉన్నత వర్గాల నుంచి ఆదేశాలు రావడంతో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారులు వీరికి వంత పాడుతున్నారు. దుకాణాల ఏర్పాటు వాటి పరిధిలో బెల్టు షాపుల నిర్ణయం వీరి కనుసన్నల్లో జరుగుతోంది. టీడీపీ మద్యం సిండికేట్‌ ఎంత బలంగా ఉందంటే జిల్లాలో జనసేన ఎమ్మెల్యేలు ఉన్న పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో సైతం వీరి హవా సాగిస్తున్నారు. కొత్తగా బెల్టు షాపులను కూడా తెరిపిస్తున్నారు. గతంలో కంటే ఈసారి బెల్టు షాపులు రెట్టింపు కానున్నాయని అంచనా. మద్యం దుకాణాలకు చేసిన దరఖాస్తులకు భారీగా చేతి చమురు వదలడం, ఎకై ్సజ్‌ ట్యాక్స్‌ అధికంగా ఉండడంతో బెల్టు అమ్మకాలపై అధికంగా ఆశలు పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా బెల్ట్‌ దుకాణాలను పెద్ద ఎత్తున తెరుస్తున్నారు. టీడీపీ కీలక నేతలు మద్యం అమ్మకాలు అధికంగా జరిగే బెల్టు షాపులను తమ వద్దనే ఉంచుకోవడం గమనార్హం.

ఎక్కడెక్కడ ఎలా అంటే..

అమలాపురం నియోజకవర్గంలో మొత్తం 18 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 200 వరకు బెల్ట్‌ షాపులు వచ్చే అవకాశముంది. ఇప్పటి వరకూ కేవలం 28 బెల్ట్‌షాపులు తెలిచారు. మద్యం షాపుల మధ్య సరిహద్దులను నిర్ణయించి, తరువాత బెల్టుపై దృష్టి సారించనున్నారు. టీడీపీలో మద్యం వ్యాపారులు సిండికేట్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తమ పార్టీకి చెందని వారిని సైతం సిండికేట్‌లోకి ఆహ్వానిస్తున్నారు. అల్లవరం, ఉప్పలగుప్తం మండలాల్లో దుకాణాల ఏర్పాటుపై తుది చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ మద్యం దుకాణాల కన్నా బెల్టు షాపులు పొందడంపైనే అందరూ దృష్టిసారించారు. ఎస్‌.యానాం, ఎన్‌.కొత్తపల్లి వంటి ప్రాంతాల్లో బెల్టుషాపులపై కీలక నేతలు దృష్టి సారించారంటే ఇక్కడ బెల్ట్‌ అమ్మకాలు ఏ స్థాయిలో జరుగుతాయో అర్థం చేసుకోవచ్చు.

మండపేట నియోజకవర్గంలో మద్యం దుకాణాలు ఇప్పటి వరకూ పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. సిండికేట్‌ ఏర్పాటుపై చర్చలు నడుస్తున్నాయి. ఇవి పూర్తయితేనే బెల్టు షాపులపై ఒక అంచనాకు వచ్చే అవకాశముంది.

కొత్తపేట నియోజకవర్గంలో మొత్తం 25 షాపులు ఉన్నాయి. వీటి పరిధిలో కనీసం 150కి పైగా బెల్ట్‌ షాపులు వస్తాయని అంచనా. ఇప్పటికే నిర్వహిస్తున్న బెల్ట్‌ షాపులను కొనసాగించడంతో పాటు టీడీపీ అనుకూలంగా ఉండే వారితో కొత్తగా బెల్టు షాపుల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు.

రామచంద్రపురం నియోజకవర్గంలో వెల్ల గ్రామంతో బెల్ట్‌ షాపు బోణీ అయ్యింది. ఇక్కడ ఆరు దుకాణాలకు వేలం జరగగా, మూడు చోట్ల మాత్రమే కొత్తగా ప్రారంభించారు. దుకాణాలు పూర్తిగా తెరిస్తే బెల్టుషాపులు మొదలవుతాయని అంచనా.

పి.గన్నవరం నియోజకవర్గంలో దుకాణాల ఏర్పాటు ప్రాంతాలపైనే ఇంకా స్పష్టత రాలేదు. దుకాణాలను పంచుకున్న తరువాతనే బెల్టుషాపులపై స్పష్టత రానుంది. టీడీపీ సిండికేట్‌తోపాటు గత ఎన్నికల్లో భారీగా ఎన్నికల ఫండ్‌ ఇచ్చిన ఒక వ్యక్తి ఆధ్వర్యంలో ఏర్పడిన సిండికేట్‌దారులు సైతం తమ హవా కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలోని తీరంలో ఉండే బెల్టుషాపుల్లో లూజు సేల్స్‌ అధికం. కాని బెల్టుపై స్థానిక మత్స్యకార పెత్తందారుల నిర్ణయమే అంతిమం. వీటి ద్వారా పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు జరిగే అవకాశమున్నందున వీరితో స్థానిక నేత సోదరుడు చర్చలు జరుపుతున్నారు. ఐ.పోలవరం మండలంలో ఇప్పటికే బెల్టు అమ్మకాలు మొదలయ్యాయి. స్థానికంగా ఉన్న టీడీపీ నేత సోదరుడు ఆధ్వర్యంలో ఇక్కడ సిండికేట్‌ నడుస్తోంది.

రాజోలులో దుకాణాల సరిహద్దులు తేలడం లేదు. ఇవి కొలిక్కి వచ్చిన తరువాతే బెల్టు షాపుల ఏర్పాటుపై ఒక అవగాహనకు రానున్నారు. కూటమి ప్రభుత్వం మద్యం విధానం ఆయా పార్టీల నాయకులకు కల్పతరువుగా మారనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement