ప్రకృతీ వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న వరిచేను (పాత చిత్రం)
ఉచిత పంటల బీమాను నిలిపివేసిన కూటమి ప్రభుత్వం
అన్నదాతలపై ప్రీమియం పిడుగు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతులకు ఉచిత బీమా
ఆలమూరు: అందరికీ పట్టెడన్నం పెట్టే రైతులను దేశానికి వెన్నెముక అని భావిస్తారు. వారి సంక్షేమానికి ఎన్ని చర్యలు తీసుకుంటే దేశం అంత అభివృద్ధి చెందుతుంది. కానీ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులపై పగ సాధిస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని నిలిపి వేసింది. బీమా కోసం తప్పనిసరిగా ప్రీమియం కట్టాలనే నిబంధన తీసుకువచ్చింది. కూటమి ప్రభుత్వంపై గంపెడాశలు పెట్టుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉచిత పంటల బీమా రద్దుతో ప్రతి సీజన్‌లో ఎకరాకు ప్రీమియంగా రూ.615 చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. గత ప్రభుత్వం విత్తు దశ నుంచి పంట చేతికి వచ్చే వరకూ అండగా ఉన్న సంగతిని ఇప్పుడు అన్నదాతలు గుర్తు చేసుకుంటున్నారు.
రైతుల అవస్థలు
అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాది రూ.20 వేలు సాయం అందిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం దాని అమలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి రైతులు వరిసాగు చేపట్టారు. ఇప్పుడు కొత్తగా వారిపై బీమా ప్రీమియం పేరుతో అదనపు భారాన్ని మోపేందుకు కూటమి సిద్ధమైంది. జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో సుమారు 1.68 లక్షల ఎకరాల్లో 1.16 లక్షల మంది రైతులు వరిసాగు చేస్తున్నారు.
నష్టపరిహారం
పంటసాగు కోసం బ్యాంకు లేదా సొసైటీ నుంచి రుణాలు తీసుకున్న రైతులకు సంబంధిత సంస్థలే బీమా సొమ్మును చెల్లిస్తాయి. తర్వాత రైతుల నుంచి వసూలు చేస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బ్యాంకుల ద్వారా బీమా చేయించుకున్న రైతులకు పరిహారం అందుతుంది. రుణాలు తీసుకోలేని రైతులు, కౌలు రైతులకు మాత్రం బీమా సౌకర్యం ఉండదు. ఈ సమస్య పరిష్కారానికి ఆనాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉచిత పంటల బీమాను చేయాలని సంకల్పించి, ఆ దిశగా చర్యలు తీసుకుంది. క్షేత్రస్థాయిలో ఈ– క్రాప్ చేయించుకున్న ప్రతి రైతుకు ఉచిత పంటల బీమాను అమలు చేసింది. దీంతో చిన్న, సన్నకారు రైతులు బీమా చేయించుకోలేకపోయినా పంటలు దెబ్బతిన్నప్పుడు నష్టపరిహారం అందేది.ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమాను రద్దు చేయడంతో రైతులపై భారం పడింది. రానున్న రబీ సీజన్‌కు గాను డిసెంబరు 15 నాటికి పంటల బీమా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్‌సీ), గ్రామ సచివాలయాల్లో రైతులు తమ ప్రీమియం చెల్లించవచ్చని వ్యవసాయశాఖ సూచించింది.
అన్నదాతల ఆవేదన
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కూటమి సర్కారు నిలిపివేయడంతో అన్నదాతల్లో ఆందోళన ప్రారంభమైంది. వచ్చే రబీ సీజన్ నుంచి రైతులే ప్రీమియం చెల్లించుకోవాలని కూటమి ప్రభుత్వం స్పష్టం చేయడంతో కలవరం మొదలైంది. ఎకరాకు రైతు ప్రీమియం వాటాగా రూ.630 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా జిల్లా రైతాంగంపై రూ.104.32 కోట్లు భారం పడనుంది.
రైతులకు అండగా వైఎస్సార్ సీపీ
వర్షాలు, వరదలతో పంటకు నష్టం వాటిల్లినప్పుడు రైతులను ఆదుకునేందుకు దోహదపడుతుందనే ఉద్దేశంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ ఉచిత పంటల బీమాను ప్రవేశపెట్టారు. రైతులపై ప్రీమియం భారం పడకుండా 2019 జూలైలో ఖరీఫ్ సీజన్ నుంచి నుంచి ఉచిత పంటల బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ – క్రాప్ నమోదు ప్రామాణికంగా సాగు విస్తీర్ణం అంతటికి రైతులు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించేలా చూశారు. దీనివల్ల పంటల బీమా కోసం రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కాదు. వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద నిర్ణీత సమయానికి రైతుల ఖాతాల్లో రూ.13,500 జమ అయ్యేది. ఏటా 1.15 లక్షల చొప్పున జిల్లాలోని దాదాపు ఎనిమిది లక్షల మంది రైతుల తరఫున ప్రీమియం రూపంలో ప్రభుత్వం బీమా కంపెనీలకు ఐదేళ్లలో దాదాపు రూ.150 కోట్లు చెల్లించింది. అలాగే పంట నష్టపోయిన లక్షల మంది రైతులకు ఐదేళ్ల కాలంలో రూ.284.19 కోట్లు పరిహారం అందించింది.
రైతులే చెల్లించాలి
రాబోయే రబీ సీజన్ నుంచి పంటల బీమా ప్రీమియాన్ని రైతులే స్వచ్ఛందంగా చెల్లించాలి. వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించి రైతులు దీనిపై అవగాహన పెంచుకోవాలి. రబీసాగులోని పంటల బీమాపై విధి విధానాలు పూర్తిగా ఖరారు కాలేదు.
– ఓలేటి బోసుబాబు, జిల్లా వ్యవసాయాధికారి, అమలాపురం
Comments
Please login to add a commentAdd a comment