దీవెనపై దాష్టీకం | - | Sakshi
Sakshi News home page

దీవెనపై దాష్టీకం

Published Wed, Nov 6 2024 12:07 AM | Last Updated on Wed, Nov 6 2024 2:01 PM

రీయంబర్స్‌మెంట్‌పై స్పష్టతివ్వని ప్రభుత్వం

రీయంబర్స్‌మెంట్‌పై స్పష్టతివ్వని ప్రభుత్వం

ఇంజినీరింగ్‌, డిగ్రీ కళాశాలల చర్యలతో విద్యార్థులలో ఆందోళన

త్వరలో తొలి సెమిస్టర్‌ పరీక్షలు

విద్యార్థులకు యాజమాన్యాల వేధింపు

రూ.35 వేల ఫీజు చెల్లించాలని ఒత్తిడి

తలలు పట్టుకుంటున్న తల్లిదండ్రులు

రీయంబర్స్‌మెంట్‌పై స్పష్టతివ్వని ప్రభుత్వం

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో విద్యార్థులను ఆదుకున్న ‘విద్యా దీవెన’

సాక్షి, రాజమహేంద్రవరం: ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులపై జులుం ప్రదర్శిస్తున్నాయి. ఇంజినీరింగ్‌, డిగ్రీ విద్యార్థులకు తొలి సెమిస్టెర్‌ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఫీజు కడతారా..? లేదా..? అని వారిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారు. ట్యూషన్‌ ఫీజులో సగం చెల్లించాలని హుకుం జారీ చేస్తున్నాయి. ఒక్కసారిగా రూ.35 వేల నుంచి రూ. 60 వేలు చెల్లించాలంటే ఎలాగని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పరీక్షలకు అనుమతించాలంటే ఫీజు కట్టాల్సిందేనని తెగేసి చెబుతున్నాయి. ఈ పరిణామంతో పేద, మధ్య తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ‘విద్యా, వసతి దీవెన’ పథకాల్లో విద్యార్థులకు అవసరమైన సమయాల్లో ఆర్థిక ఆసరా అందేది. ప్రస్తుతం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఆ పథకాలకు మంగళం పాడింది. ఫీజు రియంబర్స్‌మెంట్‌ విధానాన్ని తీసుకువస్తామని ప్రకటనలు చేసింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెలలు గడుస్తున్నా.. నేటికీ అతీగతి లేదు. దీంతో అప్పులు చేసి ఫీజులు చెల్లించాల్సిన దుస్థితి ఎదురైందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఫీజుల దోపిడీపై పలు విద్యార్థి సంఘాలు ఉద్యమబాట పట్టేందుకు సన్నద్ధమవుతున్నాయి.

మితిమీరిన ఒత్తిళ్లు

ఇంజినీరింగ్‌, డిగ్రీ విద్యార్థులకు సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించేందుకు కళాశాల యాజమాన్యాలు నిర్ణయించాయి. పరీక్ష ఫీజు రూ.1,250 చెల్లించాలని నోటీసులు జారీ చేశాయి. చిన్న మొత్తమే కదా అని ఫీజు చెల్లించేందుకు వెళుతున్న విద్యార్థులకు ట్యూషన్‌ ఫీజులో సగం కడితేనే పరీక్ష ఫీజు చెల్లించేందుకు వీలుగా ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతుందని చావు కబురు చల్లగా చెబుతున్నారు. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో వసతులను బట్టి ట్యూషన్‌ ఫీజు రూ.43 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ఉంటుంది. సెమిస్టర్‌ పరీక్షలు రాయాలంటే రూ.32 వేల నుంచి రూ.63 వేల వరకు చెల్లించాల్సిందేనని పట్టుబడుతున్నారు. లేదంటే పరీక్షలకు అనుమతించబోమని కనికరం లేకుండా మాట్లాడుతున్నట్టు తెలిసింది. ఈ పరిణామం నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆవేదన నింపుతోంది. ఆ విద్యార్థులు కష్టపడి ఏపీఈసెట్లో ఉత్తమ ర్యాంక్‌ సాధించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉందనే భరోసాతో మంచి కళాశాలల్లో అడ్మిషన్లు పొందారు. తీరా ఫీజుల ఒత్తిడి ప్రారంభమవడంతో ఏం చేయాలో దిక్కుతోచక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్‌ సెకెండ్‌, థర్డ్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థులపై కళాశాల యాజమాన్యాలు తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. చేసేది లేక.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న తల్లిదండ్రులు ఎలాగోలా అప్పులు తెచ్చి ఫీజులు చెల్లిస్తుంటే.. మరి కొందరు చెల్లించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.

విద్యాదీవెనకు మంగళం

పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం విద్యాదీవెన పథకాన్ని తీసుకువచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, కాపులు, క్రైస్తవ వర్గాలకు చెందిన వేలాది మంది పేద విద్యార్థులు ప్రైవేటు డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చేరారు.

జిల్లా వ్యాప్తంగా సుమారు 10 ఇంజినీరింగ్‌ కళాశాలలు, 7 డిగ్రీ కళాశాలలు 7 ఉండగా.. 25 వేల మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో చదువుతున్నారు. వీరంతా గతంలో విద్యా దీవెన పథకంలో ఆర్థిక సాయం పొందేవారు. కళాశాలలను గ్రేడ్లుగా విభజించి ఏ–గ్రేడ్‌ కళాశాలలో చదివే వారికి ఏడాదికి రూ.18,400, బీ–గ్రేడ్‌ కళాశాలల్లో చదివేవారికి రూ.15,300 చొప్పున గత ప్రభుత్వం చెల్లించేది. నాలుగు దశల్లో ఫీజు రీయింబర్స్‌ చేసి సొమ్ములను విద్యార్థులు, తల్లుల ఉమ్మడి ఖాతాలలో జమ చేసింది. ఆ సొమ్ముతో విద్యార్థులు ఫీజులు కట్టేవారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లలో జిల్లాలోని 70,241 మంది విద్యార్థులకు రూ.142.99 కోట్లు చెల్లించింది.

రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టతేదీ?

గత ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యాదీవెన పథకానికి కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. ఆ పథకం స్థానంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తామని ప్రకటించింది. అధికారం చేపట్టి నెలలు గడుస్తున్నా నేటికీ పథకం విధి విధానాలపై స్పష్టత ఇవ్వలేదు. సాధ్యాసాధ్యాలపై స్పష్టత ఇచ్చే వరకు విద్యార్థులను ఫీజుల విషయంలో ఇబ్బందులు పెట్టవద్దని కళాశాల యాజమాన్యాలకు సైతం ప్రభుత్వం ఆదేశాలిచ్చిన దాఖలాలు లేవు. పథకం ఎప్పటి నుంచి అమలవుతుందన్న విషయంలో కూడా ఎలాంటి స్పష్టతా లేదు. అసలు అమలు చేస్తారా..? చేతులేత్తేస్తారా..? అన్న ప్రశ్న తల్లిదండ్రుల్లో ఉత్పన్నమవుతోంది. దీంతో రంగంలోకి దిగిన ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు తమ ఫీజులు రాబట్టుకునేందుకు విద్యార్థులపై ఒత్తిడి పెంచేశారు. ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులపై ఇవి మరింత తీవ్రమయ్యాయి. కాలయాపన చేసి పథకాన్ని నీరుగార్చేందుకు కూటమి ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

మితిమీరుతున్న ప్రైవేటు కళాశాలల ఆగడాలు

ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాల ఆగడాలు మితిమీరుతున్నాయి. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు పెద్ద ఎత్తున దోపిడీకి ఎగబడుతున్నాయి. డిగ్రీ, ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఫీజు వేధింపులు పెరిగిపోయాయి. ఫీజులు చెల్లించకపోతే పరీక్షలు రాయనివ్వబోమని చెప్పడం దారుణం. దీనిపై ఆందోళనలు ఉధృతం చేస్తాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఎప్పుడు అమలు చేస్తుందో ప్రకటించాలి.

– తాడేపల్లి విజయ్‌కుమార్‌, అంబేడ్కర్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు

యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎప్పుడు విడుదల చేస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఎవరి అకౌంట్‌లో జమ చేస్తారో చెప్పాలి. ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి బలవంతం వసూలు చేస్తున్నారు. ఫీజు కట్టకపోతే హాల్‌ టికెట్లు ఆపుతామని, సర్టిఫికెట్లు ఇవ్వకుండా భయపెట్టి విద్యార్థుల దగ్గర నుంచి ఫీజుల వసూళ్లకు పాల్పడుతున్నారు. అలాంటి యజమాన్యాలపై తక్షణం చర్యలు తీసుకోవాలి.

– వై.భాస్కర్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement