బర్డ్ ఫ్లూ కేసుల్లేవ్..
● విద్యార్థులకు కోడిగుడ్లు ఇవ్వండి
● కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాలు
అమలాపురం రూరల్: జిల్లాలో ఇంత వరకూ బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. శనివారం అమలాపురం కలెక్టరేట్‌లో బర్డ్ ఫ్లూపై ఆయన పశుసంవర్ధక శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పౌల్ట్రీల్లో ఇంతవరకూ బర్డ్ ఫ్లూ కేసులు కనిపించలేదని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో తిరిగి కోడిగుడ్లను విద్యార్థులకు అందించాలని ఆదేశించారు. కోడిగుడ్లు, మాంసం విక్రయాలపై ఎటువంటి ఆంక్షలు విధించవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విజయారెడ్డి, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి కె.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
రహదారి భద్రత నిరంతర ప్రక్రియ
రహదారి భద్రత నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. 36వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల ముగింపు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. జిల్లా రవాణా శాఖ అధికారి డి.శ్రీనివాసరావు మాట్లాడుతూ మానవ తప్పిదాలతో 97 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అనంతరం డ్రాయింగ్, వ్యాసరచన పోటీల్లో విజేతలకు కలెక్టర్ బహుమతులు ప్రదానం చేశారు. మోటారు వాహనాల తనిఖీ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, కాశీ, లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు.
సాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
ప్రస్తుత రబీ సీజన్‌లో సాగునీటి ఎద్దడి రాకుండా సుమారు రూ.1.08 కోట్లతో డ్రైనేజీలపై అడ్డుకట్టలు వేసి ఆయిల్ ఇంజిన్ల ద్వారా సాగునీటిని సరఫరా చేయడం, కాలువల గేట్ షట్టర్ల మరమ్మతులు, కాలువ గండ్లు పూడ్చటం వంటివి చేపడుతున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. కలెక్టరేట్‌లో జల వనరులు, డ్రైనేజీ విభాగ ఇంజినీర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మార్చి నెలాఖరులో సాగునీటి ఎద్దడి ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. జేసీ టి.నిషాంతి, జిల్లా వ్యవసాయ అధికారి బోసుబాబు, డ్రైనేజీ విభాగం కార్యనిర్వాహక ఇంజినీర్ ఎంవీవీ కిషోర్ పాల్గొన్నారు.
● అమలాపురం పరిసర ప్రాంతాల్లోని పంచాయతీలకు చెందిన చెత్తను డంపింగ్ యార్డ్‌కు తరలించి సీవరేజ్ ట్రీట్‌మెట్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తునట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో మున్సిపల్ అధికారులు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలతో సమావేశాన్ని నిర్వహించారు.
● జిల్లాలో విదేశాలకు వెళ్లి మోసపోయిన వారు, విదేశాలకు వెళ్లే వారికోసం, మధ్యవర్తిత్వం వహించే ఏజెంట్ల కోసం ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ గోదావరి భవన్‌లో విదేశీ వ్యవహారాల పట్ల పరస్పర అవగాహన సదస్సు నిర్వహిస్తామని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment